న‌ర్రెడ్డి సునీత రాజ‌కీయాల్లోకి వ‌స్తే..?

ఆమెను ప‌చ్చ‌మీడియా ఒక‌సారేమో న‌ర్రెడ్డి సునీత అంటోంది, మ‌రోసారి వైఎస్ సునీత అంటోంది. త‌మ అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టుగా ఆమె ఇంటి పేరును ప‌చ్చ‌మీడియా అండ్ కో వాడుకుంటూ ఉంది. మ‌రి ఆమె రాజ‌కీయాల్లోకి అంటూ…

ఆమెను ప‌చ్చ‌మీడియా ఒక‌సారేమో న‌ర్రెడ్డి సునీత అంటోంది, మ‌రోసారి వైఎస్ సునీత అంటోంది. త‌మ అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టుగా ఆమె ఇంటి పేరును ప‌చ్చ‌మీడియా అండ్ కో వాడుకుంటూ ఉంది. మ‌రి ఆమె రాజ‌కీయాల్లోకి అంటూ వ‌స్తే ఆమె వైఎస్ సునీత గానే ప్ర‌చారంలో నిలవొచ్చు. ప్ర‌త్యేకించి ఎలాంటి ఎపిసోడ్లో అయినా ఇలాంటి క్యారక్ట‌ర్ ల‌ను వాడుకోవ‌డంలో చంద్ర‌బాబుకు మించిన మోతుబ‌రి మ‌రొక‌రు లేరు. 

కొన్ని ర‌కాల పాత్ర‌ల‌ను రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశ పెట్టి ప్ర‌యోజ‌నం పొందే పాట్లేవో చంద్ర‌బాబు పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి వ్యూహాలు అన్ని సార్లూ వ‌ర్క‌వుట్ కావు. చుండ్రు సుహాసిని ఉదంతం చంద్రబాబుకు ఇచ్చే సందేశం ఇదే. నంద‌మూరి సుహాసిని అలియ‌స్ చుండ్రు సుహాసినిని తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయించి.. జూనియ‌ర్ ఎన్టీఆర్ చ‌చ్చిన‌ట్టు త‌మ‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాల్సిందే అనే ప‌రిస్థితుల‌ను చంద్ర‌బాబు క్రియేట్ చేశారు. అయితే అంత‌లా వ‌ల ప‌న్నినా దాన్నుంచి జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎలాగోలా త‌ప్పించుకున్నాడు.

ఇలాంటి కాలం చెల్లిన వ్యూహాల‌ను మ‌రోసారి న‌మ్ముకుంటే బ‌హుశా వైఎస్ సునీత‌ను చంద్ర‌బాబు నాయుడు క‌డ‌ప ఎన్నిక‌ల బ‌రిలోకి దించినా దించ‌వ‌చ్చు. ఎలాగూ క‌డ‌ప ఎంపీగానో, పులివెందుల ఎమ్మెల్యేగానో ఎవ‌రిని దించినా చంద్ర‌బాబు నాయుడుకు ద‌క్కేదేమీ లేదు. ఎవ‌రిని పోటీ చేయించినా ఈరెండు సీట్ల‌లో టీడీపీ బావుకునేది ఏమీ ఉండ‌దు. అలాంట‌ప్పుడు వైఎస్ సునీత గ‌నుక చంద్ర‌బాబుకు చేదికందిన పావుగా ఎన్నిక‌ల బ‌రిలో నిలిస్తే.. జ‌గ‌న్ పై వైఎస్ వివేకానంద‌రెడ్డిని హ‌త్య చేయించాడ‌నే ప్ర‌చారాన్ని ఎన్నిక‌ల సంగ్రామం జ‌రిగిన‌న్ని రోజులూ చేయించ‌డానికి చంద్ర‌బాబుకు అవ‌కాశం ద‌క్కిన‌ట్టే. 

ఇప్ప‌టికే వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌ను త‌ప్ప తెలుగుదేశం పార్టీ మ‌రో అస్త్రాన్నేదీ క‌లిగి ఉన్న‌ట్టుగా లేదు. ఇలాంటి నేప‌థ్యంలో వైఎస్ సునీత గ‌నుక తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున పోటీకి సై అంటే తెలుగుదేశానికి అంత‌క‌న్నా కావాల్సింది ఏమీ లేన‌ట్టే!

ఆమె గెలుపు కాదు టీడీపీకి కావాల్సింది. ఆమె పోటీ చేయ‌డం. ఆమె పోటీ చేసి ఆ త‌ర్వాత ఏమైపోయినా టీడీపీకి ఏమీ కాదు. నంద‌మూరి హ‌రికృష్ణ కూతురు చుండ్రు సుహాసినిని ఇప్పుడు ఏ మాత్రం ప‌ట్టించుకుంటున్నారు? అలాంటిది వైఎస్ వివేకానంద‌రెడ్డి కూతురు ఏ మూల‌కు! కాబ‌ట్టి.. ఇప్పుడు సునీత నుంచి గ్రీన్ సిగ్న‌ల్ అందితే టీడీపీచాల‌నుకోవ‌చ్చు.

