వారెవ్వా పవన్ కళ్యాణ్: అక్కడ అలా. ఇక్కడ ఇలా

ఇంతకూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ సిద్ధాంతం ఏమిటి? అని అడిగితే అసలు ఆయనకు సిద్ధాంతం అంటూ ఉన్నదా? అనే జవాబే పలువురి దగ్గర నుంచి వినిపిస్తుంది.  Advertisement గాలివాటు వ్యక్తి…

ఇంతకూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ సిద్ధాంతం ఏమిటి? అని అడిగితే అసలు ఆయనకు సిద్ధాంతం అంటూ ఉన్నదా? అనే జవాబే పలువురి దగ్గర నుంచి వినిపిస్తుంది. 

గాలివాటు వ్యక్తి లాగా ఆవేశంతో ఊగిపోయి మాట్లాడుతూ రాజకీయ వేదికల మీద కూడా సినిమా తరహాలో ప్రజలను రంజింపజేసే పవన్ కళ్యాణ్.. రాజకీయంగా ఒక సిద్ధాంతానికి కట్టుబడి దాని ప్రకారం తమ పార్టీ గమనాన్ని ముందుకు తీసుకు వెళుతున్నారా లేదా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాలలో నడుస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల సీజన్ కాక మీద ఉండగా భారతీయ జనతా పార్టీతో కలిసి ఉమ్మడిగా ఎన్నికలలో పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భావిస్తున్నారు.

2018 ఎన్నికల సమయంలో ఈ రెండు పార్టీలు ఒంటరిగానే, విడివిడిగా పోటీ చేశాయి. జనసేన పార్టీ పరువు మొత్తం సాంతం దిగజారిపోయింది. బిజెపి పరిస్థితి కూడా అంతే. జనసేన బోణీ కొట్టలేదు భారతీయ జనతా పార్టీ సింగిల్ సీటు మాత్రమే గెలిచి తమ పతనాన్ని చాటుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న కారణంగా.. బిజెపి కొంత మనుగడను కాపాడుకుంటూ వచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో నలుగురు గెలిచారు.

తర్వాత పార్టీ హడావుడి పెరిగింది. ఈసారి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మేమే అని చెప్పుకునే స్థాయికి వెళ్లారు. తీరా ఇప్పుడు ఎన్నికల గంట మోగిన తర్వాత.. బిజెపి.. పొత్తు పార్టీలను వెతుక్కునే ప్రయత్నంలో ఉంది. జనసేన పార్టీ ఎన్డీయేలో భాగస్వామి అనే సంగతి ఇప్పుడు హటాత్తుగా గుర్తుకొచ్చినట్టుంది. ఇటీవల ఒకసారి పవన్ తో చర్చలు జరిపిన కిషన్ రెడ్డి, బుధవారం పొత్తులు ఫైనల్ చేయబోతున్నారు.

అసలు పవన్ వైఖరి ఏమిటి? బిజెపి అంటరాని వ్యక్తిగా చూస్తున్న చంద్రబాబునాయుడుతో ఏపీలో అంటకాగుతున్నారు. ఇక్కడ కమలదళం దోస్తీకి కన్నుగీటుతోంటే.. భలే ఆఫర్ అనుకుంటూ స్పందిస్తున్నారు. ఏపీలో మాత్రం చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం అని చెబుతుండే పవన్ కల్యాణ్‌కు.. తెలంగాణలో హైదరాబాదును తానే నిర్మించానని గప్పాలు కొట్టుకునే చంద్రబాబు దార్శనికత ఇక్కడ అవసరం అనిపించడం లేదా?

పరిశీలించి చూస్తే తన పార్టీ నెగ్గడానికి , ఎవరైతే నిచ్చెన మెట్ల లాగా ఉపయోగపడగలరో.. వారి చెంతకే పవన్ చేరుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇక్కడ బిజెపికి ఉన్న బలాన్ని వాడుకుని కొన్ని సీట్లు, అక్కడ తెదేపా బలాన్ని వాడుకుని మరికొన్ని సీట్లు గెలవవచ్చుననే రాజకీయ వ్యూహంతో పవన్ అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది.