Advertisement

Advertisement


Home > Politics - Analysis

హైదరాబాద్ రియల్ ఎస్టేట్: రేవంత్ పాలనలో ఎలా ఉంది?

హైదరాబాద్ రియల్ ఎస్టేట్: రేవంత్ పాలనలో ఎలా ఉంది?

2023 నవంబర్ వరకు కాంగ్రెస్ తెలంగాణా రాష్ట్రంలో అధికారంలోకొస్తే రియల్ ఎస్టేట్ ఢమాలని పడిపోతుందని తెగ ప్రచారం చేసారు. ఒక రకంగా అత్యధికులు దానిని నమ్మారు కూడా. 

హైరాబాద్ రియల్ ఎస్టేట్ అభివృద్ధి అంతా కేటీఆర్, కేసీయార్ ల విజన్ ప్రకారం జరుగుతోందని, ప్రభుత్వం మారితే అంతా గందరగోళమవుతుందని అనుకున్నారు. పైగా కాంగ్రెస్ ప్రభుత్వమొస్తే ఏకీకృత నాయకత్వముండదని, సుస్థిరమైన ముఖ్యమంత్రి కూడా కష్టమనే అభిప్రాయాలు కూడా బయలుదేరాయి. 

బహుశా ఈ భావాలు జీ.హెచ్.ఎం.సీ వాసుల్లో బలంగా ఉండడం వల్ల కాబోలు...హైదరాబాదులో బీ.ఆర్.ఎస్ పార్టీ జీ.హెచ్.ఎం.సి పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ గెలిచింది. 

కానీ తెలంగాణా అంటే హైదరాబాద్ ఒకటే కాదు కదా. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే కాంగ్రెస్ కే జనం పట్టం కట్టారు. అధికారం కాంగ్రెస్ చేతికి వచ్చింది. కొత్త సీయం వచ్చాడు. రియల్ ఎస్టేట్ కుప్పకూలుతుందని అనుకున్నారు కదా! కానీ జరిగిందేమిటి?

కాంగ్రెస్ అధికారం చేపట్టి 4 నెలలు దాటింది. ప్రతి నెల రియల్ వ్యాపారం అంతకంతకూ పెరుగుతోంది తప్ప తగ్గడంలేదు. ఈ మార్చ్ నెలలో ఏకంగా రూ 4000 వేల కోట్ల పైచిలుకు విలువైన ఆస్తులను కొన్నారు ప్రజలు. 

నిజానికి ఎన్నికల సీజన్లో రియల్ దందా స్లో అవుతుంది. ఎందుకంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ క్యాష్ తో జరుగుతాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా క్యాష్ ని క్యారీ చేసే ధైర్యం చేయరు జనం. అయినప్పటికీ ఈ రేంజులో అమ్మకాలు జరగడం ఆశ్చర్యం. 

కాస్త వెనక్కి వెళ్లి చూస్తే ఈ 2024 జనవరిలో 3290 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగితే, బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి 2023 జనవరిలో 2650 కోట్ల వ్యాపారం మాత్రమే జరిగింది. అంటే ఏడాది తర్వాత అదే నెలలో ప్రభుత్వం మారాక దాదాపు 600 కోట్లు అదనంగా వ్యాపారం జరిగిందన్నమాట. 

దీనినిబట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెరుగుదల, ఎదుగుదల అన్నీ తమ గొప్పదనమే అని బీ.ఆర్.ఎస్ చెప్పుకోవడానికి లేదిప్పుడు. రేవంత్ రెడ్డి వచ్చి 130 రోజులు అవ్వకుండానే బీటౌట్ చేసాడు. 

ఈ ఎదుగుదల ధరల పెరుగుదల వల్లేమో అని డౌట్ రావచ్చు. కానీ మ్యాటర్ అది కాదు. ఫిబ్రవరి 2023 లో 5725 యూనిట్ల ఆస్తులు అమ్ముడైతే, 2024 ఫిబ్రవరిలో 7135 అమ్ముడయ్యాయి. అంటే కొంటున్నవాళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 

రూ 2 కోట్ల పైగా విలువున్న గృహ ఆస్తుల కొనుగోళ్ళ పెరుగుదల కూడా 1% పెరిగింది. రూ 25 లక్షల నుంచి రూ 50 లక్షల మధ్యలో పలికే ఆస్తుల రిజిస్ట్రేషన్స్ 45% గా ఉన్నాయి. 50 లక్షల నుంచి 75 లక్షల మధ్య ఆస్తుల విక్రయాలు 16% గా నమోదయ్యింది. 

ఎలా చూసుకున్నా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గత 130 రోజుల్లో కొత్త రికార్డులని రాసింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే గణనీయమైన మెరుగుదల, పెరుగుదల కనిపించింది. 

"ట్రెండ్ ని బట్టి చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మునుపటి కంటే మెరుగ్గా ఉండేలా ఉంది. బహుశా రేవంత్ రెడ్డి నాయకత్వంపై హైదరాబాద్ ప్రజలు కూడా నమ్మకం పెంచుకోవడం వల్ల కావొచ్చు. అనుకున్న విధంగా ఎక్కడా రియలెస్టేట్ డౌన్ అవ్వలేదు" అని సుధీర్ కుమార్ అనే రియాల్టర్ తెలిపారు. 

"ఏ ప్రభుత్వమొచ్చినా హైదరాబాద్ అనే బ్రాండ్ కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎప్పుడూ పడదు" అని రమేష్ అగర్వాల్ అనే మరో రియాల్టర్ చెప్తున్నారు. 

ఎవరు ఏమనుకున్నా, ఎన్ని రకాలుగా భయపడినా ఒక్కోసారి దానికి భిన్నంగా జరిగి మునుపటికంటే మెరుగైన పరిస్థితులు కనిపించొచ్చు. దానికి ఉదాహరణే ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. చూడాలి మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో. 

శ్రీనివాసమూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?