ఒక పార్టీ ఇంకో పార్టీని నమ్మాలంటే వాటి చర్యలు ఆమోదయోగ్యంగా వుండాలి. అలా వుండకపోతే అస్సలు నమ్మకాలు అనేవి కనిపించవు. తెలంగాణలో తేదేపాకు ఇంకా ఓట్ బ్యాంక్ వుందని, దానిని భాజపాకు మద్దతుగా అందిస్తామని, దానికి ప్రతిఫలంగా ఆంధ్రలో తేదేపాకు భాజపా సహాయ సహకారాలు అందించాలన్నది ఓ లోపాయకారీ ప్రతిపాదన. ఇది చాలా కాలంగా తెలుగుదేశం అనుకూల మీడియాలోనే వినిపిస్తూ వస్తోంది.
సరే కాస్సేపు ఇదేదో బాగానే వుంది అనుకుందాం. నిజంగానే తేదేపాకు కాస్త బలం వుంది తెలంగాణలో అనుకుందాం. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో తేదేపా ప్రతిపాదనకు భాజపా మొగ్గు చూపినా తప్పు లేదు అనుకుందాం. కానీ తేదేపా సిన్సియారిటీని భాజపా ఎలా నమ్మాలి? గతంలో బోలెడు చేదు అనుభవాలు వున్నాయి కదా? పైగా తేదేపా అనుకూల మీడియా తెలంగాణలో కేసిఆర్ వైపు వుంది. రేపు ఎన్నికల్లో తెదెేపా వైపు వస్తుందా అన్నది ఓ అనుమానం.
రేపు సంగతి సరే, ఇప్పటి నుంచి భాజపాకు అనుకూలంగా వున్నట్లు కనిపిస్తే కదా కాస్త నమ్మకం కలుగుతుంది. భాజపా పొత్తు కోసం ప్రయత్నిస్తున్న నాటి నుంచి తెలంగాణలో భాజపాకు మద్దతుగా ఒక్క మాట అన్నా తెలుగుదేశం నోట వచ్చిందా? భాజపా-తెరాస పోరులో ఒక్కసారి అయినా మద్దతు పలికిన ఉదంతం వుందా? తెరాస వల్ల భాజపా నాయకులు కిందా మీదా అవుతున్నారు. ఒక్కసారి అన్నా మద్దతుగా నిలిచారా?
నిన్నటికి నిన్న భాజపా నేత బండి సంజయ్ ను అరెస్ట్ చేస్తే ఇది సరి కాదని తెలుగుదేశం వైపు నుంచి ఓ మాట అన్నా బయటకు వచ్చిందా? ఇలా తమ వైపు నుంచి ఏ విధమైన మద్దతు ఇవ్వకుండా ఎప్పుడో ఎన్నికల టైమ్ మా ఓటు బ్యాంక్ ను మీకు ఇస్తాం అంటే నమ్మకం ఎలా కలుగుతుంది.
ఇప్పుడే కేసీఆర్ కు భయపడి నోరు విప్పని వాళ్లు రేపు భాజపాకు తెలంగాణలో మద్దతుగా ఎలా నిలుస్తారు? ఈ మాత్రం లాజిక్ తెలియకుండా వుంటారా? భాజపా జనాలు?