కొంతమంది రాజకీయ నాయకులు చిత్ర విచిత్రమైన కామెంట్స్ చేస్తుంటారు. కొందరు తమకు తెలియకుండానే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే, కొందరు కావాలనే వివాదాలు సృష్టించడం కోసమే కొన్ని కామెంట్స్ చేస్తుంటారు.
కానీ రాజకీయ నాయకుడిగా మారిన సినిమా హీరో పవన్ కళ్యాణ్ మాత్రం ఈ రెండు కేటగిరీల కిందికి రాడు. ఆయన చేస్తున్న కామెంట్స్ ఆయన్ని జోకర్ మాదిరిగా పరిగణించేలా చేస్తున్నాయి. ఆయన కామెంట్స్ వింటుంటే ఈ పవర్ స్టార్ కు ఏమైంది ? అనే ప్రశ్న వేసుకోవలసి వస్తోంది. ఆయన తెలిసి మాట్లాడుతున్నాడో, తెలియక మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు.
ఈయన రాజకీయ నాయకుడా? అమాయకుడా? అనిపిస్తోంది. ఆయన ప్రస్తుతం చేస్తున్న వారాహి యాత్రలో ఏదేదో మాట్లాడేస్తున్నాడు. ఒకసారి తనను సీఎం చేయాలంటారు. మరోసారి తాను ఓడిపోతానని తనకు తెలుసని అంటాడు. ఇలా మాట్లాడి జనసైనికులను గందరగోళంలో పడేస్తున్నాడు.
వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యల పరంపర కొనసాగుతోంది. ఈసారి జనసైనికులకే షాకిచ్చే వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసే క్రిమినల్ గ్యాంగ్‌తో గొడవ పెట్టుకున్నానంటూ బాంబు పేల్చారు. వారాహి యాత్ర సక్సెస్ అవుతోందనే ఆనందం కంటే నాయకుడి వ్యాఖ్యలు, ఆలోచన అర్ధం కాక జనసైనికులు ఆందోళన చెందుతున్నారు.
వారాహి యాత్రంతా కుల, మతాల ప్రస్తావనతోనే సాగిస్తున్న పవన్ కళ్యాణ్ కోనసీమ యాత్రలో మరో షాక్ ఇచ్చారు. ఈసారి ఏకంగా గెలుపోటముల గురించి ప్రస్తావించారు. అది కూడా జనసేనకు అడ్డాగా భావిస్తున్న కోనసీమలో జనసైనికులు నిరాశకు లోనయ్యే వ్యాఖ్యానాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసే వైసీపీ ప్రభుత్వానికి ముఖ్యంగా క్రిమినల్ గ్యాంగ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ఈసారి గెలవడం ఖాయమని, ఒకవేళ ఓడినా బాధపడనంటూ ముక్తాయింపు ఇచ్చారు. ఎన్నికల్లో ఓడినా పట్టించుకోనన్నారు పవన్ కళ్యాణ్. రాజకీయాలనేవి తనకు రిటైర్మెంట్ ప్లాన్ కాదన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. వెఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన 70/30 శాతంగా ఉందన్నారు. అంటే 100 మంది కష్టాన్ని 30 శాతం మందికే ఇస్తున్నారని గుర్తు చేశారు.
బటన్ నొక్కగానే డబ్బులు వచ్చేస్తున్నాయనుకుంటున్న ప్రజలు ఎలా వస్తున్నాయో గమనించాలన్నారు. వందమంది కష్టాన్ని కేవలం 30-40 మందికే ఇస్తున్నారంటూ సంక్షేమ పథకాల్ని విమర్శించారు. రాజకీయాలు చేయడానికి గుండె ధైర్యముంటే చాలన్నారు.
తాను మళ్లీ ఓడిపోతానని నిర్ణయించుకునే ఈ ప్రభుత్వంతో గొడవకు దిగానన్నారు పవన్ కళ్యాణ్. 14 సంవత్సరాలుగా తాను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలిచానని, అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డానని ఆయన చెప్పారు. అయినప్పటికీ.. ధైర్యంగా నిల్చోవడానికి కారణం- కోనసీమ ప్రాంత ప్రజలేనని పేర్కొన్నారు. వారికి ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపం ఉంటుందంటూ చెప్పుకొచ్చారు.
సినిమాలు, రాజకీయాలను వేర్వేరుగా చూడాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్ర క్షేమం కోసం అందరి హీరోల అభిమానులు తనకు, జనసేనకు అండగా నిలవాలంటూ పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. సినిమాల వరకు ఎవరికి నచ్చిన హీరోలను వారు అభిమానించాలని.. రాజకీయాలకు వచ్చేసరికి సమష్ట నిర్ణయాలను తీసుకోవాలని సూచించారు.
పంట నష్టపోయిన రైతులను పరమర్శించడానికి తాను వస్తే ప్రభుత్వం భయపడి దిగొచ్చిందని, ఆ వెంటనే ధాన్యం కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇస్తే తడాఖా చూపిస్తానని అన్నారు. ఇప్పుడేమి అర్ధమైంది పవన్ కళ్యాణ్ గురించి.