Advertisement

Advertisement


Home > Politics - Analysis

రాజకీయ అవసరాలే తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా..?

రాజకీయ అవసరాలే తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా..?

ఎమ్మెల్యేల, ఎంపీలపరంగా దేశంలో పెద్ద రాష్ట్రం.. ఉత్తరప్రదేశ్. ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అయితే యూపీలో కంటే ఏపీలోనే బీజేపీ బలంగా ఉందని ప్రజలు వెటకారంగా చర్చించుకుంటున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీ లేకపోయినా.. ఆ పార్టీ తరఫు రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకే ఓట్లన్నీ పడటం గమనార్హం. అయితే రాష్ట్రపతి ఎన్నిక విధానం వేరే పద్దతిలో వుంటుంది అది వేరే విషయం. 

ఇక్కడ చెప్పుకోదగ్గ ప్రదాన అంశం ఏమిటంటే.. చివరకు ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనూ ద్రౌపది ముర్ముకు అన్ని ఓట్లు రాలేదు. ఒక్క సీటూ లేకపోయినా ఆంధ్రప్రదేశ్ లోనే అన్ని ఓట్లు ఆమెకు పడ్డాయని చెబుతున్నారు. అంటే బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకంటే ఏపీలోనే బీజేపీ బలంగా ఉందని ప్రజలు వ్యంగ్యంగా చర్చించుకుంటున్నారు.

కేజీఎఫ్ సినిమాలో సలామ్ రాకీ భాయ్ లాగా.. ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు నేతలు సలామ్ మోడీ భాయ్ అంటున్నారా..? అంటే అవుననే అంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ పార్టీ అశాస్త్రీయంగా విభజిస్తే దానికి బీజేపీ వంతపాడింది. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాలా న్యాయం చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ హామీలిచ్చింది. ఏపీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని తప్పుడు అబద్ధపు హామీలిచ్చిందని గుర్తు చేస్తున్నారు. అయితే వరుసగా రెండుసార్లు 2014, 2019 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా ఆంధ్రప్రదేశ్ కు ఒరిగిందేమీలేదని అంటున్నారు.

అందులోనూ టీడీపీ అధినేత చంద్రబాబు 2014 ఎన్నికల్లోనూ బీజేపీకి మద్దతు ప్రకటించారు. మోడీ ప్రభుత్వంలో మంత్రి పదవులు కూడా తీసుకున్నారు. అయినా ఏపీకి కావాల్సిన, రావాల్సిన వాటిని సాధించలేకపోయారని అంటున్నారు.

2019 నుంచి ఇప్పటివరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వైఎస్ జగన్ సమర్థించారని చెబుతున్నారు. అన్ని సందర్భాల్లో తన పార్టీ ఎంపీల మద్దతు అవసరమైనప్పుడు పార్లమెంటులో బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచారని అంటున్నారు అయినా కేంద్రం మన వైపు చిన్న చూపు చూస్తుందని ఏద్దేవ చేస్తున్నారు.

ఇక బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్ కూడా తన పరిచయాలను ఉపయోగించి రాష్ట్రానికి ఏమీ పట్టుకురాలేకపోయారని అంటున్నారు. పలుమార్లు ఢిల్లీ వెళ్లినా ప్రధాని మోడీని కలిసి రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చించి ఉంటే పవన్ కల్యాణ్ క్రెడిబిలిటీ పెరిగేదని చెబుతున్నారు. అయితే పవన్ ఈ అవకాశాన్ని వదులుకున్నారని పేర్కొంటున్నారు. ఇప్పటికీ ఈ పార్టీలు.. జనసేన టీడీపీ ఇలాగే వ్యవహరిస్తున్నాయని అంటున్నారు.

ఇక చంద్రబాబు 2019 ఎన్నికల ముందు బీజేపీతో చెడిపోయిన సంబంధాలను పునరుద్ధరించుకోవాలని తలపోస్తున్నారని చెబుతున్నారు. మళ్లీ బీజేపీతో తన సంబంధాలను పూర్వం మాదిరిగానే చక్కగా చేసుకుని మరోమారు పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రిని కావాలని ఉబలాటపడుతున్నారని అంటున్నారు.

ఇక పవన్ కల్యాణ్ కూడా బీజేపీ తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆశిస్తున్నారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రోడ్ మ్యాప్ ఇచ్చి తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని పవన్ కోరుకుంటున్నారని అంటున్నారు. ఇలా పవన్, చంద్రబాబు ఇరువురు సలామ్ మోడీ భాయ్ అంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలను ప్రజలు మర్చిపోవాల్సిందేనని సూచిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?