Advertisement

Advertisement


Home > Politics - Analysis

లోక్ స‌భ సీట్లు ప‌దైనా రాకపోతే.. రేవంత్ కు ఇబ్బందేనా!

లోక్ స‌భ సీట్లు ప‌దైనా రాకపోతే.. రేవంత్ కు ఇబ్బందేనా!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అవ‌స‌ర‌మైన మెజారిటీని సాధించి అధికారాన్ని పొందిన కాంగ్రెస్ పార్టీకి లోక్ స‌భ ఎన్నిక‌లు వెనువెంట‌నే వ‌చ్చిన పెద్ద స‌వాల్! కాంగ్రెస్ పార్టీకి స‌మ‌యం వ‌చ్చి తెలంగాణ‌లో అధికారం ద‌క్కి ఉన్నా, ఎన్నిక‌ల ముందు ఆ పార్టీ స‌వాల‌క్ష హామీల‌ను ఇచ్చి కూర్చుంది. వాటి అమ‌లు గురించి ఇప్పుడు ప్ర‌తిప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నాయి. ఆరు గ్యారెంటీలు అంటూ కాంగ్రెస్ చాలా మాట‌లే చెప్పింది. అందులో ప్ర‌ధాన‌మైన‌ది రెండు ల‌క్ష‌ల్లోపు రైతు రుణాల మాఫీ. అది ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌ర‌గ‌లేదు. దీనికి ఆగ‌స్టు 15 వ తేదీని గ‌డువుగా చెప్పుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

మ‌రి అది సాధ్యం అయ్యే ప‌నేనా అనేది ఒక ప్ర‌శ్న అయితే, ఇప్పుడు లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కు క‌నీసం ప‌ది ఎంపీ సీట్లు అయినా ద‌క్క‌క‌పోతే రేవంత్ రెడ్డిపై అధిష్టానం నుంచి గ‌ట్టి ఒత్తిడి పెరుగుతుంద‌నేది కాంగ్రెస్ రాజ‌కీయం తెలిసిన వారు చెబుతున్న మాట‌! తెలంగాణ‌లో 17 లోక్ స‌భ సీట్ల‌కు గానూ క‌నీసం ప‌ది సీట్లు అయినా గెల‌వాలి కాంగ్రెస్ పార్టీ. అప్పుడే అసెంబ్లీ ఎన్నిక‌ల నాడు క‌నిపించిన అనుకూల‌త ఇప్పుడు కూడా ఆ పార్టీకి ఉంద‌ని రుజువు.

ప‌దింట గెలిస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌పై త‌న ప‌ట్టును నిలుపుకున్న‌ట్టే. అప్పుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం వ‌ద్ద మంచి మార్కులే ప‌డ‌తాయి! అందుకు ప్ర‌తిఫ‌లంగా రేవంత్ రెడ్డికి పార్టీ హై క‌మాండ్ కాస్త ఫ్రీ హ్యాండ్ కూడా ఇవ్వొచ్చు పాల‌న‌లో! సీఎం హోదాలో రేవంత్ రెడ్డి త‌ను అనుకున్న వాళ్ల‌ను కేబినెట్లోకి తీసుకోవ‌డానికి అయినా, ఎమ్మెల్సీ- రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాల విష‌యంలో అయినా.. ఈ ప‌ది లోక్ స‌భ సీట్లలో విజ‌యం అనేది కీల‌క పాత్ర పోషిస్తుంది. ప‌ది లోక్ స‌భ సీట్ల‌లో కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ ను స‌మ‌ర్థుడిగా కాంగ్రెస్ పార్టీ హైక‌మాండ్ గుర్తిస్తుంది.

అలాగే మీడియాలో కూడా రేవంత్ రెడ్డి ప్ర‌భ పెరుగుతుంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెల‌వ‌డం గాలివాట కాద‌ని, ఆ పార్టీని పునాదుల్లోంచి గ‌ట్టి ప‌డింద‌నే క్రెడిట్ రేవంత్ ఖాతాలోకి వెళ్తుంది. రేవంత్ మాట‌ల జోరు కూడా పెరుగుతుంది. ప్ర‌త్య‌ర్థుల మీద ఆయ‌న దాడి కూడా తీవ్ర‌త‌రం అవుతుంది. అలాగే హామీల అమ‌లు విష‌యంలో కూడా కాస్త జాప్యానికి అవ‌కాశం దొరుకుతుంది. ప్ర‌జ‌లు త‌మ‌ను న‌మ్ముతున్నార‌నే వాద‌న‌తో కొన్నాళ్ల పాటు బండిని లాగించ‌డానికీ అవ‌కాశం ఏర్ప‌డుతుంది!

