జనసేన పార్టీ పెట్టిన లక్ష్యం వేరు. సాగుతున్న దిశ వేరు.
జనసేన పార్టీ ఆశయం వేరు.. ఇప్పుడు ఆశ పడుతున్నది వేరు.
జనసేన పార్టీ ఆశయాలు.. లక్ష్యాలు కొండంత ఎత్తున కనిపించాయి. తొలినాడు సభలు పెట్టి పవన్ ఊగిపోతూ మాట్లాడితే జనం అబ్బుర పడ్డారు. ఉపన్యాసం ఒక్క ముక్క అర్ధం కాకపోయినా, ఏదో ఆవేశం, ఆశయం వున్న నాయకుడిలా కనిపించారు. ప్రశ్నించడానికి పుట్టింది పార్టీ అని చెప్పి ఆరంభలోనే చంద్రబాబును మోయడం మొదలుపెట్టినా జనం పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పుడు పరిస్థితులు అలాంటివి. రాష్ట్రం రెండు ముక్కలయింది. ఆ షాక్ లోనే వున్నారు జనాలు. అందువల్ల పవన్ స్కీము, స్కాము వంటివి పెద్దగా అర్థం చేసుకునే పరిస్థితి లేదు. అంతా ఓటేసారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైంది.
తరువాత పవన్ రకరకాల విన్యాసాలు చేసారు. భాజపాకు ఎదురు తిరిగారు. చంద్రబాబు-లోకేష్ ల అవినీతిని తూర్పారపట్టారు. అప్పుడు కూడా జనం పవన్ ను నమ్మారు. ఎందుకంటే మిత్రుడు తప్పు చేసినపుడు ఎత్తి చూపేవాడే నిజమైన మిత్రుడు కదా అనుకున్నారు. పార్టీ నిర్మాణం లేకుండా ఒంటరిగా పోటీ చేసి భంగపడ్డారు. దాంతో పవన్ మొత్తం మారిపోయారు. ఆశయాలు గాలికి వదిలేసారు. లక్ష్యం మార్చుకున్నారు.
ఇప్పుడు లక్ష్యం ఒక్కటే జగన్ ను గద్దె దించడం.
ఇప్పుడు ఆశయం ఒక్కటే చంద్రబాబు ను మరోసారి సిఎమ్ ను చేయడం.
ఈ క్రమంలో ఆయన తన పార్టీ పద్దతులకు కూడా తిలోదకాలు ఇచ్చేసారు. పార్టీలోకి వలసవాదులను తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఏ కమిటీలు లేకుండా పార్టీని నమ్ముకుని వున్న అభిమానులు, కాపు నాయకులను పక్కన పడేసారు. ఎవరెవర్నో తీసుకువస్తున్నారు. కండువాలు కప్పుతున్నారు. టికెట్ లు ఇచ్చేలా వ్యవహారం కనిపిస్తోంది. ఇది చూసి ఇప్పటి వరకు పార్టీని నమ్ముకుని, తమకు ఏదో ఒక టైమ్ వస్తుందని అనుకున్న వారంతా మౌనం వహిస్తున్నారు.
ఇప్పుడు జనసేనలో ఓ స్థాయి జనాలకు క్లారిటీ వస్తోంది. పవన్ పార్టీ విభిన్నమైనది కాదు. అది కూడా ఫక్తు ఓ రాజకీయ పార్టీ అని అర్థమైంది. పవన్ లక్ష్యం తనను నమ్ముకున్న నాయకులకు కాదు అవకాశం ఇచ్చేది. తనను నమ్ముకున్న చంద్రబాబు చెప్పిన వారికి మాత్రమే అని ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది.కానీ ఇప్పుడేం మాట్లాడడానికి లేదు. ఇంకా ఫుల్ క్లారిటీ రావడానికి మరి కొద్ది రోజుల పడుతుంది. పార్టీ పోటీ చేసే స్థానాల సంఖ్య, వాటిలో పోటీ చేసే వారి పేర్లు ఖరారు అయితే అప్పుడు కళ్లు పూర్తిగా తెరచుకుంటాయి.
అన్ని పార్టీల మాదిరిగానే జనసేనలో కూడా వలస వాదులకే అవకాశాలు దక్కుతాయని, డబ్బున్న వారికే సీట్లు, టికెట్ లు లభిస్తాయని, ఇదంతా పెద్ద స్కెచ్, ప్లాన్ అని తెలుస్తోంది. అప్పుడు గట్టి గొంతులు ఏమైనా వుంటే వినిపించడం మొదలవుతుంది. పార్టీ ఆరంభంలో వున్న వారు చాలా మంది పవన్ ను ఎందుకు వీడి వెళ్లిపోయారో ఇంకా బాగా అర్థం అవుతుంది.
టైమ్ రావాలి అంతే.