ముచ్చ‌ట‌గా బాబు చాణ‌క్యం!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను తాను చెప్పిన‌ట్టు న‌డుచుకునేలా చేయ‌డంలో చంద్ర‌బాబు ప్ర‌ద‌ర్శిస్తున్న చాణ‌క్యం చూడ ముచ్చ‌ట‌గా వుంది. బ‌హుశా ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాదిరిగా ఇంత బుద్ధిగా లోకేశ్ కూడా చంద్ర‌బాబునాయుడు చెప్పిన‌ట్టు వినరేమో. కొంద‌రి అభ్య‌ర్థిత్వాల విష‌యంలో…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను తాను చెప్పిన‌ట్టు న‌డుచుకునేలా చేయ‌డంలో చంద్ర‌బాబు ప్ర‌ద‌ర్శిస్తున్న చాణ‌క్యం చూడ ముచ్చ‌ట‌గా వుంది. బ‌హుశా ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాదిరిగా ఇంత బుద్ధిగా లోకేశ్ కూడా చంద్ర‌బాబునాయుడు చెప్పిన‌ట్టు వినరేమో. కొంద‌రి అభ్య‌ర్థిత్వాల విష‌యంలో చంద్ర‌బాబు వ‌ద్ద లోకేశ్ ప‌ట్టుప‌ట్టార‌ని, పెద్దాయ‌న ఎంత‌ చెప్పినా వినిపించుకోర‌ని టీడీపీ సీనియ‌ర్ నేతలు తెలిపారు. అలాంటిది చంద్ర‌బాబు చెబితే, మ‌రో మాట్లాడ‌కుండా తాను హామీలిచ్చిన వారిని సైతం పోటీకి దూరంగా పెడుతున్న వైనాన్ని ఏపీ రాజ‌కీయ తెర‌పై చూస్తున్నాం.

కాసేపు ప‌వ‌న్‌క‌ల్యాణ్ కోణంలో మాట్లాడుకోవ‌డం ప‌క్క‌న పెడ‌దాం. చంద్ర‌బాబు కోణంలో చూస్తే, ఆయ‌న చ‌తుర‌త‌ను త‌ప్ప‌క ప్ర‌శంసించాలి. ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా జ‌గ‌న్‌ను ఎదుర్కోవాలంటే అసాధ్య‌మ‌ని చంద్ర‌బాబుకు బాగా తెలుసు. దీంతో త‌న‌కు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ తోడు కావాలి. జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకోవాలంటే, ఆ పార్టీ అధినేత అడిగిన‌న్ని సీట్లు ఇవ్వ‌క త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి. ప‌వ‌న్‌కు వెంట‌నే అధికారంలోకి రావాల‌నే కోరిక లేదు.

దీంతో ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం ఆయ‌న‌కు అత్య‌వ‌స‌రం కాదు. కానీ తాను క‌లిస్తే త‌ప్ప టీడీపీకి భ‌విష్య‌త్ లేద‌ని మాత్రం ప‌వ‌న్‌కు తెలుసు. చంద్ర‌బాబు రాజ‌కీయ అత్య‌వ‌స‌రాన్ని జ‌న‌సేన‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించేలా ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రించి వుండొచ్చు. ఇక్క‌డ చంద్ర‌బాబు తెలివిగా వ్య‌వ‌హ‌రించారు. ప‌వ‌న్‌కు కావాల్సిందేంటో చంద్ర‌బాబు ప‌సిగ‌ట్టారు. ప‌వ‌న్ నుంచి త‌న‌కు కావాల్సింది రాబ‌ట్టుకున్నారు. అలాగే ప‌వ‌న్‌కు కావాల్సిందేంటో చంద్ర‌బాబు చూసుకున్నారు. డీల్ సెట్ చేసుకున్నారు.

