యుద్ధానికి టీడీపీ కూట‌మి సిద్ధ‌మ‌య్యే లోపు… జ‌గ‌న్ ముగిస్తారా?

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎన్నిక‌ల యుద్ధానికి స‌మ‌రోత్సాహంతో సిద్ధ‌ప‌డుతున్నారు. వ‌రుస‌గా మూడు సిద్ధం స‌భ‌లు ఒక‌దానికి మించి మ‌రొక‌టి సూప‌ర్ హిట్ కావ‌డంతో, జ‌గ‌న్‌తో పాటు వైసీపీ శ్రేణుల్లో జోష్ క‌నిపిస్తోంది. మ‌ళ్లీ మ‌న‌దే…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎన్నిక‌ల యుద్ధానికి స‌మ‌రోత్సాహంతో సిద్ధ‌ప‌డుతున్నారు. వ‌రుస‌గా మూడు సిద్ధం స‌భ‌లు ఒక‌దానికి మించి మ‌రొక‌టి సూప‌ర్ హిట్ కావ‌డంతో, జ‌గ‌న్‌తో పాటు వైసీపీ శ్రేణుల్లో జోష్ క‌నిపిస్తోంది. మ‌ళ్లీ మ‌న‌దే అధికారం అనే ధీమా వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో క‌నిపిస్తోంది. గ‌త రెండు నెల‌లుగా ఏపీ రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తే… టీడీపీ-జ‌న‌సేన కూట‌మి గ్రాఫ్ క్ర‌మంగా ప‌డిపోతుంటే, వైసీపీది పెరుగుతోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం… జ‌గ‌న్‌తో త‌ల‌ప‌డాల‌ని అనుకుంటున్న కూట‌మి రాజ‌కీయ పంథానే.

అభ్య‌ర్థుల ఎంపిక మొద‌లుకుని, ఎన్నిక‌ల‌కు శ్రేణుల్ని స‌మాయ‌త్తం చేయ‌డం వ‌ర‌కూ వైఎస్ జ‌గ‌న్ ప‌క్కా ప్రణాళిక‌తో దూసుకెళుతున్నారు. సిద్ధం అంటూ ఊరూరా జ‌గ‌న్ ఫొటోతో ఫ్లెక్సీలు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. ఎక్క‌డ చూసినా త‌న గురించే మాట్లాడుకునేలా జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా త‌న ఎజెండాను అమ‌లు చేస్తున్నారు. జ‌గ‌న్ ప్ర‌త్య‌ర్థుల విష‌యానికి వ‌స్తే… ఏం చేస్తున్నారో వారికే అర్థం కాని ద‌య‌నీయ స్థితి.

ఎల్లో మీడియాలో మిన‌హాయిస్తే… జ‌గ‌న్‌పై జ‌నంలో తీవ్ర వ్య‌తిరేక‌త క‌నిపించ‌డం లేదు. పైగా జ‌గ‌న్ స‌భ‌ల‌కు వెల్లువెత్తుతున్న జ‌నాన్ని చూసి, మ‌ళ్లీ ఆయ‌నే సీఎం అయ్యేలా ఉన్నార‌నే సానుకూల వాతావ‌ర‌ణం క్ర‌మంగా పెరుగుతోంది. అటువైపు పొత్తుల పేరుతో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య డైలీ సీరియ‌ల్‌ను త‌ల‌పించే బ్ర‌హ్మాండ‌మైన డ్రామా న‌డుస్తోంది. ఎన్నిక‌ల స‌మ‌యం ముంచుకొస్తున్నా… బీజేపీతో పొత్తు తేల‌క‌పోవ‌డంతో టీడీపీ-జ‌న‌సేన సీట్ల పంప‌కంలో ప్ర‌తిష్టంభ‌న నెల‌కుంది. దీంతో టీడీపీ, జ‌న‌సేన శ్రేణుల్లో ఒక ర‌క‌మైన నైరాశ్యం ఏర్ప‌డింది.

ఈ నేప‌థ్యంలో త‌ట‌స్థ ఓట‌ర్లు సైతం గెలిచే పార్టీ వైపు మొగ్గు చూపేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ల కంటే జ‌గ‌న్‌ను గ‌ద్దె దించాల‌నే అక్క‌సు ఎల్లో మీడియాధిప‌తుల్లో ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అందుకే జ‌గన్‌కు సంబంధించి ప్ర‌తిదీ నెగెటివిటీ సృష్టించాల‌నే ఎల్లో మీడియా ప‌రిత‌పిస్తోంది. ఈ ధోర‌ణి శ్రుతిమించి జ‌గ‌న్‌కు అనుకూలంగా మారుతోంది.

రా…క‌దిలి రా పేరుతో చంద్ర‌బాబు, నిజం గెల‌వాలంటూ ఆయ‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి, శంఖారావం పేరుతో లోకేశ్ రాష్ట్ర‌మంతా క‌లియ తిరుగుతున్నారు. టీడీపీ మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేనాని మాత్రం… జ‌నంతో సంబంధం లేకుండా హాయిగా అటూఇటూ చ‌క్క‌ర్లు కొడుతున్నారు. జ‌గ‌నే కావాల‌ని జ‌నం అనుకుంటే తామేమీ చేయ‌లేమ‌నే భావ‌న‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉన్నారు. ఇల్లు అల‌క‌గానే పండుగ కాద‌నే సామెత చందంగా… పొత్తు పెట్టుకున్నంత మాత్రాన టీడీపీ-జ‌న‌సేన కూట‌మి అధికారంలోకి రాద‌ని ఆ రెండు పార్టీల నాయ‌కుల‌కు ఇంకా వాస్త‌వం బోధ‌ప‌డ‌న‌ట్టుంది.

