ముందస్తు ఎన్నికలు వస్తాయనే భావనతోనే తెలుగుదేశం పార్టీ సన్నాహాలు చేస్తోంది. 2023 నవంబర్ వేళకు ఆంధ్రలో ఎన్నికల తథ్యం అని తెలుగుదేశం వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. కానీ అస్సలు ముందస్తు ప్రసక్తే లేదని వైకాపా వర్గాలు చెబుతున్నాయి. కానీ తెలుగుదేశం హడావుడి మాత్రం ముందస్తు దిశగానే వుంది. చంద్రబాబు ఇప్పటికే తన వయో భారాన్ని కూడా పక్కన పెట్టి తిరిగేస్తున్నారు. లోకేష్ తన ఏడాది పొడవు యాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఎన్నికలు కచ్చితంగా ముందుగా వస్తాయనే జోష్ ను కార్యక్తరలకు, నాయకులకు కలిగించడానికి కావచ్చు. లేదా ఎన్నికలు ఊడిపడితే సిద్దంగా వుండడానికి కావచ్చు.
కానీ జనసేన పార్టీ మాత్రం ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు లేదు. దీనికి కారణాలు రెండు కావచ్చు. ఒకటి అందాల్సిన వారి దగ్గర నుంచి రూట్ మ్యాప్ రాకపోయి వుండొచ్చు. లేదా ముందస్తు ఎన్నికలు రావు అని పవన్ కు పక్కాగా నమ్మకం వుండి వుండోచ్చు. బాబు మాదిరిగా ముందస్తు అనే భ్రమను కల్పించి జోష్ పెంచాల్సిన నాయకులు, కార్యకర్తలు పవన్ కు ఎలాగూ లేరు కదా?
జగన్ ఏదో కార్యక్రమం పేరిట తిరుగుతున్నారు. బాబు..లోకేష్ అదే పనిలో వున్నారు. పవన్ కు కూడా వాహనం రెడీగా వుంది. కానీ ప్లాన్ మాత్రం అస్సలు ఇప్పటి వరకు లేదనే అనుకోవాలి. శని..ఆదివారాలు తప్ప జనసేన పొలిటికల్ యాక్టివిటీ లేదు. మరోపక్కన సినిమాల షెడ్యూళ్లు మాత్రం ఫిక్స్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
జనవరి నుంచి సినిమాలు
జనవరి రెండు లేదా మూడో వారం నుంచి కొత్త సినిమా ప్రారంభించడానికి పవన్ రెడీ అవుతున్నారు. మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఓ రీమేక్ స్టార్ట్ చేస్తున్నారు. క్రిష్ తో కలిసి చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాతో సమాంతరంగా ఈ సినిమాను చేస్తారని సినిమా వర్గాల నుంచి వినిపిస్తోంది.
దీని తరువాత సుజిత్ దర్శకత్వంలోని సినిమా పూర్తి చేస్తారట. ఆ తరువాత అక్టోబర్ నుంచి హరీష్ శంకర్ సినిమా వుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే పవన్ సినిమా డైరీ 2023 అంతా ఫుల్ అన్నమాటే. బహుశా లోకేష్ పర్యటన తరువాతే పవన్ పర్యటన వుంటుందేమో? అంటే పెర్ ఫెక్ట్ గా ఎన్నికల షెడ్యూలు కనుచూపు మేరలోకి వచ్చాకే ‘వారాహి’ రోడ్ మీదకు వస్తుందన్న మాట.