తెలంగాణలో భవిష్యత్ రాజకీయ మార్పునకు వాళ్లిద్దరి కలయిక సంకేతమా? అనే చర్చకు దారి తీసింది. మునుగోడు సభ అనంతరం రామోజీగ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కలుసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రామోజీరావు పేరు తెలియని వారుండరు. ఆయన్ను కేవలం మీడియా యజమానిగా మాత్రమే భావించలేం. అనేక వ్యాపార సంస్థల అధినేత కూడా.
ఈ నేపథ్యంలో రామోజీకి రాజకీయ అవసరాలు మెండు. గత 8 ఏళ్లుగా కేసీఆర్ అధికార పల్లకీని రామోజీరావు మోస్తున్నారు. కేసీఆర్ సర్కార్ తప్పిదాలను కప్పి పుచ్చడం తన మీడియా బాధ్యతగా ఆయన వ్యవహరిస్తూ వచ్చారు. కేసీఆర్‌పై వ్యతిరేకత రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలనే తపన ఆయన మీడియాలో కనిపించింది. ఇదంతా రామోజీ ఆలోచనలకు ప్రతిబింబమని రాజకీయ వర్గాలు చెబుతూ వచ్చాయి.
తాజాగా అమిత్‌షాతో భేటీ నేపథ్యంలో రామోజీలో వచ్చిన మార్పా? లేక తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాలకు మార్పునకు సంకేతమా? అనే చర్చకు తెరలేచింది. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో బలమైన నెట్‌వర్క్ కలిగిన రామోజీరావు కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. 2023లో తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ గట్టి పట్టుదలతో వుంది. దీంతో ఆ పార్టీకి మీడియా అవసరం ఎంతైనా వుంది. ఈనాడు లాంటి మీడియా సంస్థ అండ బీజేపీకి రాజకీయంగా ఉపయోగపడుతుంది.
ఇటు రామోజీకి వ్యాపార ప్రయోజనాలు, అటు బీజేపీకి రాజకీయ ప్రయోజనాలు… పరస్పర అవసరాలే అమిత్‌షా, రామోజీని కలిపాయనే చర్చ జరుగుతోంది. మునుగోడు సభపై “ఈనాడు” ప్రత్యేక కథనం రాయడాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. “లక్ష్యం 2023 ఎన్నికలు” అనే శీర్షికతో బీజేపీకి సానుకూల కథనాన్ని రామోజీ పత్రిక వండింది. మునుగోడు సభ విజయవంతం కావడంతో కమలదళంలో కొత్త ఉత్సాహం నెలకుందని ఆ కథనం సారాంశం.
ఒకవైపు అమిత్‌షాతో కరచాలనం చేయగానే, ఈనాడు పత్రిక బీజేపీ పల్లకి మోయడానికి సిద్ధమనే సంకేతాల్ని ఈ కథనం ద్వారా ఇచ్చింది. ఇంత కాలం కేసీఆర్ పాలనను కీర్తిస్తూ రాసిన రామోజీరావు, తెలంగాణలో రాజకీయం మారుతోందని పసిగట్టి వెంటనే అటువైపు మారడానికి సిద్ధమైన ఆయనలోని వ్యాపార దక్షతను మెచ్చుకోవాల్సిందే.
రామోజీలో వచ్చిన మార్పును కేసీఆర్ ఎలా తీసుకుంటారనేది ఆసక్తికర పరిణామం.