
సామాజిక ఎజెండా లేని ప్రాంతీయ పార్టీలు బతకలేవు. ఈ విషయం పవన్‌కి అర్థం కాక, చేతిలో పుస్తకాలు పట్టుకుని తిరుగుతున్నాడు. ప్రాంతీయ పార్టీలు ఎపుడూ ఒక భావావేశం, రాజకీయ శూన్యత నుంచి పుట్టాలి. అపుడే మనుగడ. భావావేశమంటే వ్యక్తిగతం కాదు, సామాజికం. పవన్ ఎమోషన్‌తో పుట్టిన జనసేన పదేళ్ల కాలంలో కూడా లేచి నిలబడలేక తప్పటడుగులు వేయడానికి కారణం నిర్మాణ లోపం. ఇది పవన్‌కి తెలియదు. చెబితే అర్థం కాదు.
తెలుగుదేశం పార్టీ పుట్టినపుడు కాంగ్రెస్ సింగిల్ పార్టీ. తరచూ ముఖ్యమంత్రులు మారేవాళ్లు. అంజయ్యని రాజీవ్‌గాంధీ అవమానించడం తెలుగువారి ఆత్మ గౌరవానికి దెబ్బ తగిలింది. రాజకీయ శూన్యత, భావావేశం కలిసి ఎన్టీఆర్‌ని గెలిపించాయి. ఎన్టీఆర్ వల్లే ఆ పార్టీ బతకలేదు. బతకడానికి అనువైన పరిస్థితులు చుట్టూ వున్నాయి. కాంగ్రెస్‌కి ప్రత్యామ్నాయం కోసం జనం వెతుకుతున్న పరిస్థితుల్లో తెలుగుదేశం ఆశా కిరణంగా మారింది. ఆ పార్టీ ఎన్టీఆర్ వ్యక్తిగతంగా మారేసరికి 89లో జనం ఓడించారు.
ప్రజారాజ్యం విషయంలో జరిగింది వేరు. రాజకీయ శూన్యత లేదు. టీడీపీ, కాంగ్రెస్ బలంగా వున్నాయి. మూడో పార్టీకి స్పేస్ చాలా తక్కువ వుంది. దీన్ని చిరంజీవి అంచనా వేయలేకపోయారు. అయితే ఆయన పవన్‌లా గాలి వాటం కాదు. సీరియస్‌గా పార్టీని నడిపారు. సహనంతో మొండిగా ముందుకెళ్లి వుంటే ప్రజారాజ్యం ఈ రోజు గట్టి పార్టీగా నిలిచేది. చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యేవారు.
సామాజిక న్యాయం అనే సిద్ధాంతాన్ని పార్టీ ప్రాతిపదికగా చిరంజీవి తీసుకున్నా, అది ఎవరికీ అర్థం కాలేదు. అది పుస్తకాల్లోని పదమే తప్ప, ప్రజల్లో నలిగిన పదం కాదు. పైగా సామాజిక న్యాయాన్ని నమ్మాలంటే అంతకు ముందు చిరంజీవికి సామాజిక ఉద్యమాల నేపథ్యం వుండాలి. ఎపుడూ ఏమీ మాట్లాడకుండా హఠాత్తుగా పెద్దపెద్ద పదాలు వాడితే జనం నమ్మరు.
పెరియార్ రామస్వామి తమిళనాడులో ద్రావిడ సిద్ధాంతాన్ని సామాజిక న్యాయాన్ని ప్రబోధిస్తే జనం ఎందుకు నమ్మారంటే ఆయన ఎప్పుడూ జనంలోనే వున్నారు. పెరియార్‌తో విడిపోయి అన్నాదురై డీఎంకే పార్టీ పెట్టి, దాన్ని బతికించాడు. కారణం ఏమంటే నెహ్రూని ఎదుర్కొన్నాడు, హిందీ వ్యతిరేక ఉద్యమం నడిపాడు. మద్రాస్ స్టేట్‌ని తమిళనాడు చేసాడు. ఇవన్నీ జనానికి నచ్చాయి. డీఎంకే నుంచి విడిపోయి అన్నాడీఎంకే పెట్టిన ఎంజీఆర్‌ని ఎందుకు ఆదరించారంటే జనంలో ఆయనంటే నమ్మకం వుంది.
సామాజిక ఎజెండా లేని పార్టీలు బతకవనడానికి ఉదాహరణ. లక్ష్మీపార్వతి పార్టీ, హరికృష్ణ, కర్నాటకలో బంగారప్ప , తమిళనాడులో కమల్‌హాసన్ పార్టీలు. పెద్ద హీరోగా పేరున్న కమల్‌హాసన్‌ని కూడా జనం ఎందుకు నమ్మలేదంటే ఆ పార్టీ సిద్ధాంతం ఏమిటో కమల్‌కి కూడా తెలియకపోవడమే.
జగన్ పార్టీ బతకడానికి కారణం
1.రాజకీయ శూన్యత, 2.వైఎస్సార్ వారసత్వం
రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పనై పోయింది. ఆ స్థానంలో జనం వైసీపీని ఆదరించారు. వైఎస్ పథకాలపై నమ్మకం ఓట్లు వేయించింది. అయితే ఇది కూడా నేల విడిచి జగన్ వ్యక్తిగత పార్టీగా మారితే ముప్పే.
చరిత్ర ఏమీ తెలుసుకోకుండా పవన్ పార్టీ పెట్టి కేవలం సినిమా డైలాగ్‌లతో, కులం కార్డుతో గెలవాలని అనుకుంటున్నారు. ఇది కష్టం. ఎందుకంటే గెలిస్తే పవన్ ఏం చేస్తాడో చెప్పకుండా ముఖ్యమంత్రి పదవి పంపకం గురించి మాట్లాడుతున్నాడు. జగన్‌ని తిడితే గెలుస్తానని అనుకోవడంతోనే ఆయన అమాయకత్వం అర్థమవుతోంది.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా