ఇక వారాహి తెలంగాణలో తిరుగుతుందా?

మొదటి దానికి మొగుడు లేడు కానీ కడదానికి కళ్యాణం అన్నది వెనకటికి సామెత. ఆంధ్రలో అసలు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు, ఎక్కడ పోటీ చేస్తారు అన్నది క్లారిటీ లేదు కానీ తెలంగాణలో మాత్రం…

మొదటి దానికి మొగుడు లేడు కానీ కడదానికి కళ్యాణం అన్నది వెనకటికి సామెత. ఆంధ్రలో అసలు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు, ఎక్కడ పోటీ చేస్తారు అన్నది క్లారిటీ లేదు కానీ తెలంగాణలో మాత్రం మూడు పదులకు పైగా సీట్లోలో పోటీ చేస్తున్నామని పేర్లతో సహా ప్రకటించేసారు పవన్ కళ్యాణ్. 

జనసేన తెలంగాణలో పోటీ చేస్తుందని తెలిసిన, ప్రకటించిన స్థానాల పేర్లు గమనించాక అర్థం అయింది జనాలకు. యాంటీ గవర్నమెంట్ ఓట్లు చీల్చి, భారాస కు తగిన సాయం చేయడం కోసమే ఈ ఎత్తుగడ అని అర్థం అయింది.

సరే, ఇప్పుడు ఎన్నికల తేదీ వచ్చేసింది. జనసేన అర్జంట్ గా అభ్యర్ధులను ప్రకటించాలి. అలాగే ప్రచారం ప్రారంభించాలి. మరి, పవన్ కళ్యాణ్ తన వారాహిని ఈ ముఫైకి పైగా నియోజకవర్గాల్లో తిప్పుతారా? తన స్టయిల్ భాష, మాట, ఊపు అన్నీ తెలంగాణ ప్రజలకు కూడా చూపిస్తారా? కానీ పెద్ద చిక్కు వుంది ఇక్కడ.

భాజపా తెలంగాణలో ఓ ప్రధాన పోటీ దారు. దాన్ని పవన్ ఏమీ అనలేరు. ఎందుకంటే ఆంధ్రలో ఆ పార్టీతో పొత్తు వుంది. భారాస అధికారంలో వుంది. దాని లోటు పాట్లు భారీగా ఊగిపోతూ, తన భాషా పటిమ అంతా వాడి విమర్శలు కురిపించాలి. కానీ కేసీఆర్/కెటీఆర్ మీదకు ఆ రేంజ్ లో వెళ్లేంత సీన్ పవన్ కు లేదని జనాలు ఇప్పటికే చెవులు కొరుక్కుంటున్నారు. ఇక మిగిలింది కాంగ్రెస్. ఇక మళ్లీ దాన్నే తిట్టాలి. విమర్శించాలి.

కానీ ఇవన్నీ పవన్ ఏ సాకూ చెప్పకుండా, ఏ షూటింగ్ కు వెళ్లకుండా తెలంగాణలో పర్యటించినప్పటి సంగతి. చూద్దాం.