ఇదో ఇన్ని సీట్లు తీసుకో అని చంద్ర‌బాబు చెబితే …కాదు, కూడ‌ద‌నే మాటే లేకుండా బుద్ధిగా తలూపుతున్నారు. అందుకే ప‌వ‌న్ అంటే చంద్ర‌బాబుకు ఎంతో ఇష్టం. రాజ‌మండ్రి రూర‌ల్ సిటింగ్ స్థానాన్ని నిలుపుకోవాల‌ని బాబు అనుకున్నారు. అప్ప‌టికే ప‌వ‌న్ త‌న పార్టీకి తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. రాజ‌మండ్రి రూర‌ల్‌లో కందుల దుర్గేష్‌, ఆయ‌న అనుచ‌రులు టికెట్ ద‌క్కింద‌ని సంబ‌రాలు చేసుకున్నారు. కానీ గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి నింపాదిగా… అవ‌న్నీ ఉత్తుత్తివే అని, త‌న‌కే చంద్ర‌బాబు టికెట్ ప్ర‌క‌టిస్తారని, భావోద్వేగాల‌కు గురి కావ‌ద్ద‌ని టీడీపీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. చివ‌రికి అదే జ‌రిగింది.

బాబు కోసం ఎవ‌రినైనా వ‌దులుకోడానికి ప‌వ‌న్ సిద్ధ‌ప‌డ్డార‌ని ఇలాంటివి ఎన్ని ఉదాహ‌ర‌ణ‌లైనా చెప్పుకోవ‌చ్చు. అందుకే చంద్ర‌బాబు అంటే టీడీపీ శ్రేణుల‌కు న‌చ్చేది. ఈ సీటు జ‌న‌సేన‌కే అని ప్ర‌చారం అవుతున్నా, టీడీపీ శ్రేణులు పెద్ద‌గా ఆందోళ‌న చెంద‌రు. ఏ సీటైనా ఎవ‌రికి ఇవ్వాలో చంద్ర‌బాబు డిసైడ్ చేస్తార‌నే న‌మ్మ‌కం ఇటు టీడీపీ, అటు జ‌న‌సేన శ్రేణుల్లో వుంది. అందుకే చంద్ర‌బాబు అంటే చాణ‌క్యుడ‌ని టీడీపీ ప్ర‌చారం చేసుకుంటోంది.

ఒక్క జ‌గ‌న్ విష‌యంలో చంద్ర‌బాబు ఇబ్బంది ప‌డుతున్నారు. బాబు 45 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో… ఆయ‌న అనుకున్న‌వే దాదాపు సాధించుకున్నారు. జ‌గ‌న్ మాత్ర‌మే కొర‌క‌రాని కొయ్య‌గా మారారు. సిట్ అంటే కూచోడానికి, స్టాండ్ అంటే లేవ‌డానికి సిద్ధంగా ఉన్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఒక‌వైపు, మ‌రోవైపు త‌న అంచ‌నాల‌కు అంద‌ని ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి వైఎస్ జ‌గ‌న్‌. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను రాజ‌కీయంగా చంద్ర‌బాబు ఆడిస్తున్న తీరు వినోదాత్మ‌కంగా వుంది.

చంద్ర‌బాబు రాజ‌కీయ క్రీడ చూస్తుంటే… కొంద‌రికి సంక్రాంతి నాడు గంగిరెద్దుల‌ను ఆడించే హ‌రిదాసులు, అలాగే స్కూళ్ల‌లో పిల్ల‌ల‌కు వినోదాన్ని పంచేందుకు కోతి, కుక్క‌లతో వేయించే స‌ర్క‌స్ ఫీట్స్ గుర్తుకొస్తున్నాయి. చంద్ర‌బాబు మాట‌ల్లో ఏం మాయ వుందో కానీ, ఆయ‌న చెప్పిన‌ట్టు ఆడేందుకు కొంద‌రు రాజ‌కీయ నేత‌లు సిద్ధంగా వుంటారు. ప‌క్క  పార్టీల్లో వుంటూ కూడా చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేయ‌డం చూస్తున్నాం. అంతేకాదు, కొన్ని వ్య‌వ‌స్థ‌ల్లో కీల‌క పోస్టుల్లో వున్న వాళ్లు సైతం త‌న కోసం ఏం చేయ‌డానికి సిద్ధ‌ప‌డిన వాళ్ల‌ను చూశాం. అలాంటి వాళ్ల‌తో పోల్చితే, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎంత‌?