అయితే ప‌ది లోక్ స‌భ సీట్ల‌లో విజ‌యానికి కాస్త త‌గ్గితే మాత్రం.. రేవంత్ కు క‌ష్టాలు మొద‌లైన‌ట్టేనేమో! అంత‌టితో రేవంత్ కు సీఎంగా హ‌నీమూన్ పిరియడ్ ముగిసిన‌ట్టే! సొంత పార్టీలో ఇప్ప‌టికే రేవంత్ అంటే ప‌డ‌ని వాళ్లు ప్ర‌స్తుతానికి కామ్ గా ఉన్నా, లోక్ స‌భ సీట్ల‌లో కాంగ్రెస్ హ‌వా లేక‌పోతే రేవంత్ మీద నోరు విప్ప‌డానికి వారు వెనుకాడ‌రు! తెలంగాణ కాంగ్రెస్ లో చాలా మంది సీఎం అభ్య‌ర్థులున్నార‌నే సంగ‌తీ చెప్ప‌న‌క్క‌ర్లేదు! 

కాబ‌ట్టి.. లోక్ సీట్ల గెలుపులో కాంగ్రెస్ వెనుబ‌డితే వారు త‌మ ప్ర‌య‌త్నాల‌ను మొద‌లుపెట్టుకునే అవ‌కాశాలు పెరుగుతాయి! రేవంత్ పై అధిష్టానానికి వారు ఫిర్యాదులు మోస్తార‌నడంలోనూ వింత లేదు! అన్నింటికీ మించి మినిమం ప‌ది లోక్ స‌భ సీట్లు అయినా ద‌క్క‌క‌పోతే అధిష్టానానికి రేవంత్ పై న‌మ్మ‌కం స‌న్న‌గిల్లుతుంది. రేవంత్ ను న‌మ్ముకుంటే కుద‌ర‌న‌ద‌ని అధిష్టానం ఫిక్స‌యినా పెద్ద ఆశ్చ‌ర్యం లేదు!

ఇప్ప‌టిక‌ప్పుడు రేవంత్ సీఎం సీటుకు వ‌చ్చిన ఇబ్బంది ఏమీ లేక‌పోయినా.. అధిష్టానం వ‌ద్ద ఆయ‌న ప్రాపకం త‌గ్గుతుంది. తాము చెప్పిన‌ట్టుగా చేయాల‌నే డైరెక్ష‌న్లు రేవంత్ కు ఢిల్లీ నుంచి ఎక్కువ అవుతాయి. మంత్రివ‌ర్గం, ఇత‌ర నామినేటెట్ పోస్టుల్లో రేవంత్ మాట‌కు పెద్ద‌గా విలువ ఉండ‌దు! ఇలా లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు రేవంత్ ను గ‌ట్టిగానే ప్ర‌భావితం చేసేలా ఉన్నాయి. కాంగ్రెస్ కు ఉత్త‌రాదిపై ఉన్న ఆశ‌లు త‌క్కువే! క‌ర్ణాట‌క‌, తెలంగాణ రాష్ట్రాల‌పై కాంగ్రెస్ పార్టీ గ‌ట్టి ఆశ‌లు పెట్టుకుంది. 

క‌ర్ణాట‌క‌లో క‌నీసం స‌గం లోక్ స‌భ సీట్లు ద‌క్కుతాయ‌ని, తెలంగాణ‌లో ప‌ది ఎంపీ సీట్లు అయినా ద‌క్కితే.. జాతీయ స్థాయిలో త‌మ కౌంట్ ఒక 25 వ‌ర‌కూ పెరుగుతాయ‌నే లెక్క‌లు కాంగ్రెస్ కు ఉన్నాయి. ఈ రాష్ట్రాల నుంచినే వీలైన‌న్ని సీట్ల‌ను సాధించుకోవాల‌నేది ఆ పార్టీ స్వ‌ప్నం. ఇందుకు త‌గ్గ‌ట్టుగా ఇక్క‌డి కాంగ్రెస్ సీఎంలైతే పార్టీ విజ‌యం కోసం గ‌ట్టిగానే క‌ష్ట‌ప‌డ్డారు! అయితే ఫ‌లితాలే వారి త‌దుప‌రి ప‌రిస్థితుల‌ను నిర్దేశించ‌బోతున్నట్టున్నాయి!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?