దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మ కేవీపీ అని చెప్పుకునే వారు. వైఎస్సార్‌కు కేవీపీలా జగన్‌కు ఎవరు? అనే చర్చ లేకపోలేదు. అలాంటి నమ్మకమైన, ఆత్మీయమైన నాయకులు జగన్‌కు లేకపోలేదు. అలాంటి వారిలో మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి. జగన్‌కు ఆయన ఆత్మలాంటి వారు. వివాదానికి చోటు లేకుండా, జగన్ మనసెరిగి ప్రవర్తించే నాయకుడు మిథున్‌రెడ్డి.
సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న తరుణంలో జగన్ నిర్ణయాల్లో మిథున్‌రెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై నిత్యం సర్వేలు, వాటి నివేదికలను పర్యవేక్షించడంలో మిథున్‌రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిసింది. ఎలాగైనా రానున్న ఎన్నికల్లో గెలిచి, మరోసారి అధికారంలోకి రావాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. అందుకు తగ్గట్టు వ్యూహాలు రచిస్తున్నారు. కీలక నిర్ణయాలను తీసుకునేందుకు జగన్ చర్చించే వారిలో మిథున్‌రెడ్డి ముఖ్యుడు.
జగన్ సన్నిహితులుగా దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి, కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పేర్ని నాని, మిథున్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు గుర్తింపు పొందారు. మంత్రి ఆర్కే రోజా కూడా ముఖ్యమంత్రి అభిమానాన్ని చూరగొన్ని వైసీపీ నాయకురాలిగా అందరికీ తెలుసు. వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందరున్నా జగన్ బాగా ఇష్టపడే వాళ్లు మాత్రం వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల పాత్ర కొన్నింటికే పరిమితం. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ తమకు కేటాయించిన మేరకు మాత్రమే ఈ ముగ్గురు నేతలు నడుకుంటుంటారు. జగన్‌కు ఆప్తులు మాత్రమే మేకపాటి గౌతమ్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అని పార్టీ వర్గాలు చెబుతాయి. గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతి జగన్‌కు పెద్ద లోటే. బుగ్గన విషయానికి వస్తే… ఆర్థికపరమైన అన్ని అంశాలను సదరు మంత్రితోనే చర్చిస్తారు. కర్నూలు జిల్లా రాజకీయాల వరకే బుగ్గన పరిమితం.
ప్రభుత్వ, పార్టీ విధానాలను లోకానికి చెప్పడంలో సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి తదితర నాయకులు మాత్రమే కనిపిస్తుంటారు. పార్టీలో ఫలానా వాళ్లు నెంబర్ 2, 3 అని చెప్పుకుంటుంటారు. జగన్‌పై ప్రత్యర్థులు విమర్శలు చేస్తే… వెంటనే కొడాలి నాని, పేర్ని నాని, రోజా , అంబటి రాంబాబు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మేరుగ నాగార్జున, గుడివాడ అమర్నాథ్ తదితరులు మీడియా ముందుకొచ్చి దీటుగా కౌంటర్లు ఇస్తుంటారు. కానీ పైకి కనిపించని, చర్చకు నోచుకోని నాయకుడు మాత్రం మిథున్ అంటే అతిశయోక్తి కాదు. అదృశ్యంగా వుంటూ, ముఖ్యంగా పార్టీ పరంగా విధాన పరంగా కీలక నిర్ణయాలను తీసుకోవడంలో మిథున్‌రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం.
నేతల పనితీరుపై మిథున్ రూపంలో జగన్ డేగ కన్ను వేశారనే చర్చ పార్టీలో నడుస్తోంది. చాపకిందు నీరులా మిథున్ వైసీపీలో పని చేస్తున్నారు. అందరి జాతకాలను తన దగ్గర పెట్టుకుని ఎప్పటికప్పుడు జగన్‌తో చర్చిస్తున్నట్టు సమా చారం. మిథున్ సున్నితంగా వ్యవహరిస్తూ, జగన్ మనసెరిగి నాయకులతో సమన్వయం చేసుకుంటున్నారు. పార్టీ పరంగా మిథున్ ఏం చేస్తున్నారనేది కేవలం జగన్‌కు మాత్రమే తెలుసు.
కుప్పం మొదలుకుని శ్రీకాకుళం వరకూ పార్టీలో ఏం జరుగుతున్నదో, తప్పొప్పులు తదితర విషయాలపై ఎప్పటికప్పుడు జగన్‌కు సమాచారం అందిస్తూ, అధినేత ఆదేశాలను అమలు చేస్తున్న నాయకుడిగా మిథున్‌రెడ్డి గురించి పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మిథున్ మృధు స్వభావి. అనవసర, అభ్యంతరకర విషయాలు ఆయన నోటి నుంచి రావు. ఎదుటి వాళ్లు చెప్పేది వినడానికే ప్రాధాన్యం ఇస్తారు. అదే జగన్‌కు నచ్చిన అంశం. అందుకే ఆయన్ను లోక్‌సభ వైసీపీ పక్ష నేతగా జగన్ నియమించారు. గతంలో కేవీపీ కూడా బయట ఎక్కడా కనిపించలేదు.
ఈ ఏడాది మే నెలలో జగన్ దావోస్‌లో పర్యటించారు. పెట్టుబడులు రాబట్టడం ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం. ఆయన వెంట ఉన్న ఏకైక లోక్‌సభ సభ్యుడు మిథున్‌రెడ్డే. దీన్ని బట్టి మిథున్‌కు జగన్ ఇచ్చే ప్రాధాన్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపికపై జగన్ ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారు. ఈ విషయంలో జగన్ తన అభిప్రాయాల్ని పంచుకునే ఒకరిద్దరిలో మిథున్ ఒకరనే చర్చ పార్టీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది.