ఇవ్వాళ రేపు ఎవరు సోషల్ మీడియాలో బలంగా వుంటే వాళ్లవే రోజులు. అది సినిమా హీరో అయినా, పొలిటికల్ పార్టీ అయినా. గత కొన్నాళ్లుగా జనసేన సోషల్ మీడియా విభాగం దూకుడుగా వ్యవహరిస్తోంది. అంతే కాదు విభిన్నంగా ఆలోచిస్తోంది.
సోషల్ మీడియాలో రెండు మూడు రకాల ట్రెండ్ లు వున్నాయి. ఒకటి ట్రోల్ చేయడం. అదే కీలకంగా వుంటుంది సోషల్ మీడియాలో ఈ విషయంలో వైకాపా ముందు అంజెలోనే వుంది. ఊ..మీద పడిపోవడం అనొచ్చు దీన్ని. కానీ ఈ టైపు వల్ల పెద్దగా ఉపయోగం లేదు. వైరి పక్షం మీద విరుచుకుపడిపోవడం, తిట్లు, ఘాటు విమర్శలతో. ఇలా చేయడం వల్ల స్వపక్షం వాళ్లు మాత్రమే కాస్త ఆనందిస్తారు. మన వాళ్లు గట్టిగా ఇస్తున్నారు లే అని సంబర పడతారు.
కానీ అలా కాకుండా ఆలోచింప చేసేలా ఓ స్ట్రాటజీ తీసుకుని, ఆ స్ట్రాటజీ ఆధారంగా కంటెంట్ తయారు చేసుకుని, దాన్ని తమపై వస్తున్న ట్రోలింగ్ లేదా విమర్శలకు వాడడం అనే కొత్త పద్దతిని మొదలు పెట్టింది జనసేన. ఇక్కడ జనసేన కు అడ్వాంటేజ్ ఏమింటంటే వైకాపా కు జనసేన మీద ఇలా చేయడానికి వేరే పాయింట్లు లేవు. ఎందుకంటే జనసేన ఇప్పటి వరకు పాలక పక్షంగా లేదు. అందువల్ల వైఫల్యాలు లేదా ఎత్తి చూడడం అనే అవకాశం వైకాపా కు లేదు.
కానీ వైకాపా పవర్ లో వుంది. నాలుగేళ్లుగా ఏం చేసారు అనే ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాల్సి వుంది. జనసేన సోషల్ మీడియా ఇప్పుడు జగన్ మీద కన్నా అతని మంత్రులు, అనుచరగణం మీద ఎక్కువ దృష్టి పెట్టింది. ఎవరు యాక్టివ్ గా వుంటే వారిని విమర్శలతో టార్గెట్ చేస్తోంది. ఉదాహరణకు మంత్రి రోజా… అసలు మంత్రిగా ఏం సాధించారు.. ఏం చేసారు.. చెప్పండి అంటూ నిలదీస్తోంది. ఈ రోజు గృహనిర్మాణ శాఖ మంత్రి పవన్ ను గట్టిగా టార్గెట్ చేసారు. దీనికి ఇదే స్ట్రాటజీ అవలంబించారు. ఆ శాఖ మంత్రిగా ఇప్పటి వరకు ఏం చేసారు.. గృహ నిర్మాణాల మీద కాగ్ రిపోర్ట్ ఏమిటి ఇలా.
ఇలా చేయడం వల్ల కేవలం విరుచుకుపడడం, రొడ్డ కొట్టుడు విమర్శలు చేయడం అనే రొటీన్ వ్యవహారం కాదు. ప్రశ్నలు, పాయింట్ లతో టార్గెట్ చేయడం. అదే సమయంలో గ్రౌండ్ లెవెల్ లో సమావేశాలు నిర్వహించి వాటిని సోషల్ మీడియాలోకి తెస్తున్నారు. కానీ వైకాపా సోషల్ మీడియా వింగ్ ఇలాంటి గ్రౌండ్ లెవెల్ వీడియోలు, జనాల అభిప్రాయాలు సేకరించే పనే పెట్టుకోవడం లేదు. ఎంత సేపూ తిట్టడం..తిట్టడం..తిట్టడం. ఇది జనాలకు చికాకు తెప్పిస్తుంది. జనసేన ఈ తరహా వ్యవహారం పదిశాతానికి పరిమితం చేసి, మిగిలిన 90శాతం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమ్ కు ఇస్తోంది.
కంటెంట్ ఎక్కడి నుంచి వస్తోంది. జనసేనకు అంత బలమైన కంటెంట్ వింగ్ వుందా? లేక తెలుగుదేశం పార్టీ కి మొదటి నుంచి వున్న బలమైన రీసెర్చ్ వింగ్ సహకరిస్తోందా అన్న అనుమానం వుంటే వుండొచ్చు. కానీ దాని వల్ల జరగాల్సిన కార్యం జరుగుతోంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే తేదేపా సోషల్ మీడియా వింగ్ కూడా ఈ విషయంలో వెనుకబడే వుంది.
గత ఎన్నికల టైమ్ లో డేటా సేకరణ మీద వైకాపా నేతలు అంతా తేదేపాను విమర్శించారు. ఇప్పుడు ఆ వీడియోలను తీసుకుని, ఇప్పుడు చేసినట్లు కలర్ ఇస్తూ జనసేన సోషల్ మీడియా వింగ్ ప్రచారం ప్రారంభించింది. ఇది కచ్చితంగా బుల్స్ ఐ ను కొట్టడమే. తూచ్ ఇప్పుడు మేం అనలేదు వైకాపా నాయకులు అనొచ్చు. కానీ అప్పుడు అలాగే అన్నారు కదా.. అని నిలదీయచ్చు. డేటా సమస్య ఈ విధంగా మరింత బలంగా జనాల్లోకి తీసుకుపోతున్నారు.
పవన్ మీద, అతని పార్టీ మీద ఎక్కు పెట్టడానికి వైకాపాకు పెళ్లిళ్ల కన్నా కీలకమైనది 2014 నుంచి 2019 వరకు పవన్ పాటించిన మౌనం. అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించని వైనం. దీని మీద వైకాపా సోషల్ మీడియా వింగ్ దృష్టి పెట్టడం లేదు. అంతే కాదు 2019 ఎన్నికల ముందు, ఎన్నికల టైమ్ లో పవన్ చేసిన ప్రసంగాలను బయటకు అంతగా తీయడమే లేదు.
ఇలా తీయడం ద్వారా జనసేన మాదిరిగా పటిష్టమైన, పదునైన ఎదురు దాడి చేసే అవకాశం వుంది. కానీ దానిని వాడుకోవడమే లేదు. ప్రతి చోటా స్కూళ్లు, ఆసుపత్రులు, రోడ్లు మారాయి. నిన్న.. నేడు అనేలా వాటిని జనాల దృష్టికి తీసుకెళ్లడం కూడా తక్కువగానే వుంది.
మొత్తం మీద ఇప్పటికి మాత్రం సోషల్ మీడియా ప్రచారం లేదా ఎదురుదాడిలో జనసేన శతృఘ్ని టీమ్ ముందు వుందనడంలో సందేహపడాల్సింది లేదు.