ఇప్పటి వరకు కేసీఆర్/కేటీఆర్ కు వైఎస్ జగన్ కు నడుమ ఎటువంటి పొరపచ్చాలు లేవు. వస్తాయని అనుకోవడానికి కూడా లేదు. గత ఎన్నికల నుంచి మంచి సయోధ్య నడుస్తోంది. కానీ వున్నట్లుండి కేటీఆర్ కొన్ని మాటల తూటాలు విసిరారు. నిజానికి ఆయన ఏ సందర్భంలో అలా మాట్లాడాల్సి వచ్చింది అన్నది కూడా ఇక్కడ చూడాలి. ఏ రాష్ట్రంలో వుండే ప్లస్ లు ఆ రాష్ట్రంలో వుంటాయి. అలాగే మైనస్ లూ వుంటాయి. కానీ రాష్ట్రాలు..రాష్ట్రాలు ఏనాడూ విమర్శించుకున్న దాఖలాలు లేవు.
విధానాలు, సిద్దాంతాల మీద పోరాటం తప్ప, ఏ సిఎమ్ మరో సిఎమ్ ను విమర్శించడం అన్నది చాలా అరుదు. కేంద్రానికి-రాష్ట్రానికి మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు వుంటాయి తప్ప, రాష్ట్రానికి రాష్ట్రానికి కాదు. కర్ణాటక-తమిళనాడు మధ్య నీటి తగాయిదాలు వచ్చినా, ఆంధ్ర-తెలంగాణ మధ్య ప్రాజెక్టుల వివాదాలు వచ్చినా సిఎమ్ లు కానీ, కీలక బాధ్యతల్లో వున్నవారు కానీ పెద్దగా మాట్లాడరు. కేడర్ మాట్లాడుతుంది అది వేరే సంగతి.
గత మూడేళ్లలో జగన్ ఎప్పుడూ కేసీఆర్ పాలన మీద కానీ, వ్యవహారాల మీద కానీ, సిద్దాంతాల మీద కానీ కామెంట్లు చేసిన దాఖలా లేనే లేదు. ‘మన పథకాలు అక్కడా అమలు చేస్తున్నారు’ అని కూడా కనీసం ఓ మాట అనలేదు. జగన్ బాధలు జగన్ పడుతున్నారు. అంతే తప్ప పక్క రాష్ట్రాల విషయంలో అస్సలు కలుగచేసుకోవడం అన్నది లేదు. జనసేన, తెలుగుదేశం పార్టీలు నామ్ కే వాస్తే అయినా తెలంగాణలో రాజకీయం ముగించకుండానే వున్నాయి. కానీ వైకాపా అస్సలు ఆ దృషినే పెట్టలేదు. చంద్రబాబు ఇప్పటికీ తెలంగాణ అభివృద్ది అంతా తనదే అంటూ టముకు వేస్తూనే వస్తున్నారు.
మరి ఏ విధంగా జగన్ ను టార్గెట్ చేయాల్సి వచ్చింది? ఎందుకు వచ్చింది? ఏ విధంగా వచ్చినా, ఎందుకు వచ్చినా ఇది అంత మంచిది అయితే కాదు. ఎందుకంటే జగన్ సామాజిక వర్గం చెప్పుకోదగ్గ సంఖ్యలోనే వుంది తెలంగాణలో. తెరాస వచ్చిన తరువాత ఆ వర్గం అధికారానికి దూరం అయింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఆ వర్గానికి అవకాశం దక్కేది. లేదంటే లేదు. ఒక పక్క రేవంత్ రెడ్డి దూకుడుగా వెళ్తున్నారు. అంత మాత్రం చేత తెరాస కార్నర్ అయిపోయింది. ఇక అంతే సంగతులు లాంటి స్టేట్ మెంట్లు ఇవ్వడం అవివేకం. అవగాహన రాహిత్యం.
కానీ రేవంత్ రెడ్డి,వైఎస్ జగన్ ల సామాజిక వర్గాన్ని కూడా తమ వైపు వుంచుకోవడం కేసీఆర్/కేటీఆర్ లకు అవసరం. అలా చేయడం వల్ల మరో నాలుగు ఓట్లు పెరుగుతాయి కానీ తగ్గవు. ఎవరో ఏదో చెప్పారని, పక్క రాష్ట్రం పోలిక తేవడం అనవసరం కూడా. ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్న అభివృద్ది ఎంతయినా వుంది. దాన్ని ఎవరూ కాదనలేదు. అలా అంటే కదా? ఇలాంటి పోలిక తేవడానికి. ఆ అభివృద్దిని చెప్పుకుంటే చాలు.
సాధారణంగా కేటీఆర్ చాలా కంట్రోల్డ్ గా మాట్లాడతారు. ఆవేశపడినా లాజిక్ లు, గీతలు దాటరు. అలాంటిది ఇది తొలిసారి. ఆయన ఆలోచించుకుంటే బహుశా ఇదే ఆఖరు కూడా కావచ్చేమో?