పురందేశ్వ‌రి, ష‌ర్మిల‌… ఎంత తేడా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో కొంత కాలంగా ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల కూడా వార్త‌ల్లో నిలిచారు. ఈ ఇద్ద‌రు…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో కొంత కాలంగా ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల కూడా వార్త‌ల్లో నిలిచారు. ఈ ఇద్ద‌రు మ‌హిళా నేత‌లు త‌మ తండ్రుల రాజ‌కీయ నేప‌థ్యంతో గుర్తింపు, గౌర‌వం పొందార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఆర్ త‌న‌యగా పురందేశ్వ‌రి, వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి బిడ్డ‌గా ష‌ర్మిల రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఎన్టీఆర్‌, వైఎస్సార్ ఇద్ద‌రు నేత‌లు ముఖ్య‌మంత్రులుగా ప‌ని చేశారు. విశేష ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన నాయ‌కులుగా, సంక్షేమ సార‌థులుగా గౌర‌వాన్ని ద‌క్కించుకున్నారు.

అయితే మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఎలాగైనా బ‌తికించుకోవాల‌ని పురందేశ్వ‌రి తాప‌త్ర‌య ప‌డుతున్నారు. ఆమె ప్రాతినిథ్యం వ‌హిస్తోంది మాత్రం బీజేపీకి. అంతేకాదు, బీజేపీ రాష్ట్ర సార‌థ్య బాధ్య‌త‌లు పురందేశ్వ‌రి చేతిలో ఉన్నాయి. అలాంటిది సొంత పార్టీని ఏపీలో బ‌లోపేతం చేయ‌డానికి బ‌దులు మరిది చంద్ర‌బాబు, టీడీపీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం సొంత పార్టీని బ‌లి పెడుతున్నార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. చివ‌రికి సొంత పార్టీ నాయ‌కుల నుంచి కూడా ఇలాంటి ఆరోప‌ణ‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది.

అయితే ఎన్టీఆర్‌, టీడీపీ వైపు నుంచి చూస్తే… పురందేశ్వ‌రి చొర‌వ అభినంద‌న‌లు అందుకుంటోంది. నిజానికి ఎన్టీఆర్‌ను ప‌ద‌వీచ్యుతుడిని చేయ‌డంలో ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుతో పాటు పురందేశ్వ‌రి కూడా క్రియాశీల‌క పాత్ర పోషించార‌నే అభిప్రాయం వుంది. అనంత‌ర ప‌రిస్థితుల్లో ద‌గ్గుబాటిని చంద్ర‌బాబు ప‌క్క‌న ప‌డేశారు. దీంతో చంద్ర‌బాబుపై ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు నిప్పులు చెరిగారు. న‌మ్మ‌క ద్రోహి అయిన చంద్ర‌బాబుపై కోపంతో పురందేశ్వ‌రి దంప‌తులు కాంగ్రెస్‌లో చేరారు. కేంద్రంలో పురందేశ్వ‌రి మంత్రి కూడా అయ్యారు.

ఇప్పుడు అదే పురందేశ్వ‌రి పాత సంగ‌తుల‌న్నీ మ‌రిచిపోయి చంద్ర‌బాబు కోసం అండ‌గా నిలిచారు. ఈ సంద‌ర్భంగా ఎంతో న‌మ్మ‌కంగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్ష బాధ్య‌త‌ల్ని అప్ప‌గించ‌గా, ఆమె మాత్రం పార్టీ కంటే, త‌న చెల్లెలి భ‌ర్త చంద్ర‌బాబు, తండ్రి స్థాపించిన టీడీపీ ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని చేత‌ల ద్వారా చెప్ప‌క‌నే చెబుతున్నారు. బాబును ముఖ్య‌మంత్రి చేసుకోవాల‌ని ఆమె ప‌రిత‌పిస్తున్నార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. పురందేశ్వ‌రి బంధుప్రీతిని త‌ప్ప‌క అభినందించాలి.

ఇదే ష‌ర్మిల విష‌యానికి వ‌స్తే… సొంత అన్న‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌పై కోపంతో ర‌గిలిపోతున్నారు. అన్న వ‌దిలిన బాణంగా సుదీర్ఘ పాద‌యాత్ర చేసి, వైసీపీని అధికారంలోకి తీసుకురావ‌డంలో క్రియాశీల‌క పోషించి.. ఇప్పుడు రివ‌ర్స్ అయ్యారు. వ్య‌క్తిగ‌తంగా అన్నాచెల్లెళ్ల మ‌ధ్య ఎన్నైనా విభేదాలు వుండొచ్చు. కానీ ర‌చ్చ‌కెక్కి అన్న వైఎస్ జ‌గ‌న్‌కు న‌ష్టం తెచ్చేలా ష‌ర్మిల ప్ర‌వ‌ర్తిస్తున్నారేమో అనే విమ‌ర్శ లేక‌పోలేదు. నిన్న‌టికి నిన్న ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిపై విమ‌ర్శ‌లు చేశారు. త‌న అన్న వైఎస్ జ‌గ‌న్‌కు అయినా ఇదే ఆన్స‌ర్ వ‌ర్తిస్తుంద‌ని పొంత‌న లేని విష‌యంలో అతిగా స్పందించారు.

బాబు, జ‌గ‌న్ బంధువుల మ‌ధ్య తేడా చెప్ప‌డానికే ఈ పోలిక‌. ఎలాగైనా బాబును అధికారంలోకి తీసుకురావాల‌ని ప‌క్క పార్టీలోని ఆయ‌న బంధువులు, స్నేహితులు త‌పిస్తున్న వైనం ఒక వైపు, రక్తం పంచుకు పుట్టిన చెల్లి ష‌ర్మిల అందుకు పూర్తి విరుద్ధంగా రాజ‌కీయ ప్ర‌స్థానం కొన‌సాగిస్తున్న తీరు మ‌రోవైపు చూడొచ్చు. 

కాంగ్రెస్‌ను వ్య‌తిరేకించి వైసీపీని జ‌గ‌న్ స్థాపించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అదే కాంగ్రెస్‌కు ష‌ర్మిల తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తు ఇవ్వ‌డం అంటే, అన్న‌ను ధిక్క‌రించ‌డంగానే చూడాలి. అన్న‌పై కోపంతోనే కాంగ్రెస్‌కు షర్మిల అండ‌గా నిలిచార‌నే వాద‌న‌ను కూడా తోసిపుచ్చ‌లేం. వైఎస్సార్‌, ఎన్టీఆర్ బిడ్డ‌ల తీరు  ఇట్లా వుంది.