తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతున్న జనసేనకు రాయలసీమలో దక్కే సీట్ల విషయంలో ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తుంది. మరి వస్తున్న ఆ క్లారిటీ ప్రకారం.. సీమలో జనసేనకు దక్కేది అతి పరిమితమైన స్థాయి పోటీ అవకాశమే అని స్పష్టం అవుతోంది. ఇప్పటి వరకూ తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పోటీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రాష్ట్రం మొత్తం మీదా జనసేనకు దక్కింది 21 అంటే 21 సీట్లలో పోటీకి అవకాశం! సహజంగా జనసేన ఆసక్తి ఉభయగోదావరి జిల్లాల మీదే ఉంది. ఇలాంటి నేపథ్యంలో.. దక్కింది కూడా అతి పరిమితమైన పోటీ అవకాశం కాబట్టి.. రాయలసీమ పట్ల జనసేనకు ఎలాంటి ఆసక్తి లేకపోవచ్చు. తిరుపతిలో బలిజల జనాభా ఎక్కువ కాబట్టి.. ఆ సీటును జనసేన ఎలాగో దక్కించుకుంది. శ్రీకాళహస్తి విషయంలో నిరాసే ఎదురైంది! ఇక కడప జిల్లాలో ఒక సీటు అనే ప్రచారం జరిగింది కానీ, దానిపై జనసేనే అనాసక్తి చూపినా పెద్ద ఆశ్చర్యం లేదు!
కర్నూలు మీద జనసేన ఉత్సాహం ఏమీ లేదు. మిగిలింది అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి జనసేన తరఫున అభ్యర్థిత్వంపై ఒక వ్యక్తి ఉత్సాహంతో ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన బలిజ నేత ఒకరు ఇప్పుడు జనసేన తరఫున పోటీకి ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఆ అవకాశం దక్కుతుందా? అనేది ప్రశ్నార్థకమే!
ఒకవేళ పవన్ కల్యాణ్ అనంతపురం నుంచి పోటీ చేస్తే తను త్యాగానికి సిద్ధం అని తెలుగుదేశం స్థానిక నేత ప్రభాకర్ చౌదరి చాన్నాళ్ల కిందటే ప్రకటించారు. అయితే అలాగని జనసేన తరఫున వేరే ఎవరు పోటీ చేసినా చౌదరి నుంచి ఎలాంటి సహకారం ఉండదు. కేవలం సహకారం ఇవ్వకపోవడమే కాదు.. అనంతపురం పోటీ అవకాశం జనసేనకు దక్కితే.. చౌదరి కచ్చితంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉంది. ఆ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తను పోటీచేసే అవకాశం ఉంటే ఓకే, లేదంటే.. ఇండిపెండెంట్ గా పోటీ చేసి టీడీపీ అభ్యర్థినైనా ఓడించడం చౌదరి ప్రత్యేకత!
గతంలో మహాలక్ష్మి శ్రీనివాస్ అని ఒక బలిజ నేతకే టీడీపీ టికెట్ దక్కితే, అప్పుడు చౌదరి ఆయన ఓటమి కోసం అవిశ్రాంతంగా పని చేశారు. ఇప్పుడు జనసేన తరఫున బలిజకు అవకాశం దక్కినా చౌదరి వారి ఓటమికే పని చేస్తారు. మరి అనంతపురం నుంచి టీడీపీ తరఫున చౌదరి బరిలోకి దిగితే మాత్రం.. జనసేన వీరాభిమాన బలిజలంతా ఆ కమ్మ వ్యక్తి గెలుపుకోసం పని చేయాలి! అదీ పొత్తు ధర్మం!
ఒక దశలో ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ అవకాశాన్ని కూడా జనసేనకు కేటాయిస్తారంటూ జనసేన వాళ్లు ప్రచారం చేసుకున్నారు. ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నేత చిలకం మధుసూదన రెడ్డి ధర్మవరంలో దాదాపు ఏడెనిమిదేళ్ల నుంచి పని చేస్తున్నారు. అయితే ఇప్పుడు ధర్మవరం బీజేపీ తరఫున చంద్రబాబు అనుకూల మనిషి వరదాపురం సూరి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడా జనసేనకు అలా ఝలక్ తగిలింది!
స్థూలంగా మొత్తం రాయలసీమ మీద ఏదో ఒకటీ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకు మించి ఎక్కడైనా జనసేనకు అవకాశం దక్కినా టీడీపీ వాళ్లు దగ్గరుండి ఓడగొట్టడానికి శతథా ప్రయత్నిస్తారు కూడా! బహుశా తెలుగుదేశం తరఫున ప్రచారానికి రాయలసీమలో పవన్ కల్యాణ్ తిరగాలి తప్ప, జనసేన కోసం ఆయన చేసేదేమీ లేదు కూడా! గత ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు, బీఎస్పీతో పొత్తుతో రాయలసీమలో జనసేన దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేయగలిగింది. మారుమూల పల్లెల్లో కూడా బూత్ కు ఐదారు ఓట్లు అయినా పొందింది!
ఇప్పుడు ఆ ఐదారు మంది వీరాభిమానులు నిట్టూరుస్తున్నారు! తమ వీరాభిమాన పార్టీకి ఓటేద్దామంటే ఎమ్మెల్యే సీటుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఎంపీ టికెట్ కు బీజేపీ అభ్యర్థి కనిపిస్తున్నారంటూ వారు వాపోతున్నారు! మరి జనసేనకు ఒకటీ రెండు సీట్లను ఎరగా వేసి.. రాయలసీమలో మొత్తం బలిజల ఓట్లను గంపగుత్తగా పొందాలనే ప్రయత్నంలో చంద్రబాబు ఏ మేరకు విజయవంతం అవుతారో ఎన్నికల ఫలితాలతో క్లారిటీ రానుంది!