ఏక‌మ‌వుతున్న వైసీపీ వ్య‌తిరేక శ‌క్తులు…!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. అధికారం కోసం రెండు వ‌ర్గాల మ‌ధ్య  భీక‌ర‌పోరుకు స‌మ‌యం ముంచుకొస్తోంది. ఎలాగైనా అధికారాన్ని నిల‌బెట్టుకోవాల‌ని వైసీపీ త‌పిస్తుండ‌గా, తాము గ‌ద్దెనెక్కాల‌ని టీడీపీ-జ‌న‌సేన కూట‌మి ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి. ఇక మిగిలిన…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. అధికారం కోసం రెండు వ‌ర్గాల మ‌ధ్య  భీక‌ర‌పోరుకు స‌మ‌యం ముంచుకొస్తోంది. ఎలాగైనా అధికారాన్ని నిల‌బెట్టుకోవాల‌ని వైసీపీ త‌పిస్తుండ‌గా, తాము గ‌ద్దెనెక్కాల‌ని టీడీపీ-జ‌న‌సేన కూట‌మి ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి. ఇక మిగిలిన పార్టీల పాత్ర నామ‌మాత్ర‌మే. కాంగ్రెస్‌, బీజేపీ, వామ‌ప‌క్ష పార్టీల శ్రేణులు ఎన్నిక‌ల నాటి వాతావ‌ర‌ణాన్ని బ‌ట్టి మొగ్గు చూపే అవ‌కాశాలున్నాయి. అయితే ఆ పార్టీల వ్య‌వ‌హార శైలి చూస్తుంటే అధికార పార్టీకి వ్య‌తిరేకంగా న‌డుచుకునేలా ఉన్నాయి.

ఏది ఏమైనా అధికార పార్టీకి క్షేత్ర‌స్థాయిలో సానుకూలం ఎంత వుందో, వ్య‌తిరేక‌త కూడా అంతే వుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. గ‌త ఎన్నిక‌ల నాటి రాజ‌కీయ ప‌రిస్థితులకు, నేటికి చాలా వ్య‌త్యాసం వుంది. 2019 ఎన్నిక‌ల‌ప్పుడు అధికారంలో వున్న టీడీపీపై తీవ్ర వ్య‌తిరేక‌త‌, కేంద్ర ప్ర‌భుత్వం నుంచి స‌హాయ నిరాక‌ర‌ణ‌, అలాగే జ‌న‌సేన వేరుగా పోటీ చేయ‌డం, సుదీర్ఘ పాద‌యాత్ర చేసిన వైఎస్ జ‌గ‌న్‌కు ఒక్క చాన్స్ ఇవ్వాల‌నే సానుకూల వాతావ‌ర‌ణం వైసీపీకి క‌లిసొచ్చాయి.

2019 ఎన్నిక‌ల్లో వైసీపీ ఘ‌న విజ‌యానికి అనేక అంశాలు తోడ‌య్యాయి. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ముఖ్యంగా పార్టీ శ్రేణుల‌ను ఎంత వ‌ర‌కూ సంతృప్తి ప‌రిచార‌నేది నాయ‌కుల‌కే తెలియాలి. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో అధికార పార్టీ నాయ‌కుల‌పై క్షేత్ర‌స్థాయిలో అసంతృప్తి బ‌య‌ట ప‌డుతోంది. గ‌తంలో వైసీపీ అధికారంలో వున్న‌ప్పుడు జ‌గ‌న్ సీఎం కావాల‌నే ల‌క్ష్యంతో ఎంతో మంది స్వ‌చ్ఛంద సైనికులుగా ప‌ని చేశారు. అయితే వైసీపీ అధికారంలో వ‌చ్చిన త‌ర్వాత కార‌ణాలు తెలియ‌దు కానీ, ప్ర‌భుత్వంపై మెజార్టీ అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్ర‌హం క‌నిపిస్తున్నాయి.

గ‌తంలో మాదిరిగా టీడీపీ -జ‌న‌సేన కూట‌మిపై వైసీపీ త‌ర‌పున యుద్ధం చేయ‌డానికి ఎవ‌రూ ఆస‌క్తి చూప‌డం లేదు. మ‌రోసారి వైసీపీని అధికారంలోకి వ‌స్తే మంచిదే అని అంటున్నారే త‌ప్ప‌, అందుకోసం తాము ప‌ని చేయ‌డానికి నిరాస‌క్తి చూప‌డం అధికార పార్టీకి హెచ్చ‌రికే. బ్యాలెట్ పోరుకు అస్త్ర‌శ‌స్త్రాలు స‌మ‌కూర్చుకుంటున్న స‌మ‌యంలో ప్ర‌ధానంగా అధికార పార్టీ సైన్యం నిరాశ‌, నిస్పృహ‌ల‌తో ఉంద‌నే అనుమానం క‌లుగుతోంది.

