Advertisement

Advertisement


Home > Politics - Analysis

'వర్క్ ఫ్రం హోం' వద్దంటున్న ఎలాన్ మస్క్

'వర్క్ ఫ్రం హోం' వద్దంటున్న ఎలాన్ మస్క్

కరోనా కాలంలో లక్షలాదిమందికి కొత్తగా అలవాటైన విధానం వర్క్ ఫ్రం హోం. ఒక రకంగా అది సుఖం మరగడానికి కారణం అయ్యింది. హడావిడిగా లేచి ఆఫీసుకి పరుగెత్తాల్సిన అవసరం ఉండదు. కారో, బైకో నడిపే టెన్షన్లు ఉండవు. పెట్రోల్ ఖర్చులు తగ్గాయి. ఆఫీసుకి దగ్గర్లో ఉంటూ భారీ రెంట్లు చెల్లించకుండా ఊరికి దూరంగా చవకగానో, వీలుంటే సొంతూరులోని సొంత ఇంటిలోనో పడి ల్యాప్ టాప్ పెట్టుకుని ఉద్యోగాలు చేసుకోవడం పరిపాటి అయిపోయింది. దీనికి తోడు రెండు వేరు వేరు ల్యాప్టాపులు పెట్టుకుని ఒకటికి రెండు ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు కూడా అందిపుచ్చుకున్నారు చాలామంది. వ్యక్తిగతంగా ఇదంతా బాగానే ఉన్నా దీని చుట్టూ జరుగుతున్న నష్టాలు కూడా అంచనా వేస్తున్నారు నిపుణులు. 

ఎలాన్ మస్క్ కొత్తగా ఒకమాటన్నాడు.... "ల్యాప్టాపులు పెట్టుకుని ఇల్లు కదలకుండా ఉద్యోగం చేసుకుంటున్న వాళ్లకి నైతిక విలువలు లేనట్టే" అని. 

ఎందుకంటే ఐటీ నిపుణుల్లాగ ఇంటిపట్టునుండి పని చేసుకునే అవకాశం లేక ఎండల్లో పడో, దూరప్రయాణాలు చేసి ఆఫీసులకొచ్చి పని చేసుకునే ఇతర రంగాల కార్మికులు ఎలా ఫీలౌతారో ఆలోచించమని మస్క్ ఆంతర్యం. 

నిజంగానే ప్రపంచంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య ఇతరులతో పోలిస్తే తక్కువ. వర్క్ ఫ్రం హోం అవకాశం అందరికీ ఉండదు. కచ్చితంగా ఫ్యాక్టరీలకో, వర్క్ సైట్ కో వెళ్లి పని చేసుకోవాల్సి ఉన్న వాళ్లే ఎక్కువ. కనుక వాళ్లని దృష్టిలో పెట్టుకుని ఆఫీసులకొచ్చి పని చెయ్యమని మస్క్ గారి పిలుపు. 

అయితే ఇంత నైతికత, మానవత్వం గురించి మాట్లాడుతున్న మస్క్ ఏకంగా మనుషుల ఉద్యోగాల్నే మింగేసే ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ లో పెట్టుబడులు పెట్టడం, భవిష్యత్తంతా ఏ.ఐ మాత్రమే ఉంటుందని, అందరి ఉద్యోగాలు పోతాయని సంబరంగా చెప్పడం గమనార్హం. మరి  హఠాత్తుగా మస్క్ లో మానవీయ కోణం ఎందుకొచ్చింది?

