మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇంత వరకూ సొంత వాళ్లను కూడా మోసం చేశారని మాత్రమే విన్నాం. కానీ ఇప్పుడు తాను మోసపోతూ, కేడర్‌ను మోసగిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఎదుర్కోవడం ఎలా? అనేది పెద్ద ప్రశ్న. ఈ సందర్భంగా ఆయన పదేపదే ముందస్తు జపం చేస్తున్నారు.
తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారంటూ కొత్త పల్లవి అందుకున్నారు. జగన్ సంక్షేమ పథకాలు బూటకమని ప్రజలకు అర్థమైందని చంద్రబాబు మాట్లాడ్డం… ఆయన విపరీత మనస్తత్వానికి, దిక్కుతోచని స్వభావానికి సంకేతంగా చెబుతున్నారు.
క్షేత్రస్థాయి కమిటీలతో చంద్రబాబు మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు మాటలు వింటే… తమ పార్టీ బలపడిందనే భరోసా ఎక్కడా ఇవ్వలేదు. ఎంతసేపూ అధికార పార్టీ బలహీనపడిందని చెప్పడం గమనార్హం.
గడప గడపలో వైసీపీ నేతలకు నిలదీతలు ఎదురవుతున్నాయని అన్నారు. ఎల్లో మీడియాలో రాసేవన్నీ నిజాలే అని చంద్రబాబు నమ్ముతున్నారా? లేక ఆ భ్రమలో తానుంటూ, కేడర్‌ను కూడా అదే విధంగా ఉంచుతున్నారా? అనేది చర్చనీయాంశమైంది. గతంలో చంద్రబాబు అధికారంలో వున్నప్పుడు ఇదే మీడియా బాబు పాలన బ్రహ్మాండం, ఆహా, ఓహో అని పొగిడింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఫలితాలు ఏంటో అందరికీ తెలిసిందే.
ప్రభుత్వంపై వ్యతిరేకత గుర్తించి జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్టు చంద్రబాబు చెప్పుకొచ్చారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా వుండాలని బాబు పిలుపునిచ్చారు. అన్నివర్గాల్లో ప్రభుతంపై వ్యతిరేకత పెరుగుతోందన్నారు.
ప్రభుత్వాన్ని ఎంతోకాలం నడపలేమని సీఎంకు అర్థమైందన్నారు. మరి జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వుందని నమ్ముతున్నప్పుడు అన్ని పార్టీలు కలిసి రావాలని చంద్రబాబు ఎందుకు కోరుతున్నారనే ప్రశ్నకు మాత్రం జవాబు ఉండదు.
వాస్తవాల కంటే కలలు తియ్యగా వుంటాయి. చంద్రబాబు వాస్తవాలను తెలుసుకోడానికి, భరించడానికి సిద్ధంగా లేనట్టు ఆయన మాటలు వింటే ఎవరికైనా అర్థమవుతుంది. ఒకవైపు వైఎస్ జగన్ ఎంతో శక్తిమంతుడని సొంత పార్టీ వాళ్లే చెబుతుంటే, చంద్ర బాబు మాత్రం లైట్ తీసుకోవడం వెనుక వ్యూహమా లేక పిరికితనమా? అనేది తేలాల్సి వుంది.
ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయడంలోనే ఓటమి దాగి వుందని చంద్రబాబు తెలుసుకుంటే మంచిది. ఇదే జగన్ విషయానికి వస్తే వైసీపీ యుద్ధం చేస్తున్నది కేవలం చంద్రబాబుతో మాత్రమే కాదంటున్నారు. ఎల్లో మీడియా అధిపతుల పేర్లను కూడా ప్రస్తావిస్తూ దుష్టచతుష్టయంగా అభివర్ణిస్తున్న సంగతి తెలిసిందే.