ఇలా పవన్ అన్నారు అని అంటే ఎక్కడ అన్నాడ్రా అంటూ విరుచుకుపడిపోతారు పవర్ ఫ్యాన్స్. నిజమే ఆయన అనలేదు. అలా అస్సలు అనలేదు. కానీ.. పవన్ ప్రసంగాన్ని విశ్లేషించి చూడండి.
పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు. తెలుగుదేశం పార్టీకి అనుభవం వుంది. జనసేనకు పోరాట పటిమ వుంది. జనసేనకు అనుభవం లేదు అని చెప్పక్కరలేదు. ఎందుకంటే కొత్త పార్టీ కనుక. మరి పోరాట పటిమ తెలుగుదేశం పార్టీకి లేదా? అందుకోసమే జనసేన తన పోరాట పటిమను తెలుగుదేశం పార్టీకి అరువిస్తోందా? సరే.. ఏదో ఒకటి.. ఆ సంగతి అలా వుంచండి.
గతంలో జనసేన-తేదేపా బంధం అయిదేళ్లు వుండి తెగిపోయిందని, ఈసారి ఆ సమస్యే లేదు.. పదేళ్ల వరకు అలాగే వుంటుంది అని హామీ ఇస్తున్నారు. గట్టిగా చెబుతున్నారు.
అదే సమయంలో మరో స్పీచ్‌లో, ఆంధ్రలో పరిస్థితులు చక్కదిద్దడానికి పదేళ్లు పడుతుందని, అందువల్ల వరుసగా రెండు సార్లు జనసేన-తెలుగుదేశం కూటమికి చాన్స్ ఇవ్వాల్సిందే అని చెబుతున్నారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఈ పదేళ్ల కాలానికి అంటే.. ఏం చెబుతారు. తరువాత డిసైడ్ చేద్దాం ఫలితాలను బట్టి అంటారు. అనుభవం, పోరాట పటిమ కలిసి పోటీ చేస్తే జగన్ ను పాతాళానికి తొక్కేయచ్చు అన్నారు కదా. అందువల్ల గెలుపు అనుమానం లేదు. గెలిస్తే తేదేపా ఎన్ని సీట్లలో గెలుస్తుంది.. జనసేన ఎన్ని సీట్లో.. ఎలా లెక్కలు వేసుకున్నా, ఎటు నుంచి ఎటు కూడి, తీసినా తెలుగుదేశందే పైచేయిగా వుంటుంది. పైగా అనుభవం గల పార్టీ కాబట్టి సిఎమ్ పోస్ట్ దానికే ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీకి సిఎమ్ పోస్ట్ లేదు అంటే…
ఆ మరుక్షణం తెలుస్తుంది. తెలుగుదేశం అనుకుల సామాజిక మీడియా ఏ రేంజ్ లో విజృంభించి విరుచుకుపడుతుందో పవన్ కు. జనసైనికులకు. చంద్రబాబు, ఆయన తరువాత లోకేష్, లేదంటే బ్రాహ్మిణి అంటున్నారు. అంటారు.. అంటూనే వుంటారు.
మరి పవన్ పదేళ్లు తాను పక్కాగా తెలుగుదేశంతోనే వుంటాను.. ప్రామిస్ అని అంటున్నపుడు.. సిఎమ్ ఎలా అవుతారు? తెలుగుదేశం పార్టీకి ముఫై నలభై సీట్లు వచ్చి, జనసేనకు కూడా ముఫై నలభై వస్తే కూడా కాలేరు. ఎందుకంటే అప్పుడు కూడా తేదేపా అనుకుల మీడియా మామూలుగా ఆడుకోదు. జనసేన నుంచి గెలిచిన వారు ఎంత మంది మిగులుతారో కూడా అనుమానం.
అందువల్ల పవన్ సిఎమ్ అవుతారు అన్నది ఆయన మాటల ప్రకారమే అనుమానం తప్ప మరోటి కాదు.