చంద్రబాబు అరెస్ట్: అయితే మాకేంటి బాసూ?

చంద్రబాబు అరెస్టయ్యారు. ఇంత తిన్నాడు అంత తిన్నాడు అంటూ పాలకపక్షాలు లెక్కలు చెప్తున్నారు. గతంలో ఇలాగే జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు అప్పటి తెదేపావాళ్లు కూడా ఇలాగే లెక్కలు చెప్పారు.  Advertisement వాళ్లు…

చంద్రబాబు అరెస్టయ్యారు. ఇంత తిన్నాడు అంత తిన్నాడు అంటూ పాలకపక్షాలు లెక్కలు చెప్తున్నారు. గతంలో ఇలాగే జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు అప్పటి తెదేపావాళ్లు కూడా ఇలాగే లెక్కలు చెప్పారు. 

వాళ్లు జగన్మోహన్ రెడ్డిని ఇన్నాళ్లూ ఎ-1 అంటూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఎ-1 అయ్యారని వీళ్లంటునారు. 

ఎన్నికల ముందు ఇలా అరెస్ట్ చేస్తే చంద్రబాబు అవినీతి బయటపడి జనానికి అసహ్యం కలుగుతుందని వైకాపా శ్రేణులంటున్నాయి. కానీ, దీనివల్ల సింపతీ వచ్చి చంద్రబాబు థంపింగ్ మెజారిటీతో గెలుస్తారంటూ తెదాపా తమ్ముళ్లు కలలు గంటున్నారు. 

ఒక్కసారి దీని మీద దృష్టి సారిద్దాం. 

మనదేశంలో ప్రజలు ఎవడెంత తిన్నా అస్సలు పట్టించుకోరు…తమకి ఎవడు ఏమిస్తున్నారనే లెక్కలేసుకుంటారు. దీనికి దయనీయమైన సాక్ష్యాలు చాలా ఉన్నాయి. 

ఎన్నికలప్పుడు ప్రతి పార్టీ ఇచ్చే డబ్బు తీసుకుని తోచిన పార్టీకి ఓటేసి వచ్చే వోటర్లు ఎందరో కనిపిస్తున్నారు. 

గతంలో ఇది గుట్టుగా జరిగేది. ఇప్పుడు ఏదీ గుట్టుగా కాకుండా ఆ వోటర్సే బహిరంగంగా ఏ పార్టీ ఎంతిచ్చిందో చెప్తూ తక్కువిచ్చిన పార్టీని ఎద్దేవా చేస్తున్నారు. ఆ మధ్యన జరిగిన కొన్ని ఉప ఎన్నికలప్పుడు సోషల్ మీడియాలో వీడియోల రూపంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో బయట పడ్డాయి. 

చంద్రబాబు 118 కోట్లు తిన్నారని ఒక కేసు, 300 కోట్ల పైచిలుకు మొత్తాన్ని “స్కిల్”ఫుల్ గా వెనకేసుకున్నారని మరొక కేసు నడుస్తున్నాయి. ఈ విషయంలో డబ్బు తీసుకుని ఓటేసే జనం అనుకునేది ఒక్కటే…”అంతేనా! ఆ కాస్తతో రేపు ఎన్నికల్లో మనకేమి పంచుతాడు? అయినా ఆ డబ్బంతా మనకి ఇవ్వడానికే కదా! మధ్యలో ఈ కేసులేంటి?”. అదీ పరిస్థితి. 

కాన్షియస్ గా ఇలా అనుకోకపోయినా సబ్కాన్షియస్ గా వాళ్ల మనసుల్లో మెదిలేది అదే. 

డబ్బు తీసుకుని ఓటేయని జనం కూడా ఇలా అనుకోవచ్చు: “ఆ మాత్రం వెనకేసుకోకపోతే పార్టీని, మందిని, మార్బలాన్ని నడపడం ఎలా పాపం? తప్పేముందిలే”. 

ఈ దేశంలో ఏ పార్టీ నడపాలన్నా డబ్బు కావాలి. కోర్టు కేసులైనప్పుడు ఐదేసి కోట్లు ఫీజులు తీసుకునే లాయర్లని తట్టుకోవాలంటే ఎంత సంపాదించి పెట్టుకోవాలి? పార్టీ ఫండ్ పేరుతో కొంతమంది వ్యాపారులు, ఎన్నారైలు అడపా దడపా కొన్ని కోట్లు విదిల్చినా అది సరిపోదు. సరిపోతుందనుకున్నా సరిపెట్టుకోవడం కష్టం. 

ఎన్నికలప్పుడు ప్రతి ఎంపీకి, ఎమ్మెల్యేకి కొన్ని కోట్లు సర్దాలి. అవన్నీ ఎక్కడనుంచి వస్తాయి? ఇలా ఒకటి కాదు కార్యకర్తలకి పోసే టీ నుంచి, స్పెషల్ ఫ్లైటులో ఢిల్లీ నుంచి లాయర్లని తెప్పించుకునే వరకు కొట్లకి కోట్లు ఖర్చవుతూనే ఉంటాయి. దీనంతటికీ ప్రజాధనం మీద పడకపోతే పనెలా అవుతుంది? జరుగుతున్న తతంగమంతా ఇదే. 

