డిక్టేట్ చేసే స్థితిలో పవన్: బాబుకు గతిలేదు!

చంద్రబాబునాయుడు- తనది నలభై నాలుగేళ్ల రాజకీయ అనుభవం అని.. తనను మించిన మొనగాడు ఈ దేశంలోనే రాజకీయాల్లో లేనే లేరని అనుకునే రోజులు పాతబడిపోయాయి. ఆయన వైభవం గతించిపోయింది. నేను చెప్పినట్టు రాజకీయాల్లో ప్రతిదీ…

చంద్రబాబునాయుడు- తనది నలభై నాలుగేళ్ల రాజకీయ అనుభవం అని.. తనను మించిన మొనగాడు ఈ దేశంలోనే రాజకీయాల్లో లేనే లేరని అనుకునే రోజులు పాతబడిపోయాయి. ఆయన వైభవం గతించిపోయింది. నేను చెప్పినట్టు రాజకీయాల్లో ప్రతిదీ నడవాలనుకుంటే.. ఆయన చెప్పుకుంటూ కూచోవాల్సిందే.. వినేవాళ్లు ఎవరూ ఉండరు. 

తన ప్రాభవానికి గండిపడిన తర్వాత.. వేరే గతిలేక పవన్ కల్యాణ్ మద్దతు మీద ఆధారపడుతున్న చంద్రబాబునాయుడు.. జనసేనాని ఏం చెబితే అది చేయాల్సిన పరిస్థితి. చంద్రబాబునాయుడు గతిలేనితనాన్ని ఆసరాగా చేసుకుని.. పవన్ కల్యాణ్ తాను టర్మ్స్ డిక్టేట్ చేస్తున్నారు. చంద్రబాబునాయుడు ఫాలో అవ్వాల్సి వస్తోంది.

రెండు పార్టీలు కలిసి ఉమ్మడి కార్యచరణ ప్రణాళికకు సిద్ధం అవుతున్నాయి. రెండు పార్టీల కీలక నాయకులతో 9న ఒక భేటీ అనుకుంటున్నారు. వీరిద్దరూ తప్ప.. పార్టీ నాయకులు హాజరై కలిసి ఎలా పనిచేయాలో డిసైడ్ చేస్తారట. రెండు పార్టీల నాయకులు కలిసి ప్రజల్లోకి వెళ్లడం.. ఇంటింటికీ తిరగడం ద్వారా.. వీరిద్దరూ ఐక్యంగానే ఉన్నారనే భావనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆరాటపడుతున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో తేవాలని కూడా అనుకుంటున్నారు. 

ఇప్పటికే తెలుగుదేశం ఆరు అంశాలతో మినీ మేనిఫెస్టో అంటూ ఒక ప్రహసనం నడిపించింది. పవన్ కల్యాణ్.. ఆచరణలో ఎవ్వరికీ అర్థం కాని విషయాలతో మేనిఫెస్టో అంటూ కొంత హడావుడి చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ప్రతిపాదించే అంశాలన్నిటినీ కూడా.. ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టాలనేది ప్రణాళిక. నిజానికి చంద్రబాబునాయుడు దసరానాటికే మేనిఫెస్టో తెస్తామని అన్నారు గానీ.. ఆయన జైల్లో ఉన్నందున అది సాధ్యం కాలేదు. ఇప్పుడు పవన్ ప్రతిపాదనలు జత కలుస్తున్నాయి.

అయితే పార్టీ వర్గాల ద్వారా స్థూలంగా తెలుస్తున్నదేంటంటే.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు పవన్ కల్యాణ్ ఎలా చెబితే అలా ఆడే స్థితిలో ఉన్నారు. పవన్ మాట ప్రకారం పోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే.. చంద్రబాబునాయుడు ప్రస్తుతం అనారోగ్యం మిష మీద వచ్చిన బెయిలుపై మాత్రమే ఉన్నారు. 

ఈనెల 28 నాటికి మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన లొంగిపోవాలి. రెగులర్ బెయిల్ దక్కుతుందో లేదో తెలియదు. ఒకవేళ దక్కినా సరే.. ఆయన మీద పుంఖాను పుంఖాలుగా నమోదు అవుతున్న అవినీతి కేసులకు సంబంధించి ఇంకా ఎన్నిసార్లు అరెస్టు అవుతారో.. ఎంతకాలం జైల్లో ఉండాల్సి వస్తుందో క్లారిటీ లేదు. 

నారా లోకేష్ చూస్తే పలాయనమంత్రం పఠించడమే తప్ప పార్టీని నడిపించే స్థితిలో లేరు. ఈ పరిస్థితుల్లో జనాకర్షణ ఉన్న వ్యక్తిగా.. మాటలతో విరుచుకు పడగల పవన్ కల్యాణ్ మీద అతిగా ఆధారపడుతున్నారని, అది తప్ప చంద్రబాబుకు ఇంకో గతిలేదని తెలుస్తోంది.