ఊహూ.. భువ‌నేశ్వ‌రి వ‌ల్ల కావ‌డం లేదు!

చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి అవ‌స్థ‌ను చూస్తే ఎవ‌రికైనా జాలేస్తుంది. బాబు అరెస్ట్‌తో ఆమె రోడ్డుపైకి రావాల్సి వ‌చ్చింది. బాబు అరెస్ట్‌తో తీవ్ర మ‌న‌స్తాపానికి గురై ప్రాణాలొదిలిన కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించి, ఓదార్చ‌డానికి ఆమె బ‌య‌ల్దేరారు.…

చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి అవ‌స్థ‌ను చూస్తే ఎవ‌రికైనా జాలేస్తుంది. బాబు అరెస్ట్‌తో ఆమె రోడ్డుపైకి రావాల్సి వ‌చ్చింది. బాబు అరెస్ట్‌తో తీవ్ర మ‌న‌స్తాపానికి గురై ప్రాణాలొదిలిన కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించి, ఓదార్చ‌డానికి ఆమె బ‌య‌ల్దేరారు. నిజం గెల‌వాలంటూ బ‌స్సు యాత్ర చేప‌ట్టారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో టీడీపీని ముందుకు న‌డిపించే బాధ్య‌త ఆమెపై ప‌డింది. ఎన్న‌డూ రాజ‌కీయ కార్య‌క‌లాపాల్లో పాల్గొన‌ని భువ‌నేశ్వ‌రి, భ‌ర్త అరెస్ట్‌తో రోడ్డెక్కారు.

అయితే టీడీపీ, ఎల్లో మీడియా కోరుకుంటున్న‌ట్టుగా ఆమె ప్ర‌సంగం సాగ‌డం లేదు. జ‌నం ముందుకెళ్లి క‌న్నీళ్లు పెడితే, ఎన్నిక‌ల్లో ఓట్లు రాలుతాయ‌ని టీడీపీ ఆశ‌. భువ‌నేశ్వ‌రి ఒక బొట్టు క‌న్నీరు కారిస్తే, క‌ళ్ల‌లో సునామీ లాంటిది చోటు చేసుకుంద‌ని, క‌న్నీళ్లు ఏరులై పారాయని ఎల్లో మీడియా క‌విత్వం వండ‌డానికి సిద్ధంగా వుంది. ఊహూ.. ఆ ప‌ని మాత్రం భువ‌నేశ్వ‌రి వ‌ల్ల కావ‌డం లేదు. 

స‌భా ప్రాంగ‌ణానికి భువ‌నేశ్వ‌రి చేరుకోగానే, ఉద్వేగ వాతావ‌ర‌ణం నెల‌కుందని ఎల్లో మీడియా క‌థ‌నాలు మొద‌లెట్టింది. ఇక ఆమె ప్ర‌సంగం స్టార్ట్ చేయగానే తీవ్ర భావోద్వేగంతో మాట్లాడుతున్న‌ట్టు ప్ర‌సారం చేసినా, అక్క‌డంత సీన్ లేద‌న్న‌ది వాస్త‌వం. భువ‌నేశ్వ‌రి ప్ర‌సంగంలో భావోద్వేగం మ‌చ్చుకైనా క‌నిపించ‌లేదు. ఆమె నుంచి భావోద్వేగ ప్ర‌సంగం రాలేద‌ని ఎల్లో మీడియా కన్నీటి ప‌ర్యంతం కావ‌డం మాత్రం క‌నిపించింది. 

త‌న భ‌ర్త అరెస్ట్‌ను జీర్ణించుకోలేక మృతి చెందిన కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి భువ‌నేశ్వ‌రి వెళ్లారు. అలాంట‌ప్పుడు బాధిత కుటుంబాల ఆవేద‌న విన‌డానికి ప్రాధాన్యం ఇవ్వాలి. భువ‌నేశ్వ‌రి యాత్ర‌లో అలా క‌నిపించ‌డం లేదు. భువ‌నేశ్వ‌రి మైకు తీసుకోవ‌డంతోనే త‌న భ‌ర్త చంద్ర‌బాబు గురించి గొప్ప‌లు చెప్పుకోడానికే స‌రిపోయింది. బాబు గురించి త‌న కంటే ప్ర‌జ‌ల‌కే బాగా తెలుస‌ని ఆమె అన్నారు. అలాంట‌ప్పుడు బాబు గొప్ప గురించి ఎంత త‌క్కువ చెబితే అంత మంచిది.

2014లో విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అద్భుతంగా తీర్చిదిద్ద‌డానికి చంద్ర‌బాబు రాత్రింబ‌వ‌ళ్లు శ్ర‌మించార‌ని ఆమె చెప్పారు. కేవ‌లం 3, 4 గంట‌లు మాత్ర‌మే నిద్ర‌పోయేవార‌ని, మీకేమైనా పిచ్చి ప‌ట్టిందా? అని తాను మంద‌లించేదాన్న‌ని భువ‌నేశ్వ‌రి చెప్పుకొచ్చారు. భువ‌నేశ్వ‌రి చెప్పిన‌ట్టు అంత గొప్ప‌గా చంద్ర‌బాబు పాలించి వుంటే….మ‌రెందుకు 2019లో ప్ర‌జ‌లు ఘోరంగా ఓడించారో ఆమె స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా? బాబు మంచిత‌నం, పాల‌నాద‌క్ష‌త గురించి ఇత‌రులెవ‌రైనా చెబితే బాగుంటుంది. అలా కాకుండా కుటుంబ స‌భ్యులు వ‌చ్చి , బాబు హైటెక్ సిటీ నిర్మించార‌ని, లోకాన్ని సృష్టించార‌ని ఏవేవో చెబితే న‌మ్మ‌డానికి జ‌నం సిద్ధంగా లేరు. 

చంద్ర‌బాబు అరెస్ట్ నేప‌థ్యంలో త‌న పార్టీ శ్రేణులకు, అలాగే రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇచ్చేలా భువ‌నేశ్వ‌రి ప్ర‌సంగాలు వుంటే ఆక‌ట్టుకుంటాయి. అందుకు భిన్నంగా బాబు గొప్ప‌ల గురించి చెబితే విన‌డానికి జ‌నం సిద్ధంగా వుండ‌ర‌నే విష‌యాన్ని తెలుసుకోవాలి.  

భువ‌నేశ్వ‌రి మొద‌టి రోజు ప‌ర్య‌ట‌న‌లో మాత్రం ఆమె భావోద్వేగాన్ని పండించ‌లేక‌పోయారు. రాయించిన స్క్రిప్ట్‌ను గుర్తు పెట్టుకుని, త‌ప్పుల్లేకుండా తెలుగులో మాట్లాడ్డానికే ఆమె శ‌క్తి అంతా స‌రిపోయిన‌ట్టు క‌నిపించింది. ఇక టీడీపీ, ఎల్లో మీడియా ఆశించిన‌ట్టుగా క‌న్నీళ్లు కార్చ‌డానికి స‌మ‌యం ఎక్క‌డ‌? భువ‌నేశ్వ‌రి క‌న్నీళ్లు కార్చ‌క‌పోవ‌డంతో, టీడీపీ, ఎల్లో మీడియా ప‌రిస్థితి ఏడ్వ‌డం ఒక్క‌టే త‌క్కువ‌.