
చంద్రబాబుకి వేడినీళ్లు లేవని అరిచే వాళ్లంతా అర్థం చేసుకోవాల్సింది ఆయన దుస్థితిని కాదు. మన జైళ్ల దుర్గతిని. నాయకులు తెలుసుకోవాల్సింది ఏదో ఒక రోజు తమకి జైలు తప్పదని. మారిన రాజకీయాల్లో ఎవరూ దేనికీ అతీతులు కాదు. అవినీతితో కలిసి ప్రయాణం చేస్తారు కాబట్టి, అవి తమ మెడకు చుట్టుకున్నప్పుడు జైలు తప్పదు.
బ్రిటీష్ వాళ్లు జైళ్లను నరక రూపంగా ఎందుకు మార్చారంటే జైలుకు రావాలంటే జనం భయపడాలని, వాళ్లకి వ్యతిరేకంగా సత్యాగ్రహాలు, ధర్నాలు చేయకూడదని. స్వాతంత్ర్యం అనే ఆలోచనే రాకూడదని. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా జైలు నరకంలాగే వుంది. ఎందుకంటే మన పాలకులకి బ్రిటీష్ వాళ్ల లక్షణాలు వచ్చేశాయి. ఎదురు తిరిగితే అణచివేయడం, ప్రజాస్వామ్య హక్కులు హరించి వేయడం. ఎమర్జెన్సీ దీనికి పరాకాష్ట.
ఆశ్యర్యం ఏమంటే ఎమర్జెన్సీలో జైళ్లకి వెళ్లిన నాయకులకి తర్వాత పదవులు వచ్చాయి. జైలు స్థితిగతుల్ని మార్చాలని ఒక్కరూ పూనుకోలేదు. కమిటీలు నివేదికలకే పరిమితమయ్యాయి. అప్పటి సంగతి వదిలేస్తే ప్రస్తుతం ప్రతినాయకుడికి జైలుకు వెళ్లే చాన్స్ వుంది. ఎవరూ శుద్ధపూసలు కాదు. అందుకే కనీసం జనం కోసం కాకపోయినా మీ కోసమైనా జైళ్లలోని సౌకర్యాలను మెరుగుపరచండి.
హైటెక్ సిటీ కట్టానని గొప్పలు చెప్పుకునే బాబు, జైళ్లలోని మానవ హక్కుల గురించి కనీసం ఆలోచించి వుంటే ఈ రోజు చన్నీళ్లు పోసుకునే బాధ తగ్గేది. డిజిటల్ యుగంలో కూడా కనీస సౌకర్యాలు లేని జైళ్లలో మనుషులు మగ్గిపోతున్నారంటే ఆ పాపం నాయకులదే.
జైళ్లు ఎలా వుంటాయంటే శుభ్రమైన మంచినీళ్లు వుండవు. టాయిలెట్లు దుర్వాసన వస్తూ వుంటాయి. స్నానానికి సౌకర్యం వుండదు. భోజనం అత్యంత హీనం. మెనూ ప్రకారం అంతా పద్ధతిగానే వుంటుంది. కానీ వడ్డించేటప్పుడు రబ్బర్‌లా సాగే మాంసం, రంగునీళ్ల రసం, ఎర్రటి సాంబార్, తెల్లటి మజ్జిగ వస్తాయి. బాబుకి ఇంటి భోజనం కాబట్టి బతికిపోయాడు. లేదంటే ఇవన్నీ రుచి చూసేవాడు.
జైళ్ల దుస్థితి గురించి మాట్లాడే మానవహక్కుల వాదుల్ని అర్బన్ నక్సలైట్లు అంటున్నారు. సాయిబాబాకి దుప్పటి ఇవ్వనప్పుడు మాట్లాడని వాళ్లు, చంద్రబాబు వేడినీళ్ల గురించి మాట్లాడ్తారు. అదే వింత.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా