ఒకవైపు అదిగో అధికారం అంటోంది తెలుగుదేశం పార్టీ. వైఎస్ జగన్ పార్టీ అయిపోయిందని, తదుపరి అధికారం తమదేనంటూ తెలుగుదేశం పార్టీ స్వయంగా ప్రకటించుకుంటూనే ఉంది. సోషల్ మీడియాను చూసినా, తెలుగు తమ్ముళ్లను కదిలించినా ఇదే ముచ్చట! ఏపీలో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారం చేజిక్కించుకుంటుందని వీరంతా ధీమాగా చెబుతూ ఉన్నారు. ఇక జనసేన, తెలుగుదేశం కలిస్తే తిరుగులేదని.. పవన్ కల్యాణ్ పరోక్షంగా చెప్పుకుంటూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా జనసేన వైపు ఆశగా చూస్తూనే ఉంది. ఈ విషయంలో తన ప్రేమప్రతిపాదనను చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చేశారు కూడా! మరి పైకి కనిపిస్తున్నరాజకీయ చిత్రం ఇలా ఉంటే, క్షేత్ర స్థాయిలో మాత్రం కథ భిన్నంగా ఉండటం విశేషం.
అవిగో ఎన్నికలు, అదిగో అధికారం అంటూ చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నా ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జిలు మాత్రం ఆ మాటలను పెద్దగా పట్టించుకుంటున్నట్టుగా లేరు! వీరిలో సీనియర్లు, పార్టీ పాతకాపులు కూడా ఉండటం గమనార్హం. చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు నిస్తేజంగా ఉన్నాయి. పార్టీ కార్యకర్తలను తెలుగుదేశం ఇన్ చార్జిలు పట్టించుకోవడం లేదు. పార్టీ కార్యకర్తలతోనే తెలుగుదేశం ఇన్ చార్జిలు టచ్ లో లేకపోవడంతో.. వీరు ప్రజల వద్ద వరకూ ఎప్పటికి వెళ్లాలి! అనే సందేహం తలెత్తుతోంది.
ఇప్పటికే వారే అభ్యర్థులు అనుకున్న నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కదలక, మెదలకపోవడం విశేషం. అందుకు ఉదాహరణల్లో ఒకటి శ్రీకాళహస్తి నియోజకవర్గం. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో బొజ్జల సుధీర్ రెడ్డి పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున. అయితే సుధీర్ రెడ్డి చిత్తుగా ఓడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి చేతిలో బొజ్జల గోపాలకృష్ణరెడ్డి తనయుడు చిత్తయ్యారు. మధుసూదన్ రెడ్డికి దాదాపు 38 వేల ఓట్ల మెజారిటీ దక్కింది.
మరి ఆ ఎన్నికలు అయిపోయి మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పటి వరకూ ప్రతిపక్ష పార్టీ తరఫున సుధీర్ రెడ్డి యాక్టివిటీస్ ఏ మాత్రం లేవు! పేరుకైతే ఆయనే ఇన్ చార్జి. అందులోనూ గోపాలకృష్ణ రెడ్డికి చంద్రబాబుతో చాలా సాన్నిహిత్యం ఉండేది. మరి ఇప్పుడు ఆయన తనయుడు అంటే.. వచ్చే ఎన్నికల్లో సుధీర్ కు టికెట్ ఖరారు అయినట్టే. అయినప్పటికీ సుధీర్ మాత్రం పెద్దగా యాక్టివ్ గా లేరు. ఎన్నికలప్పుడు చూసుకుందాం అనే ధోరణితో ఉన్నారేమో!
అయితే సుధీర్ రెడ్డి ఏ రెండు మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయి ఉంటే, క్యాడర్ పటిష్టంగానే ఉందనుకోవచ్చు. కానీ ఏకంగా 38 వేల ఓట్ల తేడాతో తొలి సారి ఎన్నికల్లోనే ఓడిపోయారు సుధీర్ రెడ్డి. మరి ఇలాంటి నేపథ్యంలో.. వచ్చే సారికి కనీస పోటీ ఇవ్వాలన్నా.. ఇప్పటికే కార్యక్షేత్రంలోకి దిగాల్సింది. అయితే అలాంటి పరిస్థితి మాత్రం కనిపించడం లేదు!
ఇక ఇలా మచ్చుకు చెప్పుకోదగిన నియోజకవర్గాల్లో ఇంకోటి ధర్మవరం వంటి నియోజకవర్గం. ఇక్కడ నుంచి పరిటాల శ్రీరామ్ ను ఇన్ చార్జిగా ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అనుకూల నియోజకవర్గమే అయినప్పటికీ గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ చిత్తయ్యింది. అప్పుడు పార్టీ తరఫున పోటీ చేసి ఓడిన వరదాపురం సూరి తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలోకి చేరారు. దీంతో పరిటాల శ్రీరామ్ కు ఇన్ చార్జి పదవిన కట్టబెట్టారు. అయితే అప్పటికే శ్రీరామ్ రాప్తాడులో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరి రాప్తాడులోనే వారు దిద్దుకోవాల్సిన వ్యవహరాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ మరో ఛాయిస్ లేక ధర్మవరం నియోజకవర్గానికి పరిటాల శ్రీరామ్ ను అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఇన్ చార్జిగా ఆయన యాక్టివిటీస్ పెద్దగా లేవిక్కడ.
ఎప్పుడో మున్సిపల్ ఎన్నికలు జరిగిప్పుడు కాస్త హడావుడి చేశారు. అది కూడా కార్యకర్తల సమావేశం అంటూ కొంతమంది పచ్చచొక్కాలను పిలిపించుకుని వారి చేత సంతకాలు పెట్టించుకుని నామినేషన్లు వేయించారు. వారంతా అడ్రస్ లేకుండా ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత మళ్లీ చెప్పుకోదగిన స్థాయిలో శ్రీరామ్ ధర్మవరం నియోజకవర్గంలో తిరిగింది కానీ, పార్టీ క్యాడర్ ను అయినా కలుపుకుంది కానీ లేదు! ఏదో ఎన్నికల సమయంలో పోటీ చేసేస్తే.. పోటీ చేసింది తను కాబట్టి.. వరస పెట్టి ఓట్లు వేసేస్తారనే భ్రమల్లో ఉన్నారో ఏమో కానీ.. అధికారికంగా ఇన్ చార్జి అయినప్పటికీ.. శ్రీరామ్ మాత్రం నియోజకవర్గం మీద చేస్తున్న కసరత్తు కాస్తైనా కనిపించడం లేదు!
మరి యువనేతలు, తెలుగుదేశం పార్టీకి భావి రథసారథులు, తండ్రుల రాజకీయ నేపథ్యాన్ని వారసత్వంగా తీసుకున్న వాళ్లే.. మరీ ఇంత నిస్తేజంగా ఉంటే, ప్రజలకు చేరువ కావడం అటుంచి, కనీసం క్యాడర్ కుచేరువ కాకపోవడం గమనించాల్సిన అంశం. మరి అధికారం అదిగో అంటూ కూడా చంద్రబాబు నాయుడు వీరిని పెద్దగా నిద్రలేకపోతున్నారు! మరి అనుకూల నియోజకవర్గాల్లోనే ఇలాంటి పరిస్థితి అయితే.. తెలుగుదేశం పార్టీకి అధికారం అందేదెలాగో!