ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఠికానా లేదు గనుక.. అంతో ఇంతో కాసిని ఓట్లో సీట్లో దక్కించుకోవడానికి పవన్ కల్యాణ్ ప్రాపకాన్ని కోరుకుంటున్నదని ప్రజలంతా అనుకుంటూ ఉంటారు. పవన్ ఇచ్చే బిల్డప్ కూడా అలాగే ఉంటుంది.
బిజెపి, పవన్ కల్యాణ్ వెనుకపడుతున్నదనేదే అందరి అభిప్రాయం. అలాంటి నేపథ్యంలో అమిత్ షా చెప్పారని ప్రచారంలోకి వస్తున్న మాటలు చిత్రంగా ఉన్నాయి. పవన్ కల్యాణ్ వెనుక తమ పార్టీ పడడం లేదని పవన్ కల్యాణే తమ పార్టీ వెనుక పడుతున్నారని అమిత్ షా అన్నారట! అది నిజమేనా? ఇంతకూ ఆయన అలా అన్నారా? లేదా?
అమిత్ షా.. ఇలా అన్నట్టుగా ప్రజాశాంతి పార్టీ సారధి కెఎ పాల్ ప్రకటించారు. కొన్ని రోజుల కిందట ఢిల్లీలో అమిత్ షాను కలిసిన కెఎ పాల్, తెలంగాణలో పర్యటిస్తుండగా తన మీద జరిగిన దాడి గురించి కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేశారు. బయటకు వచ్చిన తర్వాత చాలా విషయాలు మాట్లాడారు.
తాజాగా ఢిల్లీలోనే ప్రెస్ మీట్ పెట్టి దేశవ్యాప్తంగా తమ పార్టీ 178 లోక్ సభ సీట్లు గెలవబోతున్నదంటూ హాస్యాస్పద సంచలన ప్రకటన చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ మినహా మొత్తం అన్ని లోక్ సభ సీట్లలో తమ పార్టీనే గెలుస్తుందని కూడా ఆయన ప్రకటించారు.
కెఎ పాల్ ఇలాంటి కామెడీ చేయడం చాలా మూమూలు విషయమే. ప్రతి సారీ ఆయన తన కామెడీ డైలాగులతో రక్తి కట్టిస్తూనే ఉంటారు. కామెడీ చేస్తున్నట్టుగా కనిపించకుండా, చాలా సీరియస్ గా కామెడీ చేయడం ఆయనేకు మాత్రమే చెల్లిన విద్య. కాబట్టి పాల్ కామెడీని మొత్తం పక్కన పెడితే.. పవన్ కల్యాణ్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం పట్టించుకోదగినవి.
రెండు శాతం ఓట్లు లేని పవన్ కల్యాణ్ వెనుక ఎందుకు పడుతున్నారని, పాల్, అమిత్ షాను అడిగారట. తాము (బీజేపీ) పవన్ వెనుక పడడం లేదని, పవనే తమ వెనుక పడుతున్నారని అమిత్ షా చెప్పారట. అమిత్ షా అలా చెప్పారో లేదో తెలియదు. కానీ, ఏకంగా హోం మంత్రి కి ఆపాదించి.. కామెడీ ప్రకటన చేసేంత సాహసం పాల్ కి ఉంటుందని అనుకోలేం.
ఏపీలో మాత్రమే అస్తిత్వం కలిగిఉంటూ.. ప్రస్తుతం చంద్రబాబు పల్లకీ మోయడానికి ఉత్సాహపడుతున్న పవన్ కల్యాణ్.. బీజేపీ వెంటపడుతున్నారా? వారు వద్దనుకున్నా.. ఆయనే బిజెపితో సంబంధాన్ని కొనసాగిస్తున్నారా? ఇదంతా బిజెపితో కూడా చంద్రబాబు పల్లకీ మోయించడానికి జరుగుతున్న వ్యూహాత్మక ప్రయత్నమా? అనే రకరకాల సందేహాలు.. పాల్ ప్రకటన నేపథ్యంలో కలుగుతున్నాయి.