వారెవ్వా.. అమిత్ షా హోస్ట్ ప్లేసులోకి ఆర్కే!

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ.. తెల్లప్యాంటు తెల్ల చొక్కా వేసుకోరు. అంతే తప్ప ప్రతి విషయంలోనూ తాను ఈనాడు రామోజీరావుకు సమానం అని భావిస్తూ ఉంటారు. లేదా ఆ స్థాయిని అందుకోవాలని ముచ్చటపడుతుంటారు. అలాంటిది.. అమిత్…

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ.. తెల్లప్యాంటు తెల్ల చొక్కా వేసుకోరు. అంతే తప్ప ప్రతి విషయంలోనూ తాను ఈనాడు రామోజీరావుకు సమానం అని భావిస్తూ ఉంటారు. లేదా ఆ స్థాయిని అందుకోవాలని ముచ్చటపడుతుంటారు. అలాంటిది.. అమిత్ షా గత పర్యటన సందర్భంగా రామోజీ ఇంటికి వెళ్లి, ఈ పర్యటనలో కేవలం రాజమౌళి ఇంటికి మాత్రం వెళితే ఊరుకుంటారా? ఎవరిని పట్టుకుని బతిమాలారో బెదిరించారో .. తెలంగాణలో పర్యటనకు వస్తున్న అమిత్ షా.. తన ఇంటికి కూడా వచ్చేలా ఆయన చక్రం తిప్పారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో చిన్న మార్పులు జరిగాయి. ఆయన హైదరాబాదు వచ్చిన తరువాత.. సినీ దర్శకుడు రాజమౌళితో భేటీ అవుతారనే వార్తలు ముందుగా వచ్చాయి. అయితే తాజాగా విడుదలైన ఆయన షెడ్యూలులో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఇంటికి కూడా వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా దేశమంతా తిరుగుతూ ఇతర రంగాలకు చెందిన అనేకమంది ప్రముఖులను వరుసగా కలుస్తూనే ఉన్నారు. అలాగే గతంలో రామోజీరావును కూడా కలిశారు. హీరో ఎన్టీఆర్ తో కూడా భేటీ అయ్యారు. 

కానీ ఆ రెండు భేటీలకంటె కూడా రాధాకృష్ణతో భేటీ చిత్రమైనది. ఎందుకంటే.. ఇప్పుడు ఏపీలో రాజకీయ వాతావరణం మారుతోంది. చంద్రబాబునాయుడు, ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయిన తరువాత.. నడ్డా, అమిత్ షా తమ తమ సభల్లో జగన్ వ్యతిరేక వ్యాఖ్యలతో విరుచుకుపడిన సంగతి అందరికీ తెలుసు. అయితే కేవలం తనమీద కక్షతో చేస్తే మరోలా ఉంటుందని, ఇదంతా కూడా బిజెపికి తెలుగుదేశంతో పొత్తులు కుదురుతున్న సంకేతాలగా భావించాలని వైసీపీ శ్రేణులు అనుకుంటున్నాయి.

అదే సమయంలో చంద్రబాబును అధికార పీఠం మీదికి తీసుకురావడానికి శక్తివంచన లేకుండా పాటుపడుతున్న వారిలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా ఉన్నారు. అందుకోసం అడ్డగోలుగా అబద్ధాలు వండివార్చడంలో ఆయన ఆరితేరిపోయారు. ఇప్పుడు అమిత్ షా ఆయనతో భేటీ కాబోవడం అనేది ఖచ్చితంగా చంద్రబాబునాయుడుతో పొత్తు గురించిన చర్చలకు ఆస్కారం కల్పిస్తుంది. పొత్తు మంచిదనే సలహానే ఆర్కే ఇస్తారు. ఆయన అమిత్ షాకు వ్యక్తిగతంగా ఆతిథ్యం ఇవ్వబోతున్నారు.

ఎన్టీఆర్ ను ఆ రోజుల్లో గద్దెమీదకు తీసుకువచ్చిన రామోజీరావు లాగానే, చాలామంది సోషల్ మీడియాలో ఒక వెబ్ సైటు ప్రారంబించేసి.. తాము కూడా కింగ్ మేకర్ అయిపోవాలని, తమ కనుసన్నల్లోనే టికెట్ల కేటాయింపు కూడా జరగాలని ఉవ్విళ్లూరే వారు అనేకమంది ఉంటున్నారు. అలాంటి సమయంలో తాను ఖచ్చితంగా కింగమేకర్ కావడానికి అమిత్ షాతో భేటీ ఉపయోగపడుతుందని రాధాకృష్ణ మురిసిపోతూ ఉండొచ్చు.