ఇప్పటికే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు గడిచిపోయాయి. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అంతకు ముందు పదేళ్లలో ఎన్నో తప్పులు చేసిన ఫలితంగా అధికారం కమలం పార్టీకి అందింది. మరి పదేళ్ల పాటు అధికారంలో ఉన్నాకా ఎవరి మీద అయినా ప్రజావ్యతిరేకత తప్పదు! మరి మోడీ కూడా అలాంటి పాలకుడేనా, లేక మోడీ నాయకత్వంలో బీజేపీ ఒక దుర్బేధ్యమైన రాజకీయ శక్తినా అనే తేలడానికి గట్టిగా ఇంకో పక్షం రోజుల సమయం మిగిలి ఉంది!
లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఈ సారి ఎన్ని సీట్లు దక్కుతాయనేది రాబోయే రోజుల దేశ రాజకీయానికి కూడా దిక్సూచిగా నిలవబోతోంది! లోక్ సభ ఎన్నికల ఫలితాల విషయంలో బీజేపీ 370తో మొదలుపెట్టి 400 అంటోంది! అయితే అంత సీన్ లేదని దాని ప్రత్యర్థి పార్టీలు అంటున్నాయి.
రాహుల్ గాంధీ అయితే ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ 200 లకు మించి సీట్లు రావని పాట పాడుతూ ఉన్నారు. మమతా బెనర్జీ కూడా రెండు వందల్లోపే అంటూ చెబుతోంది. ఇలా బీజేపీ వ్యతిరేక నేతలు కమలం పార్టీకి నాలుగు వందల సీన్ లేదు, రెండు వందలే అంటున్నాయి! అయితే బీజేపీ వాళ్లు, ఆ పార్టీ మద్దతుదార్లు మాత్రం మూడు వందల డెబ్బై అని, నాలుగు వందలు అని అంటున్నారు! ఈ రెండింటిలో ఏది జరుగుతుందనేది జూన్ నాలుగున క్లారిటీ రానుంది! మరి ఈ వాదనలకు వారి నుంచి ఉన్న బలం ఏమిటంటే.. బీజేపీ మతం నినాదాన్నే నమ్ముకుంది!
మోడీ నాయకత్వం హిందుత్వ జపంతోనే ఉంది. దేశం ప్రగతి అనే మాటల కన్నా.. కాంగ్రెస్ గెలిస్తే ముస్లింలు అంటూ బీజేపీ వాళ్లు మాట్లాడుతూ ఉన్నారు. స్వయంగా ప్రధాని మోడీ ఈ మాటలన్నారు. ఇలా బీజేపీ కేవలం మతాన్నే నమ్ముకుందని స్పష్టం అవుతోంది. ముస్లింలను బూచిగా చూపెట్టి కమలం పార్టీ ఇంకోసారి అధికారం అడుగుతోంది. మొన్నటి వరకూ పాకిస్తాన్ పేరైనా ఎత్తే వాళ్లు. అయితే ఇప్పుడు లోక్ సభ ఎన్నికల వేళ డైరెక్టుగా ముస్లింలను బూచిగా చూపెట్టి 400 సీట్లు అడుగుతున్నారు కమలనాథులు! పదేళ్ల పాలన తర్వాత అయినా తాము సాధించి పెట్టిన ప్రగతి గురించి మాట్లాడలేక.. ఇంకా కాంగ్రెస్ పాలన అంటూ బీజేపీ తనకు మరోసారి పాలించే అవకాశాన్ని అడుగుతూ ఉండటం చోద్యం!