మరి సునీత‌కు పొలిటిక‌ల్ ఇంట్రెస్ట్ ఉందా? అంటే.. లేద‌నుకోవ‌డం భ్ర‌మే! ఎందుకంటే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కాద‌ని వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు మొహ‌మాటం ఏదీ లేకుండా వైఎస్ వివేకానంద‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫునే నిలిచారు. త‌నే స్వ‌యంగా ఎన్నిక‌ల్లో నిల‌బ‌డ్డారు! అది ప‌దవీ కాంక్ష కాకుండా పోతుందా? అది ఉండ‌టంలో పెద్ద త‌ప్పు కూడా లేదు. అయితే ఎటొచ్చీ వివేకానంద‌రెడ్డిని అయినా, సునీత‌ను అయినా రాజ‌కీయ కాంక్ష‌లు లేని వాళ్లుగా చూప‌డ‌మే వింత‌గా నిలుస్తుంది.

అందులోనూ వైఎస్ వివేకానంద‌రెడ్డి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా బ‌రిలోకి దిగిన‌ప్పుడు.. ఆయ‌న త‌ర‌ఫున యాక్టివ్ గా ప‌ని చేసింది ఆయ‌న బావ‌మ‌రుదులే! అలాంటి బావ‌మ‌రుదుల్లో ఒక‌డైన చిన్న‌వాడు.. న‌ర్రెడ్డి రాజ‌శేఖ‌ర రెడ్డి ఆయ‌న‌కు అల్లుడు కూడా. అత‌డే సునీత భ‌ర్త‌. అప్ప‌ట్లో వివేకానంద‌రెడ్డి త‌ర‌ఫున రాజ‌కీయ ప్ర‌చారాన్ని సాగించింది న‌ర్రెడ్డి రాజ‌శేఖ‌ర రెడ్డి, న‌ర్రెడ్డి సునీత‌లే. టీవీ చాన‌ళ్ల‌లో న‌ర్రెడ్డి రాజ‌శేఖ‌ర రెడ్డి విరిగిన చేతికి క‌ట్టుక‌ట్టించుకుని మ‌రీ వాదించేశారు. అలా తొలి సారి వారు జ‌నాల‌కు ప‌రిచ‌యం అయ్యిందే ఎన్నిక‌ల ప్రచారంలో. 

వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి ఉన్న‌ప్పుడు వాళ్లేమీ వివేకానంద‌రెడ్డిని గెలిపించేందుకు అలా టీవీ మీడియాకు, జ‌నం వ‌ద్ద‌కు వెళ్ల‌లేదు. వైఎస్ జ‌గ‌న్ ను కాద‌ని.. వివేకానంద‌రెడ్డి ని రాజ‌కీయాన్ని కొన‌సాగించేందుకు వారు పోరాడారు. అది కూడా వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డిని అవినీతిప‌రుడిగా సీబీఐ చార్జిషీట్ల‌లో పెట్టించిన వారి త‌ర‌ఫున‌, వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డిపై విరుచుకుప‌డే వారి త‌ర‌ఫునే నిల‌బ‌డి వారు పోరాడారు. ఇలాంటి నేప‌థ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగ‌డం సునీత‌కు, ఆమె భ‌ర్త న‌ర్రెడ్డి రాజ‌శేఖ‌ర రెడ్డికి క‌ష్టం కాక‌పోవ‌చ్చు. 

అంతే కాదు… అప్ప‌ట్లో వైఎస్ వివేకానంద‌రెడ్డిని కాంగ్రెస్ త‌ర‌ఫున నిలిపింది వీళ్లేన‌ని, ఆ త‌ర్వాత ఆ పార్టీ అడ్ర‌స్ గ‌ల్లంత‌య్యాకా ఆయ‌న‌ను జ‌గ‌న్ పంచ‌న చేర్చ‌డానికి ఆరాట ప‌డింది కూడా వీళ్లేన‌నే అభిప్రాయాలున్నాయి. వివేక‌ది ఆల్మోస్ట్ రిటైర్మెంట్ అయిపోయిన వ‌య‌సు. పులివెందుల్లో ఎమ్మెల్యేగా ఓడ‌టంతోనే ఆయ‌న రాజ‌కీయం ముగిసింది. ఆయ‌న‌కు కూడా అది తెలుసు. అయిన‌ప్ప‌టికీ ఇంకా ఏదో ప్ర‌యోజ‌నం కోసం ఆయ‌న‌ను మళ్లీ జ‌గ‌న్ వ‌ద్ద చేర్చింది కూడా ఆయ‌న కుటుంబీకులే! అదంతా బ‌హిరంగ స‌త్య‌మే.

ఇంత‌కీ న‌ర్రెడ్డి సునీత వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే.. ప్ర‌జాద‌ర‌ణ సంగ‌తేమో కానీ, టీడీపీకి, ప‌చ్చ‌మీడియాకూ చేతి నిండా ప‌ని. వీలైతే ఆమె చేత రాష్ట్ర‌మంతా తిప్పి ఎన్నిక‌ల ప్ర‌చారం చేయించ‌డానికి కూడా టీడీపీ వ్యూహాల‌ను ఇప్ప‌టికే సిద్ధం చేసి ఉండ‌వ‌చ్చు కూడా!