కెవ్వు కామెడీ.. పవన్ కల్యాణ్ పై వెరైటీ ట్రోలింగ్

“ఆంధ్రప్రదేశ్ లో మరోసారి వైసీపీ వస్తే రాష్ట్రానికి నష్టం. జగన్ కు మరోసారి అధికారం అప్పగిస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుంది. ఈసారి వైసీపీ గెలిస్తే రాష్టం మరో పాతికేళ్లు వెనక్కి వెళ్లిపోతుంది.” Advertisement తాజాగా…

“ఆంధ్రప్రదేశ్ లో మరోసారి వైసీపీ వస్తే రాష్ట్రానికి నష్టం. జగన్ కు మరోసారి అధికారం అప్పగిస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుంది. ఈసారి వైసీపీ గెలిస్తే రాష్టం మరో పాతికేళ్లు వెనక్కి వెళ్లిపోతుంది.”

తాజాగా పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలివి. ఈ స్టేట్ మెంట్ లో 'రాష్ట్రం' అనే పదం తీసేసి, ఆ స్థానంలో 'టీడీపీ' అనే పదం చేర్చి మరోసారి చదువుకోమంటున్నారు నెటిజన్లు. అలా చదివితే అది ఎలా మారుతుందో చూద్దాం.

“ఆంధ్రప్రదేశ్ లో మరోసారి వైసీపీ వస్తే టీడీపీకి నష్టం. జగన్ కు మరోసారి అధికారం అప్పగిస్తే టీడీపీ అధోగతి పాలవుతుంది. ఈసారి వైసీపీ గెలిస్తే టీడీపీ మరో పాతికేళ్లు వెనక్కి వెళ్లిపోతుంది.” చూశారుగా.. పవన్ కల్యాణ్ స్టేట్ మెంట్ ను కాస్త మార్చి చదివితే ఇలా ఉంటుంది. ప్రస్తుతం జనసేనపై జరుగుతున్న వెరైటీ ట్రోలింగ్ ఇదే.

ఇన్నాళ్లూ ఒకెత్తు.. ఇప్పుడు మరో ఎత్తు..

వైసీపీ పేరు చెబితే విషం కక్కే జనసేనాని, తాజాగా మరోసారి అదే పని చేశారు. పవన్ ఇలా మీడియా ముందుకొచ్చిన ప్రతిసారి సోషల్ మీడియాలో అతడిపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుంది. గతంలో పవన్ కల్యాణ్ చేసిన విమర్శలు, బాబు స్టేట్ మెంట్స్ ను తీసుకొచ్చి ఆయన్ను విపరీతంగా ఏడిపిస్తుంటారు నెటిజన్లు. అది సర్వసాధారణం కూడా. అయితే ఈసారి ఈ ట్రోలింగ్ ఇలా కొత్త పుంతలు తొక్కింది.

పవన్ తన వ్యాఖ్యల్లో ఎక్కడ 'రాష్ట్రం' అనే పదాన్ని వాడినా, ఆ స్థానంలో 'టీడీపీ' అనే పదాన్ని చేర్చుకొని అర్థం చేసుకోవాలంటూ సింపుల్ గా ఓ ఉచిత సలహా పడేసింది సోషల్ మీడియా. కామెడీ కోసం సోషల్ మీడియాలో కొందరు జనాలు ఇలా చేసినప్పటికీ, వాస్తవంగా చూసుకుంటే అదే నిజం అనిపిస్తుంది. పవన్ దృష్టిలో రాష్ట్రం అంటే టీడీపీ. ఆయన ఏం మాట్లాడినా టీడీపీకి కొమ్ము కాసినట్టే ఉంటుంది.

మొన్న ఓట్లు చీల్చమన్నారు.. ఇప్పుడు లవ్ ప్రపోజల్

మొన్నటికి మొన్న వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం అన్నారు. అంటే వెళ్లి టీడీపీ చంక ఎక్కుతామనేది పరోక్షంగా పవన్ ప్రకటన. అప్పటి తన ప్రకటనకు మరింత బలం చేకూరుస్తూ వ్యవహరిస్తున్నారు పవన్ కల్యాణ్. ఆయన మాటలు జనసేన పార్టీని టీడీపీకి మరింత దగ్గర చేస్తున్నాయి. ఓ పార్టీతో పొత్తులో ఉంటూ, మరో పార్టీ వైపు ఓరచూపులు చూసే పవన్ కల్యాణ్ ను ఏమని పిలవాలంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

తనపై ఈ రేంజ్ లో సెటైర్లు పడుతున్నప్పటికీ, పవన్ కల్యాణ్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. వైసీపీని, జగన్ ను టార్గెట్ చేసుకుంటూ ఆయన ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద ప్రయోగాలతో ప్రజల ముందుకొస్తూనే ఉన్నారు. అలా కొత్త పద ప్రయోగాలు చేసిన ప్రతిసారి, ఆ వాక్యంలో టీడీపీ అనే పదాన్ని జత చేసుకోవాలని సూచిస్తోంది సోషల్ మీడియా. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ పై జరుగుతున్న ట్రోలింగ్, కామెడీ సినిమాకు ఏమాత్రం తీసిపోదు. ఆయన గత స్టేట్ మెంట్స్ ను కూడా బయటకు తీసి, అందులో కొన్ని పదాలు తొలిగించి, ఆ స్థానంలో టీడీపీ అనే పదాన్ని పెట్టి చదువుకోవాలని సూచిస్తున్నారు నెటిజన్లు.