నాలుగు వాక్యాలు తడబడకుండా మాట్లాడలేని బ్రాహ్మణికి పార్టీ పగ్గాలట! పార్టీ ఏమైపోతుందో అనే భయం తెలుగుదేశం మద్దతుదారుల కంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకే ఎక్కువ ఉన్నట్టుంది. అందుకే ప్లాన్ బీ బ్రాహ్మణి అంటూ కథనం రాశారు. మొన్నటి వరకూ జగన్‌కు వ్యతిరేకంగా ఆంధ్రాలో షర్మిల అన్నాడు. అదేమైందో తెలియదు, షర్మిలని వెయిటింగ్ లిస్ట్‌లో ఉంచారు. అంతోఇంతో రాజకీయ అవగాహన ఉన్న షర్మిలనే జనం పట్టించుకోలేదు. ఇక బ్రాహ్మణిని పట్టించుకుంటారా?
విషయం ఏమంటే బాబు జైలుకి వెళ్లాడు. బెయిల్ వస్తుందో రాదో తెలియదు. రేపోమాపో లోకేష్ వెళ్తాడు. మరి భర్త, మామ జైల్లో వుంటే బ్రాహ్మణి వచ్చి కన్నీళ్లు పెడితే జనం కరిగిపోకుండా వుంటారా? గెలిపించకుండా వుంటారా? ఇంటికంటే జైలే పదిలం, జైలుకి వెళితే సానుభూతి పొంగి నేరుగా కుర్చీలో కూచుంటారు. జగన్‌ని కూచోపెట్టినట్టే బాబుని కూడా కూచోపెడతారు. ఇది ఆంధ్రజ్యోతి ఆలోచన.
జగన్ జైల్లో వుంటే, విజయమ్మ, షర్మిల జనంలో తిరిగారు. రాజకీయం అర్థమయ్యేలా మాట్లాడారు. జనం దృష్టిలో జగన్ జైలు మాత్రమే లేదు. అంతకు ముందు ప్రమాదంలో చనిపోయిన వైఎస్ ఇంకా సజీవంగా వున్నాడు. జగన్ మీద సానుభూతి కంటే వైఎస్ కుటుంబాన్ని వేధిస్తున్నారనే బాధ వుంది. అంత సానుభూతి కూడా జగన్‌కి అధికారం తీసుకురాలేదు. కేవలం ప్రతిపక్షంలోనే వుంచింది. మరి ఇక్కడ ఏం మునిగిపోయిందని చంద్రబాబుకి సునామీలా, ఉప్పెనలా సానుభూతి వచ్చేస్తుంది. ఆయన అవినీతి చేశాడని మెజార్టీ జనం నమ్ముతున్నారు. ఇంత కాలం దొరకలేదు. ఇప్పుడు దొరికాడంతే.
బ్రాహ్మణికి కనీసం జిల్లాల పేర్లు, నాయకుల పేర్లైనా తెలుసా? అదేం ఖర్మో ఎన్టీఆర్ మనుమళ్లు, మనుమరాళ్లలో జూనియర్ ఎన్టీఆర్‌కి తప్ప మరెవరికీ నటన రాలేదు, ఎమోషన్ రాలేదు. జనంలో మాట్లాడాలంటే ఎమోషన్ తెలియాలి. బ్రాహ్మణి మాట్లాడితే ఐదు నిమిషాలు వినలేనంత బోర్. అదే జూనియర్ ఎన్టీఆర్‌ని పార్టీ నుంచి పొగ పెట్టకుండా కాపాడుకుని వుంటే ఈ రోజు పార్టీని బతికించేవాడు. అతన్ని దూరం చేసుకున్న పాపాన్ని చంద్రబాబు అనుభవిస్తున్నాడు.
అయినా 40 ఏళ్ల పార్టీలో లెక్కలేనంత మంది నాయకులున్నారు. ఒక్కరు కూడా పార్టీ నడపడానికి పనికిరారా? అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు కరివేపాకులేనా! కనీసం ఢిల్లీలో చంద్రబాబు తరపున గట్టిగా మాట్లాడేవాళ్లు కూడా లేరు. చంద్రబాబు చాణక్య నీతికి Expiry date వచ్చేసింది. కాల మహిమ!