భాజపా ఓటమి..తేదేపా సంబరం

ఊళ్లో పెళ్లికి ఎవరో హడావుడి చేసారన్నట్లు వుంది వ్యవహారం. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది. భాజపా ఓడింది. ఎప్పుడో రెండు సార్లు తప్పితే వరుసగా అధికారంలోకి వచ్చిన వైనం కర్ణాటకలో లేదు. ఆ సంగతి అలా…

ఊళ్లో పెళ్లికి ఎవరో హడావుడి చేసారన్నట్లు వుంది వ్యవహారం. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది. భాజపా ఓడింది. ఎప్పుడో రెండు సార్లు తప్పితే వరుసగా అధికారంలోకి వచ్చిన వైనం కర్ణాటకలో లేదు. ఆ సంగతి అలా వుంచితే ఇలా ఓడి పోవడం వెనుక సవాలక్ష కారణాలు. 

అవన్నీ పక్కన పెడితే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి అండ్ కో కావచ్చు, కాంగ్రెస్ జనాలు కావచ్చు సంబరాలు చేసుకున్నారంటే అర్థం వుంది. ఆంధ్రలో భాజపా వ్యతిరేకులు అనే వాళ్ళు వుంటే వాళ్లు ఆనందించారు అంటే అర్థం వుంది. కానీ భాజపాతో పొత్తు కోసం గత నాలుగేళ్లుగా కిందా మీదా అయిపోతోంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీతో భాజపాను ముడేయడానికి సంధానకర్త పవన్ కళ్యాణ్ తన కృషి తాను చేస్తున్నారు. భాజపా-తేదేపా-జనసేన పొత్త పక్కా అని పదే పదే చెబుతున్నారు.

కానీ ఇలాంటి నేపథ్యంలో భాజపా కర్ణాటకలో ఓడిపోతే, తెలుగుదేశం జనాలు, అభిమానులు, అను’కుల’ మీడియా తెగ ఆనందపడిపోతున్నాయి. భలే..అయింది..ఇలాగే కావాలి అనే విధంగా తన ఆనందాన్ని ట్వీట్ లు, పోస్ట్ లు, ఆర్టికల్స్ రూపంలో తెగ ప్రదర్శిస్తూనే వున్నారు. ఇవన్నీ చూస్తుంటేనే భాజపా మీద తెలుగుదేశం అనుకూల సామాజిక వర్గానికి, అను’కుల’ మీడియాకు ఎంత కసి వుందో అర్థం అవుతోంది. మరి ఇంత కసి వుండి కూడా మోడీ ప్రాపకం కోసం చంద్రబాబు ఎందుకు అంతలా ప్రయత్నిస్తున్నారు అనే దానికి మాత్రం అర్థం లేదు. సమాధానం లేదు.

ఇటు వాట్సాప్ లో కావచ్చు, అటు ట్విట్టర్లో కావచ్చు, ఇక ఈ అనుకుల మాధ్యమాల్లో కావచ్చు భాజపా వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కానీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ లాంటి కీలక నేతలు మాట్లాడలేదు అనుకోండి. కానీ తేదేపా అనుకుల సామాజిక వర్గం, లేదా మీడియా హడావుడి మాత్రం మామూలుగా లేదు. దక్షిణాది మొత్తం భాజపాను ఈడ్చి అవతల వేసింది అంటూ తెగ హడావుడి చేస్తున్నారు.

అసలు దక్షిణాదిలో కర్ణాటక తప్ప మిగిలిన చోట్ల భాజపా బలంగా పాదుకున్నది ఎప్పుడు? చంద్రబాబు ఎంచి ఎంచి తనకు కావాల్సిన వారిని భాజపాలోకి పంపి, అక్కడ గెలిపించి మంత్రులను చేసారు తప్ప భాజపా స్వంత బలం ఏమీ కాదు. తెలంగాణ, కేరళ పరిస్థితి తెలిసిందే. ఇంతో అంతో పోరాటం చేస్తున్నది తెలంగాణలో మాత్రమే. ఈ మాత్రం దానికి టోటల్ దక్షిణాదిలో ఓడిపోయింది, తోసి అవతలకు విసిరారు అనే రేంజ్ లో వార్తలు వండి వారుస్తున్నారు.

