క‌ర్ణాట‌క సీఎం పీఠం విలువ రూ.2500 కోట్లా!

ప్ర‌జ‌లు మెజారిటీని ఇవ్వ‌క‌పోయినా కర్ణాట‌క‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన భార‌తీయ జ‌న‌తా పార్టీ అందుకోసం 2,500 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఖ‌ర్చు పెట్టింద‌ని అంటున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.  Advertisement క‌ర్ణాట‌క ఎన్నిక‌ల…

ప్ర‌జ‌లు మెజారిటీని ఇవ్వ‌క‌పోయినా కర్ణాట‌క‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన భార‌తీయ జ‌న‌తా పార్టీ అందుకోసం 2,500 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఖ‌ర్చు పెట్టింద‌ని అంటున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. 

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న రాహుల్ రూ.2500 కోట్లు వెచ్చించి బీజేపీ ముఖ్య‌మంత్రి ప‌ద‌విని పొందింద‌ని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు, ప్ర‌భుత్వానికి నిల‌బెట్టుకునేందుకు చేసిన ఖ‌ర్చు ఇదంతా అని రాహుల్ అన్నారు. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత మొత్తం 40 మంది ఎమ్మెల్యేల‌ను భార‌తీయ జ‌న‌తా పార్టీ కొనుగోలు చేసింద‌ని, ఈ సారి ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు బీజేపీని 40 సీట్ల‌కు ప‌రిమితం చేసి బుద్ధి చెప్పాలంటూ రాహుల్ పిలుపునిచ్చారు.

ఇలా వాడీవేడీగా క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చార ప‌ర్వం కొనసాగుతూ ఉంది. మ‌రోవైపు రోడ్ షోలు నిర్వ‌హిస్తున్న కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా త‌మ పార్టీకి గ‌త ఎన్నిక‌ల క‌న్నా ఎక్కువ సీట్లు వ‌స్తాయ‌నే ధీమాను వ్య‌క్తం చేశారు. గెలుపే ల‌క్ష్యంగా అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించిన‌ట్టుగా, అందులో మ‌రే స‌మీక‌ర‌ణాలు లేవ‌ని అమిత్ షా అంటున్నారు. 

బీజేపీ అభ్య‌ర్థుల జాబితా విడుద‌ల త‌ర్వాత ఆ పార్టీలో పెద్ద క‌ల‌క‌ల‌మే రేగిన సంగ‌తి తెలిసిందే. ఇలాంటి నేప‌థ్యంలో పాత‌వారిని ప‌క్క‌న పెట్టి, కొత్త‌వారికి అవ‌కాశం ఇవ్వ‌డాన్ని అమిత్ షా విజ‌యంతో ముడిపెట్టి స‌మ‌ర్థించుకుంటున్నారు.

ఇక బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన మాజీ సీఎం జ‌గ‌దీష్ షెట్ట‌ర్ కూడా ఓడిపోతారంటూ అమిత్ షా జోస్యం చెప్పుకొచ్చారు. షెట్ట‌ర్ పోటీ చేసిన నియోజ‌క‌వ‌ర్గం ఎప్పుడూ బీజేపీకి కంచుకోట అని, అక్క‌డ షెట్టర్ విజ‌యం సాధించ‌డం ఆయ‌న ఘ‌న‌త కాద‌ని, కేవ‌లం బీజేపీ ఘ‌న‌త అన్న‌ట్టుగా అమిత్ షా వ్యాఖ్యానించారు.

మ‌రోవైపు ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిత్వంపై సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై స్పందిస్తూ.. అధిష్టానం ఎవ‌రు నిర్ణ‌యిస్తే వారే ముఖ్య‌మంత్రి అవుతార‌ని చెప్పుకొచ్చారు. త‌న ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిత్వాన్ని బొమ్మై స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. బీజేపీకి మెజారిటీ ద‌క్కితే అధిష్టానం ఆశీస్సులు ఉన్న వారికే సీఎం పీఠం ద‌క్కుతుంద‌ని బొమ్మై చెప్పారు.