అయితే .. అదే తమ సక్సెస్ సీక్రెట్ అన్నట్టుగా బీజేపీ భావిస్తోంది. ఒకవేళ బీజేపీ కోరుకుంటున్నట్టుగా దేశ ప్రజలు ఆ పార్టీకి 370, లేదా 400 సీట్లు ఇస్తే మాత్రం.. నిస్సందేహంగా దేశాన్ని అది ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టే అంశమే అవుతుంది. ఒకవేళ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి అన్ని సీట్లు వస్తే.. ఇక దేశంలో ప్రతిపక్షానికి ఎలాంటి స్థానం లేకుండా చేసినట్టే! స్వయంగా ప్రజలే ప్రతిపక్షం అవసరం లేదనే తీర్పును ఇచ్చినట్టుగా అవుతుంది. అయితే ప్రజాస్వామ్యంలో అధికారంలో స్థిరమైన ప్రభుత్వం ఉండటం ఎంత అవసరమో, ప్రతిపక్షం కూడా అంతే అవసరం! బీజేపీకి 400 స్థాయి విజయాన్ని ఇస్తే మాత్రం.. దేశంలో ప్రతిపక్షానికి అంటూ ఎలాంటి విలువ లేకుండా పోతుంది!
అయితే బీజేపీ ఆశలు, అంచనాలు నాలుగు వందల వరకూ ఉండవచ్చు కానీ, వాస్తవంలో అలా జరుగుతుందా అనేది కూడా అనుమానమే! బీజేపీ విధానాలు పూర్తిగా కార్పొరేట్ అనుకూలంగా మారిపోయాయి.
దేశంలో బాగా డబ్బున్న వాళ్లు ఇంకా డబ్బు సంపాదించుకోవడానికి అనుగుణంగా ఉన్నాయి పరిస్థితులు. ఉద్యోగస్తులు, మధ్యతరగతి, పేదల బతుకుల్లో ఎలాంటి మార్పు లేదు! వంద సంపాదించే వాళ్లు వెయ్యి సంపాదిస్తున్నా.. మునుపటిలా అవసరాలను తీర్చుకోవడానికే ఆ సొమ్ము చాలడం లేదు! సంపాదించే రూపాయలు పెరిగినా, రూపాయి ఉన్న విలువ మాత్రం దారుణంగా పడిపోయింది. అదే మిలియనీర్లు, కార్పొరేట్ల పరిస్థితులు వేరేలా ఉన్నాయి! వారు ప్రతి ఏడాదిలోనూ తమ సంపదను భారీ స్థాయిలో వృద్ధి చేసుకోగలుగుతున్నారు! వందల కోట్ల రూపాయలు ఉన్న వారు వేల కోట్లలోకి వెళ్లిపోతున్నారు, వేల కోట్ల వాళ్లు లక్షల కోట్ల స్థాయికి చేరుతున్నారు!
సామాజికంగా ఆర్థిక అంతరాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇది నిస్సందేహంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పుణ్యమే! కార్పొరేట్లకు టాక్స్ రిలాక్సేషన్లను ఇబ్బడిముబ్బడిగా ఇస్తున్నారు, జీతభత్యాల మీద ఆధారపడ వారిని పన్నుల పేరుతో దోపిడీ చేస్తున్నారు! ట్యాక్స్ కట్స్ పోనూ తీసుకున్న డబ్బు తో ఏం కొనాలన్నా.. వస్తువుల మీద కూడా అన్ని పన్నులూ చెల్లించాల్సిందే! కార్పొరేట్లకు ఇలాంటి ఇబ్బందుల్లో లేవు. దీంతో డబ్బున్న వాళ్లు మరెంతో డబ్బు సంపాదించడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది.
సామాన్యుడు మాత్రం ఆ చట్రంలో తిరుగుతూ ధనికులను మరింత ధనికులుగా చేయడానికి పని చేస్తూ ఉన్నాడు! ఈ ఎన్నికల్లో బీజేపీ బలం 250లోపుకు దిగితే మాత్రం కమలం పార్టీ ఎవరూ జయించలేని దుర్భేధ్యమైన శక్తి కాదని తేలిపోతుంది. ప్రజాస్వామ్యంలో బీజేపీది కూడా ఒక స్థానమే తప్ప, బీజేపీనే సర్వస్వం కాదని దేశ ప్రజలు సందేశం ఇచ్చినట్టుగా అవుతుంది. ఎంత మతం పేరు చెప్పినా.. సామాన్యులను కూడా పట్టించుకోవాలని, లేకపోతే ఇక కష్టమే అని మోడీ అండ్ కోకు దేశ ప్రజలు సందేశం ఇచ్చినట్టుగా అవుతుంది.