మ‌రోవైపు టీడీపీ-జ‌న‌సేన కూట‌మి సైన్యం క‌సితో ర‌గిలిపోతోంది. ర‌క‌ర‌కాల కేసుల్లో ఇరికించ‌డం, చంద్ర‌బాబును జైలుకు పంప‌డం, అలాగే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై వైసీపీ వ్య‌క్తిగ‌త దాడి చేస్తోంద‌న్న ఆగ్ర‌హం ఆ పార్టీ సానుకూల ఓటర్ల‌లో వుంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ-జ‌న‌సేన ఉమ్మ‌డి మ్యానిఫెస్టో త‌యారీకి సిద్ధ‌ప‌డుతున్నాయి. అలాగే ఇంటింటికి రెండు పార్టీలు క‌లిసి వెళ్లాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చాయి. వైసీపీపై స‌మ‌రానికి టీడీపీ-జ‌న‌సేన కూట‌మి స‌న్న‌ద్ధం అవుతుంద‌నేందుకు ఆ రెండు పార్టీల ముఖ్య నేత‌లు త‌ర‌చూ భేటీ కావ‌డ‌మే నిద‌ర్శ‌నం.  

ప్ర‌స్తుతం వైసీపీ సామాజిక సాధికార‌త బ‌స్సుయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. అయితే యాత్ర‌కు సంబంధించి సానుకూల‌త ఎంత వ‌ర‌కూ వుందో అర్థం కావ‌డం లేదు. కేవ‌లం కొంత మంది చేత‌ల్లోనే అధికారం వుంద‌నే సంకేతాలు మాత్రం బ‌లంగా వెళ్లాయి. కేవ‌లం అణ‌గారిన వ‌ర్గాల‌కు ప‌ద‌వులు ఇచ్చి, ప‌వ‌ర్స్ మాత్రం జ‌గ‌న్ సామాజిక వ‌ర్గం నేత‌ల్లో ఉంచుకున్నార‌నే విమ‌ర్శ ప్ర‌తిప‌క్షాల వైపు నుంచి బ‌లంగా వినిపిస్తోంది. 

స‌హ‌జంగా ఐదేళ్లు ఏ పార్టీ అయినా అధికారంలో వుంటే, ఎంతోకొంత అసంతృప్తి వుండ‌డం స‌హ‌జం. అది ఎంత శాతం అనేది తెలియ‌డం లేదు. మ‌రోవైపు సంక్షేమ ప‌థ‌కాల‌ను మాత్రం దేశంలో  ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌ని విధంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేస్తోంది. ఇది వైసీపీకి పాజిటివ్ అంశం. దీన్నే వైసీపీ ప్ర‌ధానంగా న‌మ్ముకుంది.

అయితే ఎన్నిక‌ల్లో ర‌క‌ర‌కాల స‌మీక‌ర‌ణ‌లు ప‌ని చేస్తాయి. టీడీపీ-జ‌న‌సేన కూట‌మి పొత్తులో భాగంగా సీట్లు, నియోజ‌క‌వ‌ర్గాల పంపిణీలో త‌ప్ప‌క గొడ‌వ‌లు జ‌రుగుతాయ‌నే ప్ర‌చారం వుంది. టీడీపీలో అభ్య‌ర్థుల ఎంపిక గ‌మ‌నిస్తే చాలా చోట్ల పేల‌వంగా వుంది. ఇది వైసీపీకి లాభించే అవ‌కాశాలున్నాయి. మ‌రీ ముఖ్యంగా పోల్ మేనేజ్‌మెంట్ ప్ర‌ధాన భూమిక పోషించ‌నుంది. 

అధికార పార్టీని టీడీపీ-జ‌న‌సేన కూట‌మి ఏ మేర‌కు ఎదుర్కోగ‌ల‌ద‌నే అంశంపై అధికారం ఆధార‌ప‌డి వుంటుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌స్తుతానికి అటు, ఇటు రాజ‌కీయ ప‌క్షాలు మోహ‌రిస్తున్నాయి. ఇక యుద్ధ‌మే మిగిలి వుంది. యుద్ధ‌నీతులేవీ వుండ‌వు. గెలుపు గురించి మాత్ర‌మే జ‌నం మాట్లాడుకుంటారు. అందుకే గెలుపు కోసం ఇరు ప‌క్షాలు ఎన్ని అడ్డ‌దారులు తొక్క‌డానికైనా వెనుకాడ‌వ‌ని చెప్ప‌డం అతిశ‌యోక్తి కాదు.