జగన్ ను అధికారం నుంచి కిందకు లాగేసి, తాను అధికారంలో కూర్చోవడానికి ఎలాంటి త్యాగానికైనా సిద్దం అంటున్నారు నారా చంద్రబాబు నాయుడు. దాంతో జనసేన జనాలు ఉబ్బి తబ్బిబ్బై పోతున్నారు. అక్కడితే సిఎమ్ కుర్చీ సీటునే చంద్రబాబు త్యాగం చేసి పవన్ కళ్యాణ్ కు ఇచ్చేస్తాడన్నంత ఆలోచనతో.
పవన్ కళ్యాణ్ సిఎమ్ కుర్చీలో కూర్చోవాలి అంటే కనీసంలో కనీసం 60 ఎమ్మెల్యే స్థానాలు అయినా గెల్చుకోవాలి. అప్పుడు ఆ సీటు గురించి కనీసం డిమాండ్ చేసే అవకాశం వస్తుంది. ఆ రేంజ్ స్థానాలు లేకుండా చంద్రబాబు మాత్రం సిఎమ్ సీటును ఎలా వదులుకుంటారు. పవన్ కు అన్ని సీట్లు రావాలి అంటే పొత్తు ధర్మంలో భాగంగా కనీసం 75 సీట్లు జనసేనకు వదిలేసి, 100 సీట్లలో తెలుగుదేశం పోటీ చేయాలి. ఇది జరిగేపనేనా?
సరే ఈ సంగతి అలా వుంచుదాం. చంద్రబాబు ఇలాంటి త్యాగాల ప్రకటన గతంలోనూ చేసారు. అయితే బహిరంగంగా కాదు. నందమూరి కుటుంబంలో. లక్ష్మీ పార్వతిని సాకుగా చూపించి, బూచిగా మార్చి, ఎన్టీఆర్ గద్దె దింపాలనుకున్నారు. ఇందుకు సహకరిస్తే ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అధ్యక్షుడిగా హరికృష్ణ, ఉప ముఖ్యమంత్రిగా దగ్గుబాటి అనే ఆశలు కల్పించాలని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. కానీ ఏమయింది.
స్వర్గాన వున్న నందమూరి హరికృష్ణకు తెలుసు. బతికి వున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు కు తెలుసు చంద్రబాబు త్యాగం అనేది ఎలా వుంటుందో?
కొడుకు లోకేష్ ను నందమూరి అల్లుడు లోకేష్ గా మార్చి బాలకృష్ణను ఎమ్మెల్యేకే పరిమితం చేసారు తప్ప మంత్రిని కానివ్వలేదు. అందువల్ల బాబు నీడలో ఎవరికి ఎంత మేరకు చాన్స్ వుంటుందో అందరికీ అనుభవమే. పాపం, పవన్ కే అనుభవం కాలేదు ఇంకా. ఒకసారి కనుక బాబుతో చేతులు కలిపి జగన్ ను దింపేసి, అధికారం అందిస్తే అప్పుడు అనుభవంలోకి వస్తుంది బాబుగారి త్యాగం అంటే అట్నుంచి కాదు, ఇట్నుంచే వుండాల్సి వస్తుందని.
జగన్ ను దించడానికి తన పార్టీ బలం సరిపోదని, అన్ని పార్టీల బలం కావాలని బహిరంగంగానే పిలుపు ఇస్తున్నారు చంద్రబాబు. నిజానికి కావాల్సింది పార్టీల బలం కాదు. ప్రజా బలం కావాలి. ప్రజాబలం వుంటే ఏ ఒక్క పార్టీ గట్టిగా ముందుకు వచ్చి నిలబడితే చాలు జనం దాని వెనుక నిల్చుంటారు. అలా నిల్చోడం లేదు అంటే అప్పుడు ఆలోచించుకోవాలి. అంతే తప్ప అందరం కలిసిపోయి జగన్ ను దించేయాల్సిందే అని ఆతృత పడితే సరిపోదు.
అయినా చంద్రబాబు ఏమిటి? జనాలకు రండి..కదలిరండి..జగన్ ను దింపేద్దాం అని పిలుపు ఇవ్వకుండా పార్టీలకు, వాటి నాయకులకు, రండి అధికారం పంచుకుందాం..కావాలంటే త్యాగాలకు సిద్దం అంటారు? ఇదంతా చూస్తుంటే తన వయసు అయిపోతోంది. అర్జంట్ గా ఏదో ఒకటి చెేసి జగన్ ను దింపేయాలి ఎలాగో అలా అన్న తాపత్రయం కనిపిస్తోంది తప్ప చిత్త శుద్ది కాదు.