కాస్త వెనక్కి తిరిగి చూస్తే ఇది హఠాత్తుగా వచ్చింది కాదు. ముందునుంచీ వర్క్ ఫ్రం హోం కి మస్క్ వ్యతిరేకి. అతనిది టెస్లా కార్ల కంపెనీ. వాటి సేల్స్ బాగానే ఉన్నా మరింత బాగుండాలంటే వర్క్ ఫ్రం హోం అనేది ఉండనే ఉండకూడదని అతని భావన. విజనరీస్ అలాగే ఆలోచిస్తారేమో. ఎందుకంటే, ఆఫీసులకొచ్చి పని చేసే క్రమంలో ఉద్యోగులు సోషలైజ్ అవుతారు. ఒకర్ని చూసి ఒకరు ఇమిటేట్ చేస్తూ, ఇన్స్పైర్ అవుతూ బట్టల నుంచి, కళ్లజోళ్ల నుంచి కార్ల వరకు కొంటూ ఉంటారు. అలా విరివిగా ఖర్చు పెట్టే వాళ్లు ఐటీ రంగంలోని ఉద్యోగులే ఎక్కువ. వాళ్లంతా వర్క్ ఫ్రం హోం అని ఇంటికి పరిమితమైపోతే ఇన్స్పిరేషన్, ఇంఫ్లుయెన్స్ లేక వాళ్లల్లో లగ్జరీల మీద ఆసక్తి తగ్గిపోవచ్చు. దాని పర్యవసానం అనేక లగ్జరీ ప్రోడక్ట్ సెగ్మెంట్స్ తో పాటూ టెస్లా కార్ల సేల్స్ మీద కూడా పడవచ్చు. ఇందులో పూర్తి సత్యం ఉన్నా లేకపోయినా అర్థ సత్యమైనా ఉండొచ్చు. 

మస్క్ సంగతి పక్కన పెట్టి వ్యక్తిగతానికి వద్దాం. నిజంగానే నలుగురితోనూ కలిసి పని చేసినప్పుడే ఐడియాలు షేర్ చేసుకోగలం. సబ్జెక్ట్ ని కూడా పెంచుకోగలం. తద్వారా అది కంపీనీల ప్రొడక్టివిటీ మీద కూడా ప్రభావం చూపించగలం. మస్క్ కూడా ఇదే అన్నాడు..వర్క్ ఫ్రం హోం వల్ల చాలా కంపెనీల్లో ప్రొడక్టివిటీ తగ్గిందని. 

అనుకున్న పని అనుకున్నట్టుగా చేసుకుంటూ పోతే సరిపోదు. ఐటీ రంగం ఇనోవేషన్ మీద ప్రగతి సాధిస్తూ ఉంటుంది. నాలుగు బ్రెయిన్స్ కలిసి పని చేస్తే తప్ప ఆ ఇనోవేషన్ సాధ్యం కాదు. అది కూడా కార్యక్షేత్రంలో పగలంతా అందరితో గడిపినప్పుడు జరిగే ఉత్పాదకత ఇంట్లో కూర్చుని పని చేస్తే కచ్చితంగా రాదు. ఒకవేళ వస్తుందనిపించినా అది శాశ్వతం మాత్రం కాదు. కనుక వృత్తిపరమైన ప్రగతికి వర్క్ ఫ్రం హోం లాంగ్ రన్ లో పెద్ద డేంజర్ గా పరిణమించవచ్చు. అంతే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, సోషలైజింగ్ నేచర్ కూడా కోల్పోయే అవకాశం ఉంది. 

ఎలా చూసుకున్నా మస్క్ చెప్పిన మాటల్లో ఆంతర్యాన్ని గ్రహిస్తే మునుపటి మాదిరిగా ఆఫీసులకొచ్చి పని చేసుకుంటేనే అప్గ్రేడ్ అవుతూ లీగ్ లో ఉండగలిగే పరిస్థితి ఉంటుంది. వర్క్ ఫ్రం హోం కాకుండా ఆఫీసులకొచ్చి పని చేసే వాళ్లకి మాత్రమే కొన్ని రాయితీలు, ప్రోత్సాహకాలు పెడితే చాలు మళ్లీ అందరూ బద్ధకం విడిచి, కంఫర్ట్ జోన్లోంచి బయటికి వచ్చి ఆఫీసులకొస్తారు. తద్వారా ఆయా ఐటీ కంపెనీలని ఆధారం చేసుకుని జీవనం సాగిస్తున్న ఇతర కార్మికులు, క్యాంటీన్ నడిపే వాళ్లు కూడా బాగుపడతారు. మానవసంబంధాలు బలపడతాయి. ఇకపై "వర్క్ ఫ్రం హోం" ఫెసిలిటీని కంపెనీల్లో హై అచీవర్స్ కి మాత్రమే ఇచ్చే తాత్కాలిక అవకాశంలా ఉండాలి తప్ప అందరికీ కాకూడదు. 

వై. జి. శ్యామల

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?