జూనియర్ ఎన్టీయార్ ఆ పార్టీకి… రామ్ చరణ్ ఈ పార్టీకి…?

ఆ ఇద్దరు ఈ మధ్య కలసి నటించిన మల్టీస్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియా లెవెల్ లో ఊపేసింది. రెండు పెద్ద టాలీవుడ్ కుటుంబాల నుంచి వచ్చిన ఈ హీరోలు కలసి నటించడం…

ఆ ఇద్దరు ఈ మధ్య కలసి నటించిన మల్టీస్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియా లెవెల్ లో ఊపేసింది. రెండు పెద్ద టాలీవుడ్ కుటుంబాల నుంచి వచ్చిన ఈ హీరోలు కలసి నటించడం అద్భుతమనే అంతా అనుకున్నారు. రాజమౌళి దాన్ని నిజం చేసి చూపించారు. ట్రిపుల్ ఆర్ క్రెడిట్ ఎవరికి ఎవ్వాలీ అంటే ఏ హీరో ఫ్యాన్స్ ఆ హీరోకే ఇస్తోంది.

బీజేపీ వారికేమో ట్రిపుల్ ఆర్ లో జూనియర్ ఎన్టీయార్ చేసిన నటన బాగా నచ్చిందట. అందుకే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన తెలంగాణా టూర్ లో జూనియర్ ని ప్రత్యేకంగా రప్పించుకుని ఆయనతో కలసి డిన్నర్ చేశారు. జూనియర్ ట్రిపుల్ ఆర్ నటన గురించే అమిత్ షా మాట్లాడారు అని బీజేపీ వారు ఎంత చెప్పినా ఇందులో రాజకీయ విషయాలు ప్రస్థావనకు రాకుండా ఉండవనే  అంతా అనుకున్నారు.

దానిని నిజమనినిపించేలా ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు తాము జూనియర్ ఎన్టీయార్ సేవలను పార్టీ కోసం వాడుకుంటామని ఒక స్టేట్మెంట్ ఇచ్చి పడేశారు. మరి జనసేన ఊరుకుంటుందా అందుకే ఆ పార్టీ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ మాకు కూడా ట్రిపుల్ ఆర్ హీరో ఉన్నారని అసలు గుట్టు చెప్పేశారు.

వచ్చే ఎన్నికల్లో రామ్ చరణ్ జనసేన తరఫున ప్రచారం చేస్తారని ఒక చానల్ డిబేట్ లో బోలిశెట్టి చేసిన కామెంట్స్ ఇపుడు రాజకీయంగా చర్చకు వస్తున్నాయి. అంటే బాబాయి పార్టీకి అబ్బాయి ప్రచారం చేస్తారన్న మాట. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒక్కరే ప్రచారం చేశారు. ఇపుడు రామ్ చరణ్ జనసేనకు ప్రచారం చేసి పెడితే మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఒక్కటిగా గాజు గ్లాస్ వైపుకు వస్తారని అంటున్నారు.

బీజేపీ వారి సినీ ప్రేమలు ఏంటో తెలియదు కానీ వచ్చే ఎన్నికల్లో టాలీవుడ్ టాప్ హీరోలను ఇలా ఎవరికి వారు పంచేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. బీజేపీ, జనసేన ఇలా హీరోలను దించితే ప్రధాన పార్టీలు అయిన వైసీపీ, టీడీపీ చూస్తూ ఊరుకుంటాయా. అంటే టాలీవుడ్ కి ఈసారి రాజకీయాలు తప్పవనే అనుకోవాలి.

ఇంతకీ బొలిశెట్టి వారు అంటున్నదేంటి అంటే వచ్చే ఎన్నికల్లో ఏపీలో జనసేన అధికారంలోకి వస్తుందని. అంటే బీజేపీతో కూటమి కట్టమని చెబుతున్నారా లేక బీజేపీ లేని అధికారం కావాలనుకుంటున్నారా అన్నది మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. ఇదీ ఇద్దరి మిత్రుల పొత్తుల కధ, రెండు పార్టీల హీరోల‌ కధ కూడా.