లేకపోతే రాజకీయాలమీద ఇంటరెస్ట్ ఎవడికుంటుంది? జీతం మాత్రమే తీసుకుని ప్రజాసేవ చేసే టంగుటూరి ప్రకాశం పంతుళ్ల కాలం కాదుకదా ఇది! 

ముందుగా ఈ వ్యవస్థలో విలన్లు ఓటర్సే. తాము డబ్బు తీసుకుని ఓటేసే కాలం నడుస్తున్నంత కాలం ఏ అరెస్టుని వాళ్లు పట్టించుకోరు. అది జగనైనా, చంద్రబాబైనా, కేసీయారైనా, మోదీ అయినా, ఇంకెవరైనా సరే! అలాగే “తమవాడు” అనుకున్నవాడు తిన్నాడంటే అది తప్పుడు కేసంటారు. తమకి నచ్చని వాడు తిన్నాడంటే మాత్రం అది క్రైమంటారు. 

ఇక సింపతీ విషయానికొద్దాం. చంద్రబాబు 2004 ఎన్నికల ముందు అలిపిరిలో నక్సల్ బ్లాస్ట్ కి గురయ్యారు. చావు తప్పి బతికారు. ఆ సమయంలో సింపతీ వేవ్ గ్యారెంటీ అనుకున్నారు. కానీ ఏమయ్యింది? ఘోరంగా తెదేపా ఓడిపోయింది 2004లో. కాంగ్రెసుకి ఓట్లేసి వై.ఎస్. రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రిని చేసారు జనం 

అలాగే 2009-2014 మధ్యలో జగన్ మోహన్ రెడ్డి జైల్లో దాదాపు 16 నెలలు మగ్గారు. సింపతీ వేవ్ వచ్చేసి జనం ఆయనకి ఓట్లేసి గెలిపించేయలేదు కదా 2014 ఎన్నికల్లో. రాష్ట్రం విడిపోవడమే కావొచ్చు, కేంద్రంతో చంద్రబాబుకున్న అప్పటి సత్సంబంధాలు కావొచ్చు, జనం చంద్రబాబే కావాలని ఆయనకే ఓట్లేసి గెలిపించున్నారు. 

కనుక సింపతీ వేవ్ లు ఊహించినట్టుగా ఏమీ పనిచెయ్యవు. జనం ఫిక్సైతే వేస్తారంతే. ఫిక్సవ్వడానికి కారణాలు ఒక్కో ఓటరుకి ఒక్కో రకంగా ఉంటాయి. 

కొంతమందికి ఏ కారణాలు ఉండవు- నిత్య అసంతృప్తి వల్ల ఎప్పుడూ ప్రభుత్వం నడిపే పార్టీకి వెయ్యరు. 

కొంతమంది కులాల లెక్కలతో  వేస్తారు. 

కొంతమంది ఓటు అమ్ముకుని వేస్తారు. 

కొంతమంది సంక్షేమపథకాల కోసం వేస్తారు. 

ఇంకొందరు తమకి జీతాలు సమయానికి వస్తున్నాయా లేటవుతున్నాయా అన్న లెక్కలేసుకుని వేస్తారు. 

ఈ ఆల్గోరిదంలో చివరికి ఏమౌతుందనేది ఎవ్వరూ ఊహించలేరు. 

మరి ఈ అరెస్టులు ఎవరికోసం? ఎవరికి పనికొస్తాయి? 

కేవలం పొలిటికల్ వెండెట్టా తీర్చుకోవడానికి పనికొస్తాయి. 

అప్పట్లో జయలలిత తనని అవమానించిన పార్టీ యొక్క అధినేత కరుణానిధిని అరెస్టు చేయించి కసి తీర్చుకుంది. మళ్లీ వాళ్లు పదవిలోకొచ్చినప్పుడు ఈమెపై కక్ష సాధించారు. 

అప్పట్లో జగన్ అరెస్టు, ఇప్పుడీ చంద్రబాబు అరెస్టు కూడా అంతే. 

దీన్నంతా జనం ఒక బిగ్ బాస్ రియాలిటీ షో చూస్తున్నట్టుగా చూసి రకరకాల ఎమోషన్స్ కి గురౌతూ ఉంటారు. ఎప్పటికప్పుడు మరిచిపోతూ కూడా ఉంటారు. 

పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకుని చేసిన నిరసనకి తెదేపా జనాలు చప్పట్లు కొడితే, వైకాపా జనాలు గొల్లున నవ్వుకుంటున్నారు. ఎవరి భావోద్వేగాలు వాళ్లవి. 

ఈ అరెస్టుల వల్ల అధికారపార్టీ జనాలకి ఆనందం, ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరులకి ఆక్రోశం, లాయర్లకి అదాయం, మీడియాకి సంబరం, ప్రజలకి వినోదం. అంతకు మించి ఇది ఎవరి వికాసానికీ కాదు. ఎవ్వరికీ ఏమీ ఒరగదు, పెరగదు. 

శ్రీనివాసమూర్తి