పూర్వ అనంతపురం జిల్లా పరిధిలో కమ్మ కులస్తుల జనాభా మూడు శాతాన్ని మించదు! అది కూడా వారి జనసాంద్రత ఉన్నది కొన్ని మండలాల పరిధిలోనే అధికం. కొన్ని మండలాలు, నియోకవర్గాల పరిధిలో వారి జాడ ఏ మాత్రం కనిపించదు కూడా! 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పూర్వ అనంతపురం జిల్లా పరిధిలో కమ్మ వాళ్ల జనాభా అలా చాలా పరిమితం అయినా, వారు ఏ రకంగానూ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాకపోయినా.. రాజకీయంలో వారు క్రియాశీలకం అయ్యారు. సామూహికంగా వారు ఒకే పార్టీకి ఓటేస్తారనే పేరు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఆ కులస్తులు రాజకీయంగా విపరీతమైన ప్రాధాన్యత పొందడం కమ్మ కులం పేరు అక్కడ రాజకీయంగా మార్మోగడానికి ముఖ్య కారణం.
సాధారణంగా ఏదైనా కులం ఒక చోట రాజకీయంగా రాణిస్తోందంటే.. ఎంతో కొంత ప్రభావం జనాభాది కూడా ఉంటుంది. ఏ పది శాతం అయినా వారి జనాభా వుంటే వారికి అవకాశాలు మరింత మెరుగ్గా ఉంటాయి. అయితే పూర్వ అనంతపురం జిల్లాలో కమ్మ వాళ్ల జనాభా మూడు కు మించకపోయినా.. అటు నుంచి ఇటువరకూ ఎమ్మెల్యే పదవుల విషయంలో వారే ముందుంటారు! 2014-19 ల మధ్యన కల్యాణదుర్గం, అనంతపురం, హిందూపురం, ధర్మవరం, రాప్తాడు ఈ ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలూ కమ్మ వాళ్లే. తెలుగుదేశం పార్టీ తరఫున వారు ఎమ్మెల్యేలు.
ఇక ఉరవకొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అప్పుడు ఓడిపోయారు, పయ్యావుల కేశవ్. ఆయనకు ఆ తర్వాత అప్పట్లోనే ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇక వీరు గాక.. నామినేట్ పోస్టుల్లో కమ్మ వాళ్లకే అగ్రతాంబూలం దక్కేది. మరి కొన్ని చోట్ల.. ప్రత్యేకించి ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో, కొందరు బీసీ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న సీట్లలో కూడా అనధికారికంగా కమ్మ వాళ్లదే హవా! ఇదే పరిస్థితి 2019 వరకూ కొనసాగింది. ఆ ఎన్నికల్లో మళ్లీ జిల్లాలో సగం సీట్లలో కమ్మ అభ్యర్థులే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు. కానీ పరిస్థితి అడ్డం తిరిగింది.
పరిటాల సునీత తనయుడు శ్రీరామ్, వరదాపురం సూరి, హనుమంతరాయచౌదరి ఫ్యామిలీ, వైకుంఠం ప్రభాకర్ చౌదరి.. వీళ్లంతా ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయారు. ఇలా తెలుగుదేశం ఓడిపోయింది, కమ్మ నేతలూ ఓడిపోయారు. విశేషం ఏమిటంటే.. ఇప్పటికీ ఈ నియోజకవర్గాలు దాదాపు వారి చేతిలోనే ఉన్నాయి. పూర్వ అనంతపురం జిల్లా పరిధిలో కమ్మ వాళ్ల జనాభా మూడు శాతమే అయినా, ఇలా అరడజనుకు పైగా నియోజకవర్గాలు కమ్మ నేతల ప్రాబల్యంలోనే ఉన్నాయి. వచ్చేసారికి ఇంకా ఒకరో ఇద్దరో అదనంగా పెరిగినా పెద్ద ఆశ్చర్యం లేదు. ఇలా తగ్గేదేలే లేదన్నట్టుగా ఉంది పరిస్థితి.
అనంతపురం జిల్లా రాజకీయాల్లో టీడీపీ మొదటి నుంచి తమది బీసీల పార్టీగా చెప్పుకుంటూ ఉంది. బీసీల ఓట్లతో టీడీపీ ఈ జిల్లాలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. అయితే టీడీపీ తయారు చేసిన బీసీ నేతలు మాత్రం ఎవ్వరూ కనపడరు! ఓట్లు బీసీలవి, సీట్లు కమ్మ వాళ్లవి అన్నట్టుగా మారింది పరిస్థితి.
ఇక కాంగ్రెస్- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో రెడ్ల హవా కాదనలేనిది. అయితే వారి ఓట్ల శాతం చాలా మెరుగు. పూర్వ అనంతపురం జిల్లా పరిధిలో తీసుకుంటే, కనీసం 18 నుంచి 20 శాతం వరకూ రెడ్ల ఓట్లు ఉంటాయి. ఎలాగూ బీసీల ఓట్లపై ఆశల తక్కువ. దీంతో ఈ పార్టీల్లో అంత తేలికగా లీడర్లు ఎదగలేదు. అయితే గత ఎన్నికల్లో జగన్ వ్యూహం మార్చి రెండు ఎంపీ సీట్లనూ బీసీలకు కేటాయించారు.
ఎమ్మెల్యే టికెట్ కేటాయింపుల్లో కూడా ప్రాధాన్యతను పెంచాడు. దీంతో తెలుగుదేశం పార్టీకి చుక్కలు కనిపించాయి. జగన్ గాలికి తోడు.. ఈ బీసీ వ్యూహంతో తెలుగుదేశం పార్టీని కూకటి వేళ్లతో పెకలించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
కట్ చేస్తే.. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ ఎంపీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ కమ్మ ప్రముఖులు అనే టాక్ నడుస్తోంది. కమ్మ వాళ్లు తనపై కుట్ర చేస్తున్నారంటూ గోరంట్ల మాధవ్ వాపోతున్నారు. మాధవ్ పై సైబర్ దాడి విషయంలో ఫేస్ బుక్ లో కమ్మ కులం పేజ్ లు కూడా క్రియాశీలకంగా పని చేయడం గమనార్హం! తెలుగుదేశం పార్టీ కోసమే ఈ పేజీలు పని చేస్తుండవచ్చు.
మొత్తానికి తెలుగుదేశం పార్టీ తరఫున లీడర్లంతా కమ్మవాళ్లే ఉంటారు. ఎవరైనా బీసీ నేతలున్నా.. వారు పరిటాల కనుసన్నల్లో పని చేయాలి, పయ్యావులకు కోపం తెప్పించకూడదన్నట్టుగా ఉండేది టీడీపీ లో పరిస్థితి. అందుకు భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నేతల రాజకీయంతో అనంత పరిధిలో టీడీపీకి చావుదెబ్బ తీయగా, ఇప్పుడు సరిగ్గా ఆ బీసీ లీడర్లు టార్గెట్ కావడం గమనార్హం!
మొత్తానికి టీడీపీ వ్యవహారం అంటే అది కమ్మ వారి వ్యవహారమా లేక కమ్మ వారి ఆధిపత్యానికి దెబ్బ పడటం అంటే అది టీడీపీకి ప్రతిష్టాత్మకమా అనే చర్చ జరుగుతోంది అనంత పొలిటికల్ సర్కిల్స్ లో!