తెలుగు మీడియా మొఘల్ రామోజీరావు గ్రూపు నుంచి మరొక మాస పత్రిక మూతపడింది. సుమారు అయిదున్నర దశాబ్దాలకు పైగా సుదీర్ఘకాలం తెలుగు రైతన్నలకు విశిష్టమైన సేవలు అందించిన పత్రిక అన్నదాతను మూసివేస్తున్నట్లుగా సంపాదకుడు అమిర్నేని హరికృష్ణ పేరుతో ప్రకటన విడుదల అయింది. మారుతున్న టెక్నాలజీని మాసపత్రిక మూసివేతకు ప్రధాన కారణంగా ఈ ప్రకటనలో పేర్కొన్నారు. అన్నదాత అనే టీవీ కార్యక్రమం రూపంలో రైతులకు ఎప్పటికప్పుడు వ్యవసాయానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని తాము తెలియజేస్తున్నామని, ఇక మాస పత్రిక అవసరం తగ్గినట్లు భావిస్తున్నామని అందుకే మూసివేస్తున్నట్లుగా పేర్కొన్నారు. వ్యవసాయానికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు చేరిపోతున్నందువలన మాస పత్రికల ప్రాధాన్యం తగ్గినట్లుగా విశ్లేషించారు.
రామోజీ గ్రూపు నుంచి మరొక పత్రిక మూత పడింది. సంపాదకుడు పేరుతో ప్రకటన వచ్చింది. యజమానులకు సంబంధించిన ఎవ్వరూ ఈ విషయంపై మాట్లాడలేదు. అయితే కాస్త లోతుగా విశ్లేషించినప్పుడు అన్నదాత మూసివేత వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయని అర్థమవుతోంది. అవన్నీ వ్యాపారపరమైనవి. అన్నదాతను వ్యాపార పరంగా సక్సెస్ ఫుల్‌గా నిర్వహించడంలో వారి వైఫల్యాలకు సంబంధించినవి.
వివరాల్లోకి వెళితే… అన్నదాత మాసపత్రిక తెలుగు నాట రైతులకు ఎంతో విలువైన సమాచారాన్ని అందించడంలో చాలా పేరు తెచ్చుకుంది. ఒక చరిత్రను సృష్టించింది. సమాచారం పరంగా తెలుగు రైతులకు తిరుగులేని రీతిలో విషయాలను అందించింది. అందులో సందేహం లేదు.
వ్యాపారం విషయానికి వచ్చేసరికి కొన్ని లక్షల కాపీల సర్కులేషన్ ఉన్న ఏకైక తెలుగు మాసపత్రికగా కీర్తి గడించింది. సమాజంలో అన్ని వర్గాలను ఉద్దేశించి వెలువరించే పత్రికలే వేల కాపీలు అమ్ముకోవడానికి కిందా మీదా పడుతోంటే కేవలం ఒక్క వ్యవసాయరంగాన్ని మాత్రమే ఉద్దేశించిన అన్నదాత మాత్రం లక్షల కాపీల సర్కులేషన్ అనే రికార్డు ఘనతను ఎలా సాధించింది అనేది చాలామందికి తెలియదు. ఈనాడు గ్రూపునకే చెందిన అన్నదాత కు ఆ సంస్థ దన్ను ఎప్పటికీ ఉంటుంది. దానిని వాడుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సంఘాలకు ఇతరత్రా రైతు అనుబంధ వ్యవస్థలకు ప్రభుత్వమే కొని సరఫరా చేసేలా అన్నదాత ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
అంటే.. జిల్లాలో ఉండే అన్ని రైతు సంఘాలకు కలిపి జిల్లా వ్యవసాయ కార్యాలయంలో అన్నదాతకు ఒకే చెక్కు రూపంలో చందా చెల్లిస్తారన్నమాట. సదరు జిల్లాలో ఉండే వేల సంఘాలకు స్వయంగా అన్నదాత యాజమాన్యం పోస్టులో పత్రికను పంపిస్తుంది. పోస్ట్ ఖర్చులు ఎటు సబ్సిడీ గానే వస్తాయి. ఆ పోస్టులో పత్రికలు ఆ సంఘాలకు రైతులకు అందాయో లేదో ఎవ్వరూ పట్టించుకోరు. మరో కామెడీ ఏంటంటే జిల్లా ఆఫీసుల్లో ప్రతినెలా వందల అన్నదాత పుస్తకాలు మురుగుతూ ఉండేవి. గ్రామాల్లో కొందరు రైతులు అన్నదాతకు నిజంగా చందా కట్టి తెప్పించుకుంటే.. మరికొందరికి తమ ఇంటికి అన్నదాత ఎందుకు వస్తుందో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితి ఉండేది.
