కమలం ట్రాప్ లో పవన్ కల్యాణ్!

‘మీ ఆటలోకి నేను రాలేదురా.. నా ఆటలోకి మీరు వచ్చారు’ అనే తరహా డైలాగులు మనకు చాలా సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఎదుటివాడి మైండ్ గేమ్ కు లోబడినట్లే చివరివరకు కనిపిస్తూ.. చివరగా, ఎదుటివాడినే…

మీ ఆటలోకి నేను రాలేదురా.. నా ఆటలోకి మీరు వచ్చారు’ అనే తరహా డైలాగులు మనకు చాలా సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఎదుటివాడి మైండ్ గేమ్ కు లోబడినట్లే చివరివరకు కనిపిస్తూ.. చివరగా, ఎదుటివాడినే మనం ఆడుతున్న మైండ్ గేమ్ ప్రకారం వాడు నడుచుకునేలా చేస్తే ఇలాంటి పంచ్ డైలాగులతో సినిమాను రక్తికట్టిస్తుంటారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో కూడా అచ్చంగా అదే జరుగుతోంది. 

పవన్ కల్యాణ్ ఇప్పుడు తన భుజబాలన్ని చూసుకుని పొంగిపోతున్నాడు. అటు ఏపీలో తెలుగుదేశాన్ని, ఇటు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఉద్ధరించాల్సిన గురుతర బాధ్యత తన మీదనే ఉన్నదని.. తాను లేకపోతే వారికి దిక్కులేదని బహుశా ఆయన మురిసిపోతూ ఉండవచ్చు. కిషన్ రెడ్డి మంతనాలు సాగించిన మరురోజే ఎగబడి ఢిల్లీ వెళ్లిపోయి అమిత్ షా తో సాగించిన మంతనాల ఆంతర్యం కూడా ఇదే కావొచ్చు. అయితే పవన్ కల్యాణ్ కు అర్థం కాని సంగతి ఏంటంటే.. ట్రాప్ అనే పదం వాడితే చాలా చిన్నది.. కమలదళం పన్నిన ఉచ్చులోనే పవన్ కల్యాణ్ పీకలదాకా కూరుకుపోతున్నాడు. ఎలాగో చూద్దాం..

నిన్న మొన్నటి దాకా తెలంగాణలోని భారతీయ జనతా పార్టీ, పవన్ కల్యాణ్ నడుపుతున్న జనసేనను గత నాలుగేళ్లుగా ఒక అంటరానిపార్టీగానే చూస్తూ వచ్చింది. ఎన్డీయేలో జనసేన భాగస్వామి కదా.. అనే ప్రస్తావన ఎన్నడైనా కమలనాయకుల ముందు వస్తే.. ఆ బంధం ఏపీకి మాత్రమే పరిమితం అని పుల్లవిరుపుగా చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చేశాయి. తెలంగాణ బిజెపి.. పవన్ కల్యాణ్ కు ఈ రాష్ట్రంలో ఉండే బలం మీద ఆశ పెంచుకుంటున్నట్టుగా వారు బయటకు కనిపిస్తున్నారు. పవన్ ను వారు ఆశ్రయించడమూ.. ఆయన ఉప్పొంగిపోవడమూ.. ఢిల్లీ వెళ్లి అమిత్ షా తో కూడా భేటీ కావడమూ జరుగుతోంది.

ఏపీలో చంద్రబాబునాయుడు పల్లకీ మోస్తూ ఊరేగాలని అనుకుంటున్న పవన్ కల్యాణ్, తెలంగాణలో కమలంతో దోస్తీకి, కలిసి పోటీచేయడానికి సై అనడం కొందరికి చిత్రంగా కనిపించవచ్చు. అయితే ఈ రాష్ట్రంలో జనసేనకు కూడా ఏమాత్రం ఠికానా లేదు. 32 స్థానాల్లో పోటీచేస్తాం అని ఆ పార్టీ ప్రకటించింది గానీ.. వారికి అభ్యర్థులు ఉన్నారో దేవులాడుకోవాలో వారికే తెలియదు. పోటీచేస్తే ఎన్ని ఓట్లు వస్తాయో కూడా తెలియదు. 

బిజెపి పరిస్థితి కూడా పెద్ద గొప్పగా ఏం లేదు. అధికారం మాదే అని ప్రగల్భాలు పలికిన పార్టీ ఇప్పుడు డబల్ డిజిట్ సీట్లు సాధిస్తుందా లేదా తెలియని స్థితిలో ఉంది. ఈ రెండు పార్టీలు కలిస్తే ఏమవుతుంది? జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలినట్లుగా తయారవుతుందనేది పలువురి అంచనా.