ముఖ్యంగా అభ్య‌ర్థుల ఎంపిక‌, నియోజ‌క‌వ‌ర్గాల కేటాయింపు, న‌మ్మ‌క‌మైన మ్యానిఫెస్టో కీల‌క‌పాత్ర పోషిస్తాయి. 2014లో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇచ్చిన హామీల‌కు, ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత ఏమైందో అంద‌రికీ తెలుసు. అందుకే బాబు హామీల‌కు జ‌నంలో విశ్వ‌స‌నీయ‌త లేదన్న‌ది వాస్త‌వం. ఓట్ల కోసం చంద్ర‌బాబు ఎన్నైనా చెబుతార‌నే పేరు స్థిర‌ప‌డింది.

అటు వైపు జ‌గ‌న్ తాను ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌ని, మీరు రెడీనా అంటూ త‌న పార్టీ శ్రేణుల్ని ఎన్నిక‌ల క‌ద‌న‌రంగం వైపు ఉర‌క‌లెత్తిస్తున్నారు. జ‌గ‌న్‌ను ఢీకొట్టే స్థాయిలో టీడీపీ, జ‌న‌సేన కూట‌మి నుంచి క‌స‌ర‌త్తు జ‌ర‌గడం లేదు. ఎంత‌సేపూ జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌ల‌కే ప‌రిమితం అవుతున్నారు. ఇవి ఓట్లు రాల్చ‌వ‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్‌ల‌కు తెలియ‌దని అనుకోలేం. అయితే చంద్ర‌బాబు స‌హ‌జ లక్ష‌ణ‌మైన నాన్చివేత ధోర‌ణి, అలాగే భ‌యం వ‌ల్ల కూట‌మి చెప్పుకో త‌గిన స్థాయిలో ఎన్నిక‌ల స‌మ‌రానికి సిద్ధం కాలేదు.

తాను అర్జునుడిని అంటూ న‌లుదిక్కులు మార్మోగేలా జ‌గ‌న్ శంఖారావాన్ని పూరిస్తున్నారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, లోకేశ్‌, ఎల్లో మీడియాధిప‌తులు రామోజీరావు, రాధాకృష్ణ త‌దిత‌ర చిన్నాచిత‌కా రాజ‌కీయ‌, ఎల్లో  మీడియా య‌జ‌మానులు, ప్ర‌జెంట‌ర్లు పెద్ద సంఖ్య‌లో జ‌గ‌న్ ప్ర‌త్యర్థులుగా క‌నిపిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్‌ను క్షేత్ర‌స్థాయిలో ఢీకొట్టే సైన్యాన్ని స‌మాయ‌త్తం చేసుకోవ‌డంలో మాత్రం వెనుక‌ప‌డ్డారు. టీడీపీ అనుకూల టీవీ చాన‌ళ్ల‌లో కూచుని… జ‌గ‌న్‌ను తిడితే లాభం శూన్యం. కానీ వీటితోనే టీడీపీ-జ‌న‌సేన కూట‌మి నేత‌లు సంతృప్తి చెందుతున్నార‌నేది వాస్త‌వం.

చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, లోకేశ్‌లు జ‌గ‌న్‌ను గ‌ద్దె దించ‌డానికి తామెలా సిద్ధ‌మో జ‌నానికి వివ‌రించ‌డం లేదు. జ‌గ‌న్‌పై గ‌త ప‌దేళ్లుగా చేస్తున్న విమ‌ర్శ‌ల్ని, ఎన్నిక‌ల స‌మ‌యంలో మ‌రింత గ‌ట్టిగా రిపీట్ చేస్తున్నారు. జ‌గ‌న్‌పై గ‌తంలో ప్ర‌యోగించిన అస్త్రాల‌నే మ‌రోసారి ప్ర‌యోగిస్తున్నారు. ఇవ‌న్నీ నిష్ప్ర‌యోజ‌నం. జ‌గన్‌కు గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చే ప‌రిస్థితిలో టీడీపీ-జ‌న‌సేన కూట‌మి లేదు. నేను, నా సైన్యం సిద్ధం అని జ‌గ‌న్ స‌వాల్ విసురుతుంటే… కౌంట‌ర్‌గా మేము సిద్ధం అని చెప్ప‌లేని నిస్స‌హాయ స్థితిలో చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఉన్నారనేది చేదు నిజం. అందుకే జ‌గ‌న్ నెమ్మ‌దిగా పైచేయి సాధిస్తున్నార‌న్న సానుకూల భావ‌న జ‌నంలో పెరుగుతోంది.

టీడీపీ-జ‌న‌సేన కూట‌మి రాజ‌కీయ పంథాలో మార్పు రాక‌పోతే… అధికారాన్ని శాశ్వ‌తంగా మరిచిపోవ‌చ్చు. యుద్ధం అంటే ఇరుప‌క్షాలు భీక‌ర‌పోరు చేయ‌డం. జ‌గ‌న్ ఒక్క‌డే చేస్తే యుద్ధం కాదు. ఎందుకంటే అటు వైపు జ‌గ‌న్ ప్ర‌త్య‌ర్థి కూట‌మి ఇంకా యుద్ధానికి స‌న్న‌ద్ధం అయ్యే ప‌రిస్థితిలో లేదు. టీడీపీ,జ‌న‌సేన కూట‌మి అన్నీ స‌ర్దుకుని, యుద్ధానికి రెడీ అని ప్ర‌క‌టించే స‌మ‌యానికి, జ‌గ‌న్ పూర్తి చేస్తాడేమో అని చాలా మందికి ఆయ‌న దూకుడు చూస్తే అనిపిస్తోంది.