చంద్రబాబునాయుడు ట్విటర్ ను వదలి ప్రజల్లోకి వెళుతున్నారు. లేఖాస్త్రాలకు పరిమితం కాకుండా జనంలో తిరిగి ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి ఆయన సన్నద్ధం అవుతున్నారు. ప్రభుత్వం పన్నులు పెంచేసిందని, అన్నీధరలు పెరిగిపోయాయని తెలుగుదేశం చాలా రోజులుగా ఆందోళనలు చేస్తూనే ఉంది.
ఇప్పుడు ఆ ఆందోళనలకు చంద్రబాబు ఫ్యాక్టర్ కూడా యాడ్ అవుతుందన్నమాట. ఈ నెలలోనే పార్టీ మహానాడు నిర్వహించే వరకు ఆయన రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరై మాాట్లాడతారు. 4వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో ఆయన దాడిమొదలవుతుంది.
ఇదంతా ఓకే. కానీ.. ఈ ‘బాదుడే బాదుడు’ పేరుతో నిజాలు మాట్లాడగల దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉన్నాయా అనేది కీలకం. తెలుగుదేశం ప్రస్తావిస్తున్న విషయాలు ప్రధానంగా రెండు,. ఒకటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల మీద పెంచిన పన్నులు. రెండు- ధరల పెరుగుదల.
చంద్రబాబుకు నిజంగా ధైర్యం ఉంటే గనుక.. జగన్మోహన రెడ్డి పెంచిన పన్నులను విమర్శించే ముందు.. ఈసారి తాను అధికారంలోకి వస్తే గనుక.. జగన్ పెంచిన పన్నులు అన్నిటినీ రద్దు చేస్తాను అనే మాట చెప్పగలగాలి. విద్యుత్తు టారిఫ్ లను కూడా జగన్ పెంచిన వాటిని సవరించి.. ప్రజలకు తిరిగి పాత ధరలకే అందిస్తామనే మాట చెప్పగలగాలి.
ప్రభుత్వం పన్నుల విషయంలో నిక్కచ్చిగా ఉండకుండా ప్రతి ఏటా లక్షల కోట్ల సంక్షేమ పథకాలు, పనులు చేపడుతూ పోవాలంటే ఎలా సాధ్యం? మూడుదఫాలు ముఖ్యమంత్రి పదవిని వెలగబెట్టిన చంద్రబాబుకు ఆ మాత్రం తెలియదా? కనీస పన్నులు చెల్లించడానికి కూడా ప్రజలు విముఖంగా ఉంటే ఎలా అనేది ఆయన ఆలోచించాలి. అందుకే.. పన్నుల బాదుడు గురించి మాట్లాడాలనుకుంటే.. తాను అధికారంలోకి వస్తే వాటన్నింటినీ రద్దు చేసేస్తాను అనే మాటతోనే ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించాలి. అలా కాకుండా.. ఉత్తుత్తిమాటలు చెబితే ప్రజలను వంచిస్తున్నట్లే.
అదే సమయంలో.. ధరల పెంపు విషయానికి వస్తే గనుక.. పెట్రోలు ధరలు పెరగడంలో కేంద్ర ప్రభుత్వం అరాచకపోకడల్ని ప్రస్తావించకుండా.. కేవలం ఇతర ధరల పెరుగుదలల గురించి నిందలు వేస్తే చంద్రబాబు మరో నాటకానికి తెర తీసినట్లే.
వచ్చే ఎన్నికల్లో మళ్లీ మోడీ పాదాల ఎదుట సాష్టాంగపడి వారితో పొత్తు పెట్టుకోవాల్సి వస్తుందేమోనని వ్యూహాత్మకంగా వారి వైఫల్యాలపై పల్లెత్తు మాట అనకుండా రోజులు నెట్టుకొస్తున్న చంద్రబాబు.. ధైర్యముంటే ముందు మోడీ పోకడల్ని తప్పు పట్టాలి.
పెట్రోలు ధర పెరగడం అనేది.. యావత్ దినుసుల ధరలు పెరగడానికి, కూరగాయల ధరలు కూడా పెరగడానికి ప్రత్యక్షంగా కారణం అవుతుందనే సంగతి అందరికీ తెలుసు. అలాంటిది మోడీ సర్కారును ఏమీ అనకుండా జగన్ ను మాత్రం నిందించే ప్రయత్నం చేస్తే.. చంద్రబాబు చిత్తశుద్ధిని ప్రజలు నమ్మరు. ఆయన నాటకాల రాయుడే అని అనుకుంటారు.