మోడీ, అమిత్ షా ఒంటెద్దు పోకడలు పోయి వుండొచ్చు. ఆదానీకి పెద్ద పీట వేసి వుండొచ్చు. ధరల నియంత్రణ గాలికి వదిలేసి వుండొచ్చు. ఇంకా ఇంకా చాలా తప్పిదాలు చేసి, మీడియాను, ప్రాంతీయ పార్టీలను నియంత్రణలో పెట్టి భాజపా పాలన సాగించి వుండొచ్చు. కానీ జనాలు ఒకసారి కాకుంటే మరోసారి నిజం తెలుసుకుంటారు. కర్ణాటకలో అదే జరిగింది. మితిమీరిన అవినీతి తదితర వ్యవహారాలు, చిరకాలంగా కర్ణాటకలో అయితే ప్రతిపక్షంలో లేదా అధికారంలో వుంటూ వచ్చే రాజకీయ పార్టీకి ఏ విధమైన అవలక్షణాలు ఏర్పడతాయో భాజపాకు కూడా అవే ఏర్పడ్డాయి. అన్నీ కలిసి ఓటమికి దారి తీసాయి.

ఇంతకూ ఈ విషయం మీద తెలుగుదేశం అనుకూల సామాజిక వర్గం, అనుకుల మీడియా ఆనందానికి అర్థం ఏమిటి? 2019లో చంద్రబాబు ఓటమికి పరోక్షంగా కారణమైన భాజపాకు తగిన శాస్తి జరిగిందనా? కానీ 2024లో భాజపా అండ కోరుకుంటున్నారు కదా? భాజపా కేంద్రంలో అధికారంలోనే వుంది. 2024 టైమ్ కు వుంటుంది. మరి మళ్లీ ఇటు వైకాపాకో, అటు తేదేపాకో సహకరించక తప్పదు. తేదేపా-భాజపాలను దగ్గర చేయాలన్న ప్రయత్నాలు ఓ పక్క సాగుతున్నాయి. ఇలాంటపుడు ఎవరైనా కాస్త న్యూట్రల్ గా వుండాలనుకుంటారు. కానీ తేదేపా అనుకూల వర్గం అలా వుండాలనుకోవడం లేదు. ఎందుకని?

భాజపా తన దగ్గరకు రాదని తేదేపా ఇంకా భావిస్తోందా? లేదా తమ దగ్గరకు రాకపోతే ఇలా వుంటుంది పరిస్థితి అని భాజపాకు ఈ విధంగా సంకేతాలు ఇస్తోందా? ఇంతకీ అవసరం అయితే ఒకలా, లేకుంటే ఇంకోలా వుండగల సత్తా, నీచ ప్రవర్తన ఆ వర్గానికి వుందని భాజపా ఇప్పటికైనా గ్రహిస్తుందా? అలా గ్రహిస్తే పవన్ కాదు కదా, ఎంత మంది వుంటే అంత మంది కట్టకట్టుకుని వచ్చినా భాజపా-తేదేపా దగ్గరకు రమ్మన్నా రాదు. మీడియా మొగళ్లు, అమిత్ షా లాంటి వాళ్లను ప్రసన్నం చేసుకుని ఎన్ని ప్రయత్నాలు చేసినా మోడీ ప్రసన్నం కారు.

ఇప్పటికే ఒకటికి రెండు సార్లు మొడీ తేదేపా అనుకుల వర్గం ద్వంద వైఖరిని చవిచూసారు. అందుకే మొండిగా చంద్రబాబుకు దూరంగా వుండిపోయారు. ఇప్పుడు కర్ణాటకలో భాజపా ఓడిపోగానే అదే వర్గం సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో జడలు విప్పుకుంది. ఈ సంగతి మోడీ గ్రహించాల్సి వుంది. చంద్రబాబు అసలు రూపం మరోసారి అర్థం చేసుకోవాల్సి వుంది.