కొన్ని గంటల వ్యవధిలో దేశంలో రెండు ప్రధాన పక్షాలు తమ మిత్రపక్షాలతో బలప్రదర్శనకు దిగాయి! కేంద్రంలో పాలక వర్గం అయిన ఎన్డీయే ఢిల్లీలో తన మిత్రపక్షాలతో కలిసి కాంక్లేవ్ నిర్వహిస్తూ ఉంది. ఇక ఇటీవలే అధికారం దక్కిన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో సమావేశానికి రంగం సిద్ధం చేసుకుంది. లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు గట్టిగా ఇంకో పది నెలల సమయం ఉన్న నేపథ్యంలో.. ఈ సమావేశాలు ఆసక్తిని రేపుతూ ఉన్నాయి.
ముందుగా బీజేపీ నాయకత్వంలో జరుగుతున్న సమావేశంలో చోటాచోటా పార్టీలన్నీ పాల్గొంటున్నాయి. ఎన్డీయేలో బీజేపీనే పెద్దన్నా! ఆఖరికి తన మిత్రపక్ష పార్టీలను కూడా ఈ మధ్యకాలంలో చీల్చి చెండాడిన పేరును బీజేపీ తెచ్చుకుంది. అయితే గిల్లి జోల పాడినట్టుగా వాటినే మళ్లీ ఊరడిస్తోంది. పాశ్వాన్ తనయుడి నాయకత్వంలోని ఎల్జేపీ ఆ మధ్య చీలింది. అందులో పశుపతా పారాస్ వర్గానికి బీజేపీ మద్దతు పలికింది. దీంతో పాశ్వాన్ తనయుడు ఇన్నాళ్లూ అలిగాడు. అయితే ఇప్పుడు అతడు కూడా మళ్లీ ఎన్డీయేలో చేరాడట!
ఇక శివసేన చీలిక పక్షం ఇప్పుడు ఎన్డీయేలో పెద్ద పార్టీల్లో ఒకటి! అలాగే ఎన్సీపీ చీలిక పక్షం కూడా ఇటే అనుకోవాలి. ఇక అన్నాడీఎంకే కూడా బీజేపీ మిత్రపక్షం!వీటిని మినహాయిస్తే అన్నీ ఒకటీ అర శాతం ఓట్లున్న పార్టీలే. ఇక ఇప్పటి వరకూ ఎన్నికల పోరాటంలో పెద్ద ప్రభావం చూపని జనసేన కూడా ఈ కూటమిలో భాగమైంది!
ఇక బెంగళూరు సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఈ సారి యూపీఏకు పేరు మార్చే పని పెట్టుకుందట. 2004లో యూపీఏ ను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. 2009లో యూపీఏ 2 ఏర్పడింది. అధికారం అందకపోయినా ఇన్నాళ్లూ ఆ పేరే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు యూనైటెడ్ ప్రోగ్రసివ్ అలయన్స్ పేరును మార్చనున్నారట!
ఇక ఈ సమావేశంలో కాంగ్రెస్ పెద్దన్న. దాని తర్వాత పెద్ద పార్టీ డీఎంకే, ఆ తర్వాత టీఎంసీ, జేడీయూ ఇటీవలి యాడ్ ఆన్. ఇక శివసేన ఠాక్రే వర్గం, సమాజ్ వాదీ పార్టీ, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, సీపీఎం, సీపీఐ, ఆప్, జేఎంఎం, ఆర్జేడీ, జేఎంఎం వంటి పార్టీలు ఈ సమావేశంలో పాల్గొంటున్నాయి!