ప‌వ‌న్ మాట మార్చినా మార్చేయ‌గ‌ల‌డు!

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబుకు ద‌త్త‌పుత్రుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌చూ ఆరోపిస్తూ ఉంటుంది. మ‌రి ఆ సంగ‌తేమో కానీ, పొత్తుల‌ను మార్చ‌డంలోనూ, అటు ఎర్ర‌జెండాతోనూ, ఇటు కాషాయ జెండాతోనూ పొత్తు…

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబుకు ద‌త్త‌పుత్రుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌చూ ఆరోపిస్తూ ఉంటుంది. మ‌రి ఆ సంగ‌తేమో కానీ, పొత్తుల‌ను మార్చ‌డంలోనూ, అటు ఎర్ర‌జెండాతోనూ, ఇటు కాషాయ జెండాతోనూ పొత్తు పెట్టుకోగ‌ల నేర్పు ఉన్న‌ది చంద్ర‌బాబు త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ కే! ఒక ఎన్నిక‌ల్లో ఎర్ర‌పార్టీల‌తో క‌లిసి వెళ్లగ‌ల చంద్ర‌బాబు ఆ త‌ర్వాతి ఎన్నిక‌ల్లో అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టుగా కాషాయ పార్టీతోనూ వెళ్ల‌గ‌ల‌డు. వీరిద్ద‌రినీ కాద‌ని కాంగ్రెస్ తో వెళ్లిన ఘ‌న చ‌రిత్ర కూడా చంద్రబాబుకే ఉంది!

2009 ఎన్నిక‌ల్లో క‌మ్యూనిస్టులు-టీఆర్ఎస్ తో చంద్ర‌బాబు పొత్తు పెట్టుకున్నారు. 2014లో బీజేపీతో పొత్తుతో ఎన్నిక‌ల‌కు వెళ్లారు. 2019 నాటికి అటు ఎరుపు ద‌ళానికి, మ‌రోవైపు కాషాయ‌ద‌ళానికి, ఇంకా గులాబీ ద‌ళానికి కూడా వ్య‌తిరేకంగా కాంగ్రెస్ తో జ‌త క‌ట్టి పోటీ చేశారు చంద్ర‌బాబు! మ‌రి ఈ ఊస‌ర‌వెల్లి ల‌క్ష‌ణాలు ప‌వ‌న్ లోనూ బాగా క‌నిపిస్తాయి.

ప్ర‌జారాజ్యం అప్పుడు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అంద‌రికీ వ్య‌తిరేకం, క‌మ్యూనిస్టుల‌కు కూడా! ఆ పై జ‌న‌సేన ఆవిర్భావంతో కాషాయ జెండా, ప‌చ్చ జెండాల‌ను భుజాన వేసుకుని న‌డిచాడు. ఆ త‌ర్వాతి ఎన్నిక‌ల్లోనేమో ఎర్ర‌జెండాల‌తో క‌లిసి ఎగిరాడు! బ‌హుజ‌న జెండాను కూడా అవ‌స‌రానికి భుజాన వేసుకున్నాడు. మ‌రి ఎర్ర‌పార్టీలతో ఉన్న‌ప్పుడేమో చేగువేరా అంటాడు, కాషాయ పార్టీతో క‌లిస్తే గాడ్సేను కీర్తిస్తారు! ఇలా చంద్ర‌బాబుకు ఏ మాత్రం తీసిపోకుండా ప‌వ‌న్ రాజ‌కీయం సాగుతూ ఉంది.

మ‌రి ఇటీవ‌లే తెలుగుదేశం పార్టీతో పొత్తు అంటూ ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. టీడీపీతో పొత్తు అని, టీడీపీ నేత‌లు ఏదైనా ఒక మాట అన్నా భ‌రించాల‌ని చెప్పిన ప‌వ‌న్, రేపోమాపో మ‌ళ్లీ అభిమానుల ముందుకు వస్తే.. పొత్తుల సంగ‌తి ఎన్నిక‌లప్పుడు అంటూ వారిని ఊర‌డించే ప్ర‌య‌త్నం చేసినా చేయొచ్చు!

అస‌లు ఏ పొత్తూ లేదు.. అన్ని సీట్లలో అంటూ కూడా మాట్లాడొచ్చు! లేదా పొత్తు పొత్తే అంటూ ప్ర‌క‌టించొచ్చు! ఆ మ‌రుస‌టిరోజు అయినా ప‌వ‌న్ మ‌ళ్లీ మాట మార్చొచ్చు. ప‌వ‌న్ లో ఎలాంటి స్థిర‌త్వం లేదు. జీవితంలో ఎంతో కీల‌కం అయిన వివాహం విష‌యంలోనే ప‌వ‌న్ అభిప్రాయాలు బోలెడ‌న్ని సార్లు మారాయి. అలాంటి వ్య‌క్తికి రాజ‌కీయంగానో, సిద్దాంతాల ప‌రంగానో స్థిర‌త్వం ఉంటుంద‌నుకోవ‌డం భ్ర‌మ‌! ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్య‌వ‌హారంలో స్థిర‌త్వం ఏదైనా ఉందంటే అది కేవ‌లం చంద్ర‌బాబు ప్ర‌యోజ‌నాల‌కు ఉప‌యోగ‌ప‌డ‌టంలో మాత్ర‌మే!