ఎన్నికలకు గట్టిగా ఇంకో ఆరు నెలల సమయం ఉంది. ఇలాంటి సమయంలో అధికారంలోకి రావాలని ఆశించే ఏ పార్టీ అయినా చేరికలను ఆశిస్తుంది. అయితే వీర పార్టీ జనసేన నుంచి మాత్రం చెప్పుకోవడానికి ఉన్న ఒకరీద్దరు నేతలు కూడా అధినాయకత్వం వైఖరిపై ఓపిక నశించి బయటకు వస్తోంది!
2019 ఎన్నికల దగ్గర నుంచి జనసేన నుంచి బయటకు వచ్చిన నేతల జాబితా అంటూ ఒకటి కనిపిస్తుంది కానీ, జనసేనలోకి చెప్పుకోదగిన స్థాయిలో నేతల చేరికల్లేవు! గోదావరి జిల్లాల పరిధిలో కొందరు రాజకీయ నిరుద్యోగులు జనసేనలోకి చేరిన వైనాలను పక్కన పెడితే.. ఉత్సాహాన్ని ఉప్పొంగించే చేరికలేవీ లేవు!
పవన్ కల్యాణ్ ఒక్కరే స్టేజీ మీద కనిపిస్తారు. పక్కన అప్పుడప్పుడు నాదెండ్లకు సీటు దక్కుతుంది! ఆవిర్భవించి పదేళ్లు గడిచిన ఒక పార్టీ దారుణ పరిస్థితి గురించి చెప్పుకోవడానికి ఇంతకన్నా ఏమీ లేదు! ప్రత్యేకించి ఇటీవల పవన్ కల్యాణ్ చంద్రబాబు నాయుడి పల్లకిని అందుకున్నాకా… జనసేన గ్రాఫ్ మరింతగా పతనం అయ్యింది. చంద్రబాబును సీఎంగా చేయడానికి పవన్ కల్యాణ్ పడుతున్న ఆరాటం జనసేనలో నిస్పృహను కలిగించింది. తెలుగుదేశం నేతలు ఏమైనా అన్నా.. బదులివ్వొద్దు అన్నట్టుగా పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన ఆ పార్టీ పరిస్థితిని దారుణ స్థితికి తీసుకెళ్లింది.
ఇక జనసేనను వీడిన వారి పట్ల పవన్ కల్యాణే వారు చెడ్డోళ్లు, జగన్ మనుషులుగా ఇన్నాళ్లూ తన వద్ద ఉన్నారన్నట్టుగా మాట్లాడటం కొత్త కాదు. గతంలో జనసేనకు రాజీనామా చేసిన వారికి జగన్మాత ఆశీస్సులు ఉండాలని వ్యంగ్యంగా పవన్ స్పందించారు! అలాగని వాళ్లేమీ జగన్ వద్దకు చేరిపోలేదు పవన్ వద్ద ఖాళీ చేసి. వాళ్లు తమ పనులు చూసుకుంటున్నారు, జనసేన నుంచి బయటకు వచ్చిన తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ వైపు వెళ్లారు, లక్ష్మినారాయణ ఏ పార్టీకీ సంబంధం లేకుండా ఒక రాజకీయ విశ్లేషకుడు అయిపోయారు పాపం!
మరి ఇప్పుడు కేతంరెడ్డి వినోద్ రెడ్డిపై కూడా జనసేన వైపు నుంచి విమర్శలు తప్పడం లేదు! ఎలాగూ రెడ్డి కాబట్టి.. మరింతగా విరుచుకుపడొచ్చు! తను ఒక ఎన్నికలో జనసేన కోసం పని చేయడం, పవన్ కల్యాణ్ నుంచి రాజకీయ మార్పును ఆశించడం వంటివన్నీ పాపాలే! ఆత్మవిమర్శ అనేది పవన్ డిక్షనరీలో లేదు! తనను తానొక దైవాంశ సంభూతుడుగా ఫీలయ్యే మానసిక స్థితి నుంచి అలాంటిది ఎక్స్ పెక్ట్ చేయడం కూడా తప్పేమో!