దొంగే దొంగా దొంగా అని కేకలేస్తున్నా… అధికార వైసీపీ నోరు మెదపలేని దయనీయ స్థితి. టీడీపీ అధికారంలో వున్నప్పుడు భారీగా డేటా చౌర్యానికి పాల్పడి, లక్షలాది ఓట్లను మాయం చేసేందుకు టీడీపీ ప్రయత్నించడం, వైసీపీ గుర్తించి ఆట కట్టించిన సంగతి తెలిసిందే.
డేటా చోరీ, పెగాసస్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై నిగ్గు తేల్చేందుకు ఎమ్మెల్యేల కోరిక మేరకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం శాసనసభ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. ఈ కమిటీని వేసిన కొత్తలో వరుసగా రెండు భేటీలు నిర్వహించింది. దాదాపు 10 నెలలుగా ఆ కమిటీ కనీసం సమావేశం కాలేదు. టీడీపీ డేటా చోరీపై నిగ్గు తేల్చేందుకు వైసీపీ సర్కార్ ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యం కలిగించడంతో పాటు విమర్శలపాలవుతోంది.
వైసీపీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో, ఇప్పుడు టీడీపీనే డేటా చోరీ అంటూ ఊరూరా ప్రచారం చేస్తోంది. పాదయాత్రలో లోకేశ్ మాట్లాడుతూ గజ దొంగ జగన్ ఇప్పుడు డేటా దొంగ అవతారం ఎత్తారని విమర్శించారు. వలంటీర్లు ఇంటికొచ్చి వివరాలు అడిగినా చెప్పొద్దని సూచిస్తున్నారు. ఒకవేళ వివరాలు ఇస్తే మీ పొలాలు, ఆస్తులు కొట్టేస్తారు జాగ్రత్త అని ఆయన హెచ్చరించడం గమనార్హం. సురక్ష పేరుతో విద్యార్థులకు ఏదో మేలు చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తూ.. మన డేటాకు రక్షణ లేకుండా చేయడానికి శ్రీకారం చుట్టారని లోకేశ్ విమర్శించారు.
సీఎంను గజదొంగ అంటున్నా వైసీపీ పెద్దలకు కనీసం చీమ కుట్టినట్టైనా లేదు. టీడీపీ హయాంలో డేటా చోరీకి పాల్పడ్డారని పక్కా ఆధారాలున్నా వైసీపీ ప్రభుత్వం ఎందుకనో ఏమీ చేయలేకపోతోంది. పైగా డేటా అంతు తేల్చేందుకు భూమన నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి కూడా, ఎలాంటి చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో ఆ పార్టీ వుండడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. గతంలో టీడీపీ హయాంలో ఏం జరిగిందో తెలుసుకుందాం.
చంద్రబాబు హయాంలో సేవా మిత్రా అనే యాప్‌ను తీసుకొచ్చారు. వైసీపీ బలంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఈ యాప్ ద్వారా ఆ పార్టీ ఓటర్లను గుర్తించారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఆ పని చేశారు. ఈ నేపథ్యంలో 2018, సెప్టెంబర్ నాటికి వైసీపీ మద్దతుదారులని టీడీపీ అనుమానించి 41 లక్షల 50వేల 457 మంది ఓట్లను తొలగించారు. సెప్టెంబర్, 2018 డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రకారం 3,51,95,260 ఓట్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 2019, ఏప్రిల్ నాటికి ఓటర్ జాబితా ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ మొత్తం ఓట్ల సంఖ్య 3,93,45,717గా తేల్చింది.
ఈ రెండు ఓటర్ల జాబితాను బాగా గమనిస్తే 41 లక్షల 50 వేల 457 ఓట్ల తేడా కనిపిస్తుంది. ఏడు నెలల కాలంలో ఇంత భారీ మొత్తంలో ఓట్లు పెరగడం అనూహ్య పరిణామం. ఇవన్నీ కొత్త ఓట్లు కాకపోవడం గమనార్హం. కొత్తగా 18 సంవత్సరాలు నిండిన వారు నమోదు చేసుకున్న ఓట్లు కొన్ని మాత్రమే. మరి భారీ మొత్తంలో నమోదైన ఓట్లు ఎవరివి? ఎలా వచ్చాయి?
గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఒక పథకం ప్రకారం వైసీపీ మద్దతుదారులకు సంబంధించి 30 వేల నుంచి 40 వేల ఓట్లను తొలగించింది. నాడు టీడీపీ కుట్రల్ని కనిపెట్టిన వ్యక్తి , ఐటీ నిపుణుడు తుమ్మల లోకేశ్వరరెడ్డి. టీడీపీ బండారాన్ని బట్టబయలు చేశాడనే అక్కసుతో హైదరాబాద్‌లో వుంటున్న లోకేశ్వరరెడ్డిని నాటి ఏపీ పోలీసులు టార్గెట్ చేశారు. నాడు లోకేశ్వరరెడ్డి ఇంటిపై ఏపీ పోలీసులు దాడికి పాల్పడ్డం తీవ్ర కలకలం రేపింది.
2018, 2019లలో దొంగ ఓట్లతో పాటు తన సానుభూతి పరుల ఓట్లు తొలగించడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం, అలాగే రాష్ట్ర హైకోర్టుకు వెళ్లి, తొలగించిన ఓట్లను తిరిగి పునరుద్ధరించేందుకు వైసీపీ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైసీపీ నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీడీపీ ప్రభుత్వం తొలగించిన ఓట్లు ఎన్నికల కమిషన్ ద్వారా తిరిగి పునరుద్ధరించారు.
డేటా గజదొంగ చంద్రబాబు, నారా లోకేశ్ అని ఆధారాలతో సహా ఉన్నప్పటికీ, వారి విమర్శలకు కౌంటర్ వైసీపీ నుంచి లేకపోవడం గమనార్హం. ఇప్పటికైనా భూమన నేతృత్వంలోని ఉప సంఘం యాక్టీవ్ అయి డేటా చోరీపై నిగ్గు తేల్చాల్సిన అవసరం వుంది. లేదంటే వైసీపీ ప్రభుత్వం ఆరంభ శూరత్వం తప్ప, ఏమీ చేయలేదనే చెడ్డపేరును స్థిరపరచుకోవాల్సి వుంటుంది.