ప్రభుత్వాలు మారినా సరే ఈనాడు హవా చెలరేగుతూ ఉంటుంది గనుక అన్నదాత సర్కులేషన్ పెద్దగా పడిపోయేది కాదు. అయితే ఇటీవలి కాలంలో రోజులు మారాయి. ప్రభుత్వమే వ్యవసాయ శాఖ తరపున సొంతంగా ఒక వ్యవసాయ పత్రికను నడుపుతోంది. నిత్యం పాత మేగజైన్లలో ఉండే సమాచారాన్ని మళ్లీ ముద్రించడం రైతులకు పంచిపెట్టడం అలవాటు చేసుకున్న అన్నదాతకు కొత్తతరం వ్యవసాయ జర్నలిజం తో పోటీ పడటం చేతకాలేదు. దానికి తగ్గట్టుగా అసలే మార్కెట్ పడిపోయింది.
ప్రభుత్వం ద్వారా వేల, లక్షల చందాలు కట్టించుకుని దందా సాగించాలంటే జగన్ ప్రభుత్వం హయాంలో జరిగే పని కాదు. ఈనాడు రుబాబు అక్కడ చెల్లుబాటు కాదు. మరి సర్కులేషన్ పడిపోయింది. ఆదాయం లేనప్పుడు రామోజీరావు ఎలాంటి వ్యాపారాన్నైనా తృణప్రాయంగా వదిలించుకుంటారనేది అందరికీ తెలుసు. ఎమోషనల్ అనుబంధం, వ్యవసాయానికి సేవ.. లాంటి పేర్లతో నష్టాలను నెత్తిన మోయడానికి ఆయన సిద్ధంగా ఉండరు అనే సంగతి అన్నదాత మూసివేతతో మరొకసారి నిరూపణ అవుతోంది.
గతంలో తెలుగు భాషకు సేవ చేయడానికి అనే ముసుగులో రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రచురిస్తూ వచ్చిన తెలుగు వెలుగు పత్రికను అర్థంతరంగా తాము ఆశించిన లాభాలు వచ్చేలా అమ్ముకోలేక మూసేసిన సంగతి అందరికీ తెలుసు. అప్పటికి ఓమోస్తరు లాభాల్లోనే ఉన్నదానిని మూసేసిన రామోజీరావు, గుదిబండగా మారుతున్న దానిని ఎందుకు కొనసాగిస్తారు?
ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయల చందా బిల్లులు వసూలు చేసుకునే మార్గాలు అన్నదాతకు మూసుకుపోయాయి. ఇక ఈ దందా కొనసాగించడం కష్టం అని రామోజీరావుకు అర్థమైంది. అందుకే మరిన్ని నష్టాలు చుట్టుముట్టక ముందే.. మూసివేత నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. అన్నదాత మూసివేతతో రామోజీరావు మీడియా వ్యాపారంలో మరో మూల స్తంభం కూలిపోయినట్టే. రామోజీరావు తెలుగు మీడియా మొఘల్ అని పిలుచుకునే ఆయన అభిమానులు ఇప్పుడు పునరాలోచించాల్సిన సమయం వచ్చింది.