తన చేతుల్లో ఏమీ లేదన్న పవన్?

మూడు రోజుల పాటు విశాఖలో కూర్చుంటా అన్నారు. మూడు జిల్లాల పార్టీ కార్యక్రమాల పరిశీలన అన్నారు. కానీ ఒక్క రోజుతోనే సరిపోయింది. రెండు గంటలు కొణతాల రామకృష్ణ ఇంట్లో, ఓ పెళ్లి ఫంక్షన్ కు…

మూడు రోజుల పాటు విశాఖలో కూర్చుంటా అన్నారు. మూడు జిల్లాల పార్టీ కార్యక్రమాల పరిశీలన అన్నారు. కానీ ఒక్క రోజుతోనే సరిపోయింది. రెండు గంటలు కొణతాల రామకృష్ణ ఇంట్లో, ఓ పెళ్లి ఫంక్షన్ కు పలకరింపు. 42 మంది పార్టీ ప్రతినిధులతో సమావేశం.. బస్ అంతే. మళ్లీ ఛలో రాజమండ్రి. అంతే… అంతేనా? అంతే.. కాదు కీలమైన రెండు విషయాలు వున్నాయని పార్టీ వర్గాల భోగట్టా.

కొణతాలకు బుజ్జగింపు

పవన్ కళ్యాణ్ విశాఖలో ముందుగా పెట్టుకున్న పని కొణతాల రామకృష్ణను బుజ్జగించడం. అనకావల్లి ఎంపీగా పోటీ చేద్దామనుకున్నారు జనసేన టికెట్ మీద. కానీ అక్కడకు నరసాపురం నుంచి నాగబాబు ఎగిరి వచ్చారు. దాంతో కొణతాల అలిగారు. అందుకే పవన్ వచ్చి రెండు గంటలు కొణతాలతో కూర్చున్నారు. అరగంట వన్ టు వన్ కూర్చున్నారు. గంటన్నర కుటుంబ సభ్యులతో.

అనకాపల్లి ఎమ్మెల్యే ప్లేస్ జనసేనకు వచ్చేలా ప్రయత్నిస్తానని, అలా వస్తే కనుక కొణతాలనే పోటీ చేయాల్సి వుంటుందని చెప్పారు. అలా కాకపోయినా నాగబాబు విజయం కోసం కృషి చేయాలని కోరారు. కొణతాలను హైదరాబాద్ వచ్చి, తనతో మరి కాస్సేపు పార్టీ వ్యవహారాలు చర్చించాలని కోరారు. కొణతాల కూడా ఇప్పుడు కోట్లకు కోట్లు ఖర్చు చేసి పోటీ చేసే పరిస్థితుల్లో లేరు. అందుకే మౌనంగా వుండిపోయారు.

పార్టీ జనాలకు క్లారిటీ

తరువాత పార్టీ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. తన చేతిలో ఏమీ లేదు. జగన్ ను ఓడించాలి అనే ఉమ్మడి లక్ష్యంతో ముందుకు వెళ్తున్న వేళ కొన్ని త్యాగాలు తప్పవు. కోరుకున్న సీట్లు అన్నీ దక్కుతాయనే గ్యారంటీ లేదు.

ఉదాహరణకు పెందుర్తి ఇవ్వమని అడుగుతున్నాం, రాజమండ్రి అడుగుతున్నాం. కానీ ఆ రెండు చోట్ల బండారు సత్యనారాయణ, బుచ్చయ్య చౌదరి చాలా బలంగా పట్టుదలగా వున్నారు తెలుగుదేశం తరపు నుంచి. అందువల్ల మనకు వస్తే మంచిదే. లేదూ అన్నా పార్టీ కోసం పని చేయాల్సిందే అని పవన్ క్లారిటీ ఇచ్చారు.

అలా కాకుండా మాకు రాలేదు.. మాకు రాలేదు అని కిందా మీదా అయిపోతాం అనుకునేవారు ఇప్పుడే పార్టీ నుంచి వెళ్లిపొవచ్చు. అంతే తప్ప తరువాత అల్లరి పెట్టద్దు అనే విధంగా కూడా పవన్ చిన్న హెచ్చరిక ఇచ్చినట్లు విశ్వసనీయ పార్టీ వర్గాల భొగట్టా.

ఇక రాజమండ్రికి

ఇదే విధమైన క్లారిటీ రాజమండ్రిలో కూడా ఇవ్వాల్సి వుంది. అందుకే విశాఖ నుంచి అక్కడకు బయల్దేరారు. త్వరలో ఢిల్లీ వెళ్లాల్సి వుండడం, ఆ వెంటనే ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు అనేది తెలుగుదేశం, జనసేన, భాజపా నుంచి ప్రకటించాల్సి రావడం తప్పదు. అందువల్ల దీనికి గ్రౌండ్ ప్రిపరేషన్ లో భాగంగా పవన్ ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి పర్యటనలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

మొత్తం మీద చూస్తుంటే పవన్ చాలా పద్దతిగా స్ట్రాటజీ అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. కానీ పవన్ మాట పార్టీ జనాలు వింటారా? టికెట్ ల ప్రకటన తరువాత సైలంట్ గా వుంటారా? వుండరా? అన్నదే చూడాలి.