నంద్యాల..మునుగోడు

అన్ని ఎన్నికలు ఉప ఎన్నికలు కాలేవు. అన్ని చోట్లా ఇంతలా జనాలను మోహరించలేరు. అందువల్ల ఉపఎన్నిక గెలుపు ఓటముల వైనాలను ఒకే గాట కట్టలేము. గతంలో ఓసారి జరిగిన నంద్యాల ఉపఎన్నిక గుర్తు వచ్చింది…

అన్ని ఎన్నికలు ఉప ఎన్నికలు కాలేవు. అన్ని చోట్లా ఇంతలా జనాలను మోహరించలేరు. అందువల్ల ఉపఎన్నిక గెలుపు ఓటముల వైనాలను ఒకే గాట కట్టలేము. గతంలో ఓసారి జరిగిన నంద్యాల ఉపఎన్నిక గుర్తు వచ్చింది మునుగోడు ఉప ఎన్నిక తీరు చూస్తుంటే.

అప్పట్లో చంద్రబాబు తన మంత్రి వర్గంలోని మంత్రులు అందరినీ నంద్యాలలో మోహరించారు. అది కూడా కులాల వారీగా తీసుకువచ్చారు. ఏ కులం ఓటర్లను ఆ కులం మంత్రులతో బుజ్జగించారు. చిన్న చిన్న ఏరియాలుగా విభజించి ఒక్కో ఎమ్మెల్యేకు అప్పగించారు. ఇక డబ్బుల సంగతి అయితే చెప్పనక్కరలేదు.

ఇప్పుడు మునుగోడు కూడా అంతే. మొత్తం తెలంగాణ మంత్రులు అంతా అక్కడే వుండిపోయారు. గట్టిగా వెయ్యి ఓట్లు కూడా లేని గ్రామాలు కూడా ఒక్కో మంత్రి కి అప్పగించారు. ఒక్కో మంత్రి పర్యవేక్షించిన చోట వచ్చిన మెజారిటీ రెండు వందలు నుంచి అయిదు వందల ఓట్లు. అంటే ఓ మంత్రి కొన్ని రోజుల పాటు కూర్చుని సాధించిన మెజారిటీ. ఇక ఎమ్మెల్యేలు అయితే చెప్పనక్కరలేదు. నాయకుల సంగతి సరేసరి.

ఇక మందు…డబ్బులు వేరే సంగతి. ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే మునుగోడులో ఖర్చు చేసినట్లు రేపు జనరల్ ఎలక్షన్ లో చేయడం అసాధ్యం. ప్రతి మంత్రి పోటీలో వుంటారు. ప్రతి నాయకుడు పోటీలో వుంటారు. తన నియోజకవర్గం తాను చూసుకోవాలి. ఒక్కో నియోజకవర్గంలో అంత మందిని మోహరించడం అన్నది అసాధ్యం. ఇక డబ్బులు అంటారా? అది మరీనూ. ఒక్క నియోజకవర్గం కాబట్టి వందల కోట్లు కుమ్మరించారన్నది వార్తల సారాశం. పైగా అక్కడ కీలక బాధ్యులు అంతా వున్నారు కనుక డబ్బులు పక్కదారి పట్టలేదు.

జనరల్ ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గానికి ఇన్నేసి కోట్లు పంపలేరు. పంపినా అవి ఓటర్లకు చేరవు. అందువల్ల ఈ గెలుపు చూసి కేసీఆర్ ధీమా పడిపోకూడదు. మరో ఏడాదిలో రాబోయే ఎన్నికలకు ఇలాంటి సన్నాహాలు కాక, వేరే విధమైన వ్యూహాలు వాడాల్సి వుంది. కేవలం డబ్బు..మంది తో మాత్రం పని జరగదు. మునుగోడు ఓటింగ్ సరళి ఆ పాఠాన్ని కూడా చెప్పనే చెప్పింది.