పవన్ సీఎం టార్గెట్ – 2033

పవన్ కళ్యాణ్ మదిలో ఏముంది? ఎప్పటికన్నా సీఎం కావాలని వుందా? లేదా? అలా వుండి వుంటే తెలుగుదేశం పార్టీని ఎందుకు అంతలా భుజాన మోస్తున్నారు. పదేళ్ల పాటు బాబుగారే సీఎంగా వుండాలి. తెలుగుదేశం- జనసేన…

పవన్ కళ్యాణ్ మదిలో ఏముంది? ఎప్పటికన్నా సీఎం కావాలని వుందా? లేదా? అలా వుండి వుంటే తెలుగుదేశం పార్టీని ఎందుకు అంతలా భుజాన మోస్తున్నారు. పదేళ్ల పాటు బాబుగారే సీఎంగా వుండాలి. తెలుగుదేశం- జనసేన బంధం పదేళ్ల పాటు వుండాలి అని చెబుతున్నారు. ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వున్నాయి. ఈ ప్రశ్నలు అన్నింటికి సమాధానం ఒక్కటే.. పవన్ మదిలో టార్గెట్ వేరే వుంది. అది టార్గెట్ 2033.

ఎస్.. పవన్ ఎన్నికలకు కొన్ని నెలల ముందు జనసేనకు సంబంధించి అతి కీలకమైన నేతలతో కలిసి ఓ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో తన మదిలోని మాటలు పంచుకున్నారు. అంతకన్నా కీలకంగా ఓ మాట చెప్పారు. విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం పవన్ తన మదిలోని మాటలు ఇలా పంచుకున్నారు.

తన టార్గెట్ 2033. అప్పటి వరకు తనతో ఓపిగ్గా వున్నవాళ్లు వుండొచ్చు. లేని వాళ్లు వెళ్లిపోవచ్చు అని పవన్ క్లారిటీగా చెప్పేసారు ఆ సమావేశంలో. 2033 నాటికి తాను సీఎం కావాలన్నది తన ప్రణాళిక అని, అంత వరకు పది మందో, ఇరవై మందో ఎంత మంది ఎమ్మెల్యేలు వుంటే అంత మందితో పార్టీని నడుపుతూ ముందుకు సాగుతానని పవన్ క్లారిటీగా చెప్పారు.

బహుశా 2033 నాటికి చంద్రబాబు రాజకీయ సన్యాసం తీసుకుంటారని పవన్ భావిస్తూ వుండొచ్చు. ఎందుకంటే అప్పటికి చంద్రబాబుకు 85 ఏళ్లు వస్తాయి. అప్పటికి తెలుగు నాట రాజకీయాలను శాసిస్తూ వస్తున్న మీడియా సత్తా కూడా అయిపోతుంది. ఆ మీడియా అండ లేకుండా తెలుగుదేశం పార్టీ ఏమీ చేయలేదు. లోకేష్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు పదేళ్లు పాలనలో వుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెరుగుతుంది. అప్పుడు సులువుగా గద్దె ఎక్కవచ్చు. ఇది పవన్ ఆలోచన కావచ్చు.

కానీ జగన్ సంగతి ఏమిటి? ఒకసారి జగన్ ఓడిపోతే, అతగాడిని చంద్రబాబు, ఆయన సామాజిక వర్గం, అను కుల మీడియా పూర్తిగా కిందకు తొక్కేసి, లేకుండా, లేవకుండా చేస్తాయని పవన్ నమ్ముతున్నారని అనుకోవాలి. అందుకే ఆయన తన టార్గెట్ ను 2033 కు పెట్టుకుని వుండొచ్చు. అదే తన మనసులోని మాటగా తన కీలక సహచరులకు చెప్పి వుండొచ్చు.

అంతా బాగానే వుంది. కానీ మాన్ ప్రపోజెస్.. గాడ్ డిస్పోజెస్ అన్న మాట వుండనే వుంది. గతంలో ఎందరో ఇలాంటి దూరాలోచనలు చేసినా, మధ్యలో ఏదో అనుకోనిది జరిగి ఆ కలలు కల్లలైన ఉదంతాలు అనేకం వున్నాయి. ఎన్టీఆర్ అనుకున్నారా? తనకు వెన్నుపోటు వుంటుందని, వైఎస్ అనుకున్నారా తాను హెలికాప్టర్ ప్రమాదం బారిన పడతానని. పివి నరసింహారావు అనుకున్నారా? రిటైర్ అయిన తనను ప్రధాని పదవి వరిస్తుందని.

అందువల్ల పవన్ పదేళ్ల టార్గెట్ పెట్టుకుని, అందుకు అడ్డం వున్న జగన్ ను ముందుగా పక్కకు తొలగించడానికి తెలుగుదేశంతో చేతులు కలిపి వుండొచ్చు. కానీ తెలుగుదేశాన్ని, దాని వెనుక వున్న బలగాలను పవన్ తక్కువ అంచనా వేస్తున్నారు. పవన్ ఎంత తెలివి కలిగిన వారైనా కావచ్చు. కానీ తెలుగుదేశం వెనుక అండగా వున్న సామాజిక వర్గాన్ని మాత్రం తక్కువ అంచనా వేస్తున్నారు. అలా వేస్తున్నారు కనుకే ఇలాంటి పదేళ్ల స్కీమ్ పెట్టుకున్నారు. ఇది ముందు ముందు పవన్ కు బాగా తెలిసి వస్తుంది.