బిజెపి మాస్టర్ ప్లాన్!

పవన్ తో తెలంగాణలో పొత్తు పెట్టుకోవడంలో బిజెపి మాస్టర్ ప్లాన్ ఒకటి ఉంది. పృష్ట తాడనాత్ దంత భంగః అని సంస్కృతంలో ఒక సామెత ఉంటుంది. వీపుమీద తంతే మూతి పళ్లు రాలుతాయని దాని అర్థం. అటువంటి మాస్టర్ ప్లాన్ అది. తెలంగాణలో పవన్ తో పొత్తులు పెట్టుకుంటే.. ఏపీలో చంద్రబాబునాయుడును అధికారంలోకి రాకుండా చేయవచ్చుననేది ఆ మాస్టర్ ప్లాన్. చిత్రంగా అనిపించిన దీనికి తగిన లాజిక్ ఉంది.

తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో మనుషుల్ని మోహరించగల సత్తా ఎటూ భాజపాకు సొంతంగా లేని నేపథ్యంలో.. జనసేన ఆసరా తీసుకుంటోంది. అక్కడా పుకార్లు వినిపిస్తున్న రీతిలో జనసేనకు 30 సీట్లు ఇవ్వడానికి వారికి పెద్ద అభ్యంతరాలు ఉండకపోవచ్చు. 

పవన్ కల్యాణ్ కూడా భాగ్యనగరం పరిధిలోను, సెటిలర్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోను మాత్రమే సీట్లు కావాలని కోరుకుంటాడు. ఆ నేపథ్యంలో ఏపీలో చంద్రబాబునాయుడు పల్లకీ తాను మోస్తున్నాను గనుక.. కమ్మవాళ్లందరూ తనను నెత్తిన పెట్టుకుంటారని.. సెటిలర్ల ఓట్లు అందులోనూ కమ్మఓట్లు అధికంగా ఉండే సీట్లను పవన్ కల్యాణ్ కోరుకోవడం సహజం. అయితే.. తెలంగాణలో కమ్మవాళ్లు జనసేనకు ఓట్లు వేస్తారనుకోవడం భ్రమ. కొండొకచో కొన్ని ఓట్లు పడినా కూడా.. గెలిచేంత సీన్ మాత్రం ఉండదు. 

చంద్రబాబు అరెస్టు వెనుక కీలక భూమిక పోషించారని బిజెపి మీద అనుమానాలు ఉన్న నేపథ్యంలో.. కమ్మ వర్గం బలంగా నమ్ముతున్న నేపథ్యంలో.. అదే బిజెపిని అధికారంలోకి తీసుకురావడానికి సెటిలర్లలోని కమ్మవాళ్లు సహకరించరు గాకర సహకరించరు. భారతీయ జనతా పార్టీకి నిజంగా బలం ఉండి, వారు గెలిచే అవకాశం ఉన్న స్థానాలను ఒక్కటంటే ఒక్కటి కూడా వారు జనసేనకు ఇవ్వరనేది కూడా నిజం. ఆ రకంగా పవన్ కల్యాణ్ పార్టీ తెలంగాణలో ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా భంగపడడం తథ్యం.

ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం.. ఏపీలో ఓటింగ్ సరళి మీద దారుణంగా పడుతుంది. కమ్మవాళ్లు తెలంగాణలో బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా జనసేన ఓడిపోతే.. ఏపీలోని కాపు వర్గం అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. మండిపడుతుంది. కుట్రపూరితంగా కమ్మవాళ్లు పవన్ కల్యాణ్ కు ద్రోహం చేశారని రెచ్చిపోతుంది. దాని ఫలితం.. ఏపీలో కాపు వర్గం ఓట్లు తెలుగుదేశానికి దూరం అవుతాయి. తెలుగుదేశాన్ని వారు అక్కడ శత్రువులా చూస్తారు. ఫలితం జనసేన సీట్ల సంగతేమో గానీ.. జనసేన కాపు ఓట్లను నమ్ముకున్న తెలుగుదేశం సీట్లు మాత్రం గల్లంతవుతాయి.

చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడానికి భారతీయ జనతా పార్టీ వేసిన మాస్టర్ ప్లాన్ లాగా ఇది కనిపిస్తోంది. ఈ ఉచ్చులో పవన్ కల్యాణ్ అమాయకంగా చిక్కుకున్నారు. వారై వచ్చి బతిమాలారు గనుక.. తాను మహానుభావుడినని పవన్ కల్యాణ్ కు అనిపిస్తే అనిపించవచ్చు గాక.. కానీ అసలు సంగతి ఇదీ అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.