సొంతంగా గెలిచిన చరిత్ర ఏనాడూ లేదు.. ఇదీ తెలుగుదేశం అధినేతగా చంద్రబాబు నాయుడుకు ఉన్న ట్రాక్ రికార్డు. ఆయన నాయకత్వంలో టీడీపీ అనేక వ్యూహాలతో గత ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసింది. అప్పుడు దక్కింది 23 సీట్లు! ఇదీ సొంతంగా చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ ప్రతిభ!
దీంతో తన రాజకీయ జీవితాన్ని, తన వారసుడి రాజకీయ భవిష్యత్తును పొత్తులే రక్షించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అందుకోసం జనసేన, బీజేపీలతో ఎలాగోలా పొత్తులను కుదుర్చుకున్నారు! ఇందుకుగానూ చంద్రబాబు నాయుడు చేస్తున్న త్యాగం 30 అసెంబ్లీ సీట్లు! లోక్ సభ లెక్కలను పక్కన పెడితే.. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 30 సీట్లలో టీడీపీ దాదాపుగా పోటీలో ఉండదు!
అక్కడ టీడీపీ మద్దతుతో జనసేన, బీజేపీల అభ్యర్థులు బరిలో ఉండవచ్చు. వారిలో చంద్రబాబు మనుషులే ఎక్కువమంది ఉండొచ్చు, అది వేరే కథ! మరి 175 అసెంబ్లీ సీట్లున్న ఒక చిన్న రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ ఏకంగా 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీలోనే లేకపోవడం గమనించాల్సిన అంశమే. అందునా.. బీజేపీ, జనసేన గుర్తులకు అంత నేపథ్యమూ లేదు ఏపీలో!
రాయలసీమలో అయితే బీజేపీ గుర్తు ఏదో కూడా చాలా మంది ఓటర్లకే తెలీని పరిస్థితే ఉంటుంది ఇప్పటి వరకూ కూడా! ఎంత కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్నా.. బీజేపీ పరిస్థితి అదీ! కార్యక్షేత్రంలో బీజేపీ, జనసేనల బలం ఏపాటిదో, వాటికి బూత్ ల వరకూ ఉన్న నిర్మాణం ఏమిటో బహిరంగ రహస్యమే. కేవలం కాపుల జనాభా ఎక్కువ, గంపగుత్తగా కాపులంతా జనసేనకు వేస్తారనే లెక్కే తప్ప.. జనసేనకు 24 సీట్లు కేటాయించడంలో తెలుగుదేశం వద్ద వేరే తర్కం లేదు!
మరి కాపులంతా గంపగుత్తగా ఓటేసే పరిస్థితే ఉంటే.. స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో ఒకటికి రెండు చోట్ల ఎందుకు ఓడిపోయాడో మరి! పవన్ కల్యాణ్ పోటీ చేసింది ఒక్కో నియోజకవర్గంలో కనీసం 80 వేల వరకూ కాపుల ఓట్లు ఉన్న చోట్లు! అలాంటి చోట స్వయంగా ఆయనే గెలవలేకపోయాడు. అలాంటిది ఇప్పుడు జనసేన అభ్యర్థులకు కాపుల ఓట్లు గంపగుత్తగా పడతాయనుకోవడం అంత అమాయకత్వం మరోటి ఉండదు! అందునా.. అప్పుడు జనసేన కు జనసేనే రాజూమంత్రి! ఇప్పుడు జనసేన కేవలం ఒక పల్లకి మోస్తున్న బోయ!
ఇలా ఏకంగా 24 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు తన పార్టీకి స్వయంగా దారులు మూసేసుకున్నారు! ఈ నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ జనసేనకు సహకరించడం కూడా కలలో మాట! మరి మిగతా నియోజకవర్గాల్లో జనసేన క్యాడర్ టీడీపీకి సహకరిస్తుందా అంటే.. అసలు జనసేనకు క్యాడర్ ఉందా? అనేది కొశ్చన్ మార్క్! కాపుల ఓట్లు..అనే బ్రహ్మపదార్థం మీద ఆశలతో ఏకంగా 24 సీట్లను జనసేనకు అలా కేటాయించేశారు, ఆ నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి త్రిశంకు స్వర్గంగా మారింది! ఇక బీజేపీకి ఐదో ఆరో సీట్లను కేటాయించినా.. అవి కూడా కృష్ణార్పణం అనుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు!
ఒకవేళ బీజేపీ పరిధి ఐదారు వరకే ఆగితే ఫర్వాలేదు… అది ఏ పదో, ఇరవై వరకో వెళితే.. ఆ మేరకు టీడీపీకి నష్టమే తప్ప పైసా ప్రయోజనం లేదు!
ఇవి పోగా టీడీపీకి మిగులుతున్నది 145 అసెంబ్లీ నియోజకవర్గాలు! వీటిల్లో గత రెండు దశాబ్దాల్లో టీడీపీ గెలిచిన చరిత్రలేని సీట్లున్నాయి, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఏ మాత్రం చాన్సుల్లేని నియోజకవర్గాలూ బోలెడున్నాయి! జనసేన, బీజేపీల మద్దతుతో టీడీపీ పోటీ చేసే ఈ 145 సీట్లలో టీడీపీ గెలుపు ఆశల్లేని సీట్లు 40 నుంచి 50వరకూ ఉన్నాయంటే ఆశ్చర్యం లేదు!
ఏతావాతా.. 90 నుంచి వంద సీట్లలో టీడీపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది! ఏపీలో టీడీపీ రేపు ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే.. గెలవాల్సిన సీట్ల సంఖ్య అది! ఇలాంటి సీట్లలో కూడా గ్రూపులు, వర్గాలు, రచ్చలకు లోటు లేదు! అనంతపురం వంటి అనుకూల జిల్లాలో 9 సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తే.. నాలుగు చోట్ల అసమ్మతి రాజకీయం కుతకుతలాడుతూ ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
జనసేన, బీజేపీలకు వదిలే సీట్లను పక్కన పెట్టి.. టీడీపీ పోటీ చేసే సీట్లలోనే నేతల మధ్యన రచ్చరంబోలా అవుతోంది! మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఇన్ చార్జిలు, కొత్త అభ్యర్థులు నిన్ను గెలవనిచ్చేది లేదంటూ సవాళ్లు ప్రతి సవాళ్లూ చేసుకుంటూ ఉన్నారు!
ఇవన్నీ గాక.. అవకాశవాది, సొంతంగా గెలుపు ఆశలు కూడా లేని అసమర్థుడు, ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు… అవకాశమేవాదమే తప్ప మరో సిద్ధాంతం లేని వాడనే నిందలు చంద్రబాబు నాయుడు తన రాజకీయ చరమాంకంలో ఎదుర్కొంటున్న వాస్తవవిమర్శలు! జనాలును వెర్రిపువ్వుల్లా లెక్కేసి చంద్రబాబు నాయుడు ఇలాంటి చేష్టలకు పాల్పడటం కొత్త కాదు. అందుకు గత ఎన్నికల్లో 23 సీట్లతో ప్రతిఫలం దక్కింది, ఇప్పుడు ఆ స్థాయి ప్రతిఫలమే దక్కనుందని స్పష్టం అవుతోంది!