వారి క‌ళ్ల‌లో ఆనందం కోసం.. నాదెండ్ల స‌క్సెస్‌!

త‌న సామాజిక వ‌ర్గం క‌ళ్ల‌ల్లో ఆనందం కోసం జ‌న‌సేన నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహ‌ర్ కృషి ఫ‌లించింది. అలాగే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి త‌న సామాజిక దృష్టిలో విల‌న్‌గా మారిన త‌న తండ్రి భాస్క‌ర్‌రావు చేసిన…

త‌న సామాజిక వ‌ర్గం క‌ళ్ల‌ల్లో ఆనందం కోసం జ‌న‌సేన నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహ‌ర్ కృషి ఫ‌లించింది. అలాగే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి త‌న సామాజిక దృష్టిలో విల‌న్‌గా మారిన త‌న తండ్రి భాస్క‌ర్‌రావు చేసిన త‌ప్పిదానికి ప్రాయ‌శ్చితంగా మ‌నోహ‌ర్ టీడీపీకి మేలు క‌లిగించేలా చ‌క్రం తిప్పారు. ఇవ‌న్నీ జ‌న‌సేన‌లో నంబ‌ర్‌-2 స్థానంలో వుండ‌డం వ‌ల్లే నాదెండ్ల చేయ‌గ‌లిగారు.

చంద్ర‌బాబు మ‌నుషులు బీజేపీలోనే కాదు, జ‌న‌సేన‌లో కూడా ఉన్నారు. భ‌విష్య‌త్‌లో మ‌రింత మంది వుంటారు. టీడీపీ, జ‌న‌సేన పొత్తులో ఉన్న‌ప్ప‌టికీ, రాజ‌కీయంగా మ‌రో పార్టీ ఎద‌గ‌కూడ‌ద‌నేది చంద్ర‌బాబు ఆశ‌యం. బాబు అసైన్‌మెంట్స్‌ను చిత్త‌శుద్ధితో నెర‌వేర్చేందుకు నాదెండ్ల మ‌నోహ‌ర్ సిద్ధంగా ఉన్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. టీడీపీ-జ‌న‌సేన మ‌ధ్య పొత్తు వెనుక అస‌లు సూత్ర‌ధారి, పాత్ర‌ధారి నాదెండ్ల మ‌నోహ‌రే. టీడీపీ బ‌ల‌హీన‌ప‌డడాన్ని రాజ‌కీయంగా సొమ్ము చేసుకోవాల‌ని ప‌వ‌న్‌పై బీజేపీతో పాటు సొంత పార్టీ నుంచి ఒత్తిడి వ‌చ్చింది. 

అయితే నాదెండ్ల మ‌నోహ‌ర్ ఏం చేశారో తెలియ‌దు కానీ, ఆయ‌న గీత గీస్తే దాటేందుకు ప‌వ‌న్ సిద్ధంగా లేర‌ని జ‌న‌సేన నాయ‌కులు వాపోతున్నారు. చివ‌రికి నాదెండ్ల మ‌నోహ‌ర్ త‌న తండ్రి భాస్క‌ర్‌రావు చేసిన త‌ప్పిదాన్ని మ‌రిచిపోయేలా, టీడీపీకి రాజ‌కీయ ప్ర‌యోజ‌నం క‌లిగించేందుకే వ్యూహాత్మ‌కంగా పావులు క‌దిపార‌ని జ‌న‌సేన నేత‌ల అభిప్రాయం.

ఈ క్ర‌మంలో క‌మ్మోళ్ల క‌ళ్ల‌ల్లో ఆనందం కోసం కాపులైన త‌మ‌ను బ‌లిపెట్టార‌ని జ‌న‌సేనకు చెందిన ముఖ్య  నాయ‌కులు వాపోవ‌డం గ‌మ‌నార్హం. నాదెండ్ల మ‌నోహ‌ర్ ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే టీడీపీ కొమ్ము కాసేలా ప‌వ‌న్‌ను ఒప్పించార‌ని నాదెండ్ల మ‌నోహ‌ర్‌పై రుస‌రుస‌లాడుతున్నారు. జ‌న‌సేన‌లో ఏళ్ల త‌ర‌బ‌డి ప‌ని చేస్తున్న నాయ‌కులు ఎలాంటి ప‌ద‌వులు నోచుకోలేద‌ని, ఇదే ప‌క్క పార్టీల నుంచి వ‌చ్చే క‌మ్మ నాయ‌కుల‌ను మాత్రం నెత్తిన పెట్టుకుంటున్నార‌ని ఆరోపిస్తున్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు ఒంగోలు మాజీ జెడ్పీ చైర్మ‌న్, మాజీ ఎమ్మెల్యే ఈద‌ర హ‌రిబాబు జ‌న‌సేన‌లో చేరారు. ఆయ‌న‌కు జ‌న‌సేన క్రియాశీల‌క స‌భ్యుల శిక్ష‌ణ కేంద్ర విభాగం చైర్మ‌న్‌గా నియ‌మించారు. పార్టీలో ఎప్ప‌టి నుంచో ఉన్న కాపు నాయ‌కుల‌ను మాత్రం అస‌లు ప‌ట్టించుకోలేద‌ని, ఇదే నాదెండ్ల మ‌నోహ‌ర్ త‌న సామాజిక వ‌ర్గం నుంచి వ‌చ్చిన వారికి మాత్రం పెద్ద‌పీట వేస్తున్నార‌ని జ‌న‌సేన నాయ‌కులు చెబుతున్నారు. 

అలాగే అన్న‌మ‌య్య జిల్లాకు చెందిన జ‌న‌సేన బ‌హిష్కృత నేత ఆకుల న‌ర‌స‌య్య కూడా నాదెండ్ల త‌న కులం నాయ‌కుల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం గురించి చెప్పారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి వ‌చ్చిన కుసుమకుమారి కేవ‌లం త‌న సామాజిక వ‌ర్గం కావ‌డంతోనే నాదెండ్ల మ‌నోహ‌ర్ ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించార‌ని ఆరోపించారు. ఇలా నాదెండ్ల త‌న సామాజిక వ‌ర్గం వారిని ఒక వ్యూహం ప్ర‌కారం తీసుకొచ్చి, టికెట్లు ఇప్పించి చంద్ర‌బాబు కోసం ప‌ని చేయ‌డానికి రెడీ చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు కాపు నేత‌ల నుంచి వ‌స్తున్నాయి. 

ఎవ‌రు ఒప్పుకున్నా, ఒప్పుకోక‌పోయినా జ‌న‌సేన‌లో నాదెండ్ల మ‌నోహ‌ర్ టీడీపీ కోవ‌ర్టుగా ప‌ని చేస్తున్నార‌నేందుకు ఆ పార్టీతో పొత్తే నిద‌ర్శ‌న‌మ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. పొత్తు కుదుర్చుకునే వ‌ర‌కూ నాదెండ్ల మ‌నోహ‌ర్ త‌న బాధ్య‌త‌ల్ని విజ‌య‌వంతంగా నిర్వ‌ర్తించార‌ని జ‌న‌సేన నేత‌లు వ్యంగ్యంగా అంటున్నారు. భ‌విష్య‌త్‌లో టీడీపీ నేత‌ల్ని తీసుకొచ్చి జ‌న‌సేన త‌ర‌పున టికెట్లు ఇప్పించి, బాబు కొమ్ము కాయడానికి రెడీ చేసే టాస్క్‌ను కూడా స‌క్సెస్ చేస్తార‌ని ఆయ‌న‌పై సొంత పార్టీ నేత‌లు మండిప‌